లక్ష్యం 2.75 కోట్లు


Thu,June 27, 2019 12:39 AM

-జూలై మొదటి వారంలో అధికారికంగా హరితహారం ప్రారంభం
-3 లక్షల గుంతలు తీసే ప్రక్రియ పూర్తి
-ఈ ఏడాది అడవుల పెంపుపై ప్రత్యేక దృష్టి..
-గతేడాది 1.66 కోట్ల మొక్కలను నాటిన జిల్లా యంత్రాంగం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని వచ్చే నెలలో అధికారికంగా ప్రారంభించేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు. అయితే జిల్లా అంతటా ప్రస్తుతం గుంతలు తీసే ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షంతో జిల్లాలోని పలు మండలాల్లో మొక్కలు నాటే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే మిగతా మండలాల్లో వర్షం కురిసిన వెంటనే మొక్కలు నాటే విధంగా సంబంధిత అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను నాటేందుకుగాను నర్సరీల్లో మొక్కలను కూడా సిద్ధం చేశారు. అయితే గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా హరితహారం కార్యక్రమంలో అన్ని శాఖలను భాగస్వాములను చేసేలా ఆయా శాఖలకు నాటాల్సిన మొక్కల లక్ష్యాలను అటవీ శాఖ అధికారులు సిద్ధం చేశారు. అంతేకాకుండా ఈ ఏడాది అడవులను పెంచేందుకుగాను జిల్లాలోని ఆయా అటవీ ప్రాంతంలో మొక్కలను నాటేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. అదేవిధంగా గతేడాది నాటిన మొక్కల్లో 81 లక్షల మొక్కలు మాత్రమే బతకడంతో ఈ ఏడాది మొక్కలను నాటడంతోపాటు వాటి సంరక్షణకు కూడా చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఈ ఏడాది అడవులను పెంచడంపై జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లావ్యాప్తంగా 800 ఎకరాల్లోని అటవీ ప్రాంతంలో మొక్కలు నాటేలా అటవీ శాఖ అధికారులు ప్రణాళికను రూపొందించారు. జిల్లాలోని ధారూర్, తాండూర్, అన్నాసాగర్, తట్టేపల్లి, కల్కొడ, వికారాబాద్ అటవీ ప్రాంతంలోని బుగ్గ రామేశ్వరం ఆలయ పరిసరాల్లో అడవి మొక్కలను నాటనున్నారు. టేకు మొక్కలతోపాటు చైనా బాదం, కానుగ, నెమలి నార తదితర మొక్కలను నాటేందుకు సిద్ధం చేస్తున్నారు.

ప్రతీ మొక్కను బతికించేలా జిల్లా యాంత్రాంగం చర్యలు
తెలంగాణకు హరితహారంలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 2.75 కోట్ల మొక్కలను నాటాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా నిర్ణయించింది. అదేవిధంగా మొక్కలను నాటిన అనంతరం విస్మరించడం కాకుండా ప్రతీ మొక్కను బతికించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టనుంది. అంతేకాకుండా హరితహారంలో భాగంగా మొక్కలను నాటేందుకు గుంతలను తీసే ప్రక్రియ నుంచి మొక్కలు నాటే ప్రక్రియ వరకూ ప్రతీ మొక్కకు జియోట్యాగింగ్ చేయనున్నారు. ఈ ఏడాది ప్రధానంగా టేకు, శ్రీగంధం, ఉసిరి, నల్లమద్ది, తెల్లమద్దితో పాటు పూలు, పండ్ల మొక్కలలతో పాటు జామ, నిమ్మ, సీతాఫల్, దానిమ్మ, పప్పాయ, మునగ, గులాబీ, మందారం, మల్లె, కానుగ, నెమలినార తదితర మొక్కలను నాటనున్నారు.

అయితే ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 3 లక్షల గుంతలు తీసే ప్రక్రియ పూర్తయ్యింది. ఈ దఫా హరితహారంలో భాగంగా ఆయా జిల్లా శాఖలకు నిర్దేశించిన లక్ష్యానికి సంబంధించి.., అటవీ శాఖ-15 లక్షలు, డీఆర్‌డీఏ -80 లక్షలు, విద్యాశాఖ-12 లక్షలు, ఎక్సైజ్ శాఖ-10 లక్షలు, వైద్యారోగ్య శాఖ-2 లక్షలు, విద్యుత్తు శాఖ-6 లక్షలు, పోలీస్ శాఖ-10 లక్షలు, ఉద్యానవన శాఖ-5 లక్షలు, రెవెన్యూ శాఖ-8 లక్షలు, మార్కెటింగ్ శాఖ-2 లక్షలు, గనుల శాఖ-20 లక్షలు, మైనార్టీ శాఖ-30వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలు-3.41 లక్షలు, వ్యవసాయ శాఖ-25 లక్షలు, డీఎస్‌సీవో-5 లక్షలు, పంచాయతీరాజ్ శాఖ-7 లక్షలు, ఆర్‌అండ్‌బీ- 7 లక్షలు, నీటిపారుదల శాఖ-10 లక్షలు, పంచాయతీ శాఖ- 25 లక్షలు, తాండూర్, వికారాబాద్ మున్సిపాలిటీలు-2 లక్షలు, ఆర్‌డబ్ల్యూఎస్-25వేలు, ఆర్టీసీ-30 వేలు, జర్నలీస్టులు- 2 వేలు, ఖజానా శాఖ-2 వేలు, సహాకార శాఖ-1.20 లక్షలు, పశుసంవర్దక శాఖ- 1 లక్ష, జాతీయ రహాదారులు-25 వేలు, దేవాదాయ శాఖ-10 లక్షలు, రైల్వే శాఖ-1.50 లక్షలు, పరిశ్రమల శాఖ-1.50 లక్షల మొక్కలను నాటాలని టార్గెట్‌ను సిద్ధం చేశారు. అదేవిధంగా ఈ ఏడాది 4 లక్షల ఈత మొక్కలను కూడా నాటనున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు కల్లుగీత కార్మికులకు ఉపాధి కల్పించేందుకుగాను ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నాటనున్న ఈత మొక్కలను ప్రభుత్వం కల్లుగీత కార్మికుల సోసైటీలకు ఇచ్చిన భూముల్లో, కల్లుగీత కార్మికుల సొంత భూము ల్లో, చెరువు గట్లపై ప్రభుత్వ స్థలాల్లో ఈత మొక్కలను నాటనున్నారు. అయితే ఇప్పటివరకు 65 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా గతేడాది 1,66 కోట్ల మొక్కలను నాటగా.., 81 లక్షల మొక్కలు మాత్రమే బ్రతకినట్లు అధికారులు తెలిపారు.

ఇంటింటికీ ఆరు మొక్కలు...
హరితహారంలో భాగంగా ఈ ఏడాది ఇంటింటికీ ఆరు మొక్కలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీ ఇంటింటికీ పంపిణీ చేసే మొక్కల్లో పండ్ల మొక్కలతోపాటు పూల మొక్కలు, కూరగాయల మొక్కలను పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతీ గ్రామంలో ఒక నర్సరీని ఏర్పాటు చేశారు. హరితహారంలో భాగంగా నాటనున్న మొక్కలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 545 నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేశారు. వీటిలో 81 నర్సరీలు అటవీ శాఖ, 464 నర్సరీలు డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో మొక్కలను సిద్ధం చేస్తున్నారు. ప్రతీ గ్రామంలో 40 వేల మొక్కలను నాటేలా ప్లాన్‌ను సిద్ధం చేశారు. అయితే గ్రామాల్లో జామ, కరివేపాకు, దానిమ్మ, పప్పాయ, పూల మొక్కలైన గులాబీ, మందారం, మల్లె మొక్కలతోపాటు గ్రామం పరిధిలో వివిధ మొక్కలను నాటనున్నారు. గ్రామ పంచాయతీల్లో తీర్మానం చేసి ఏయే మొక్కలను నాటాలనేదా తీర్మానం చేసినట్లయితే సంబంధిత మొక్కలను పెంచి నాటేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతీ గ్రామాన్ని హరితవనంగా మార్చేందుకుగాను ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...