ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలి


Thu,June 27, 2019 12:19 AM

-నీటి సంరక్షణనుప్రజలు తమ కర్తవ్యంగా భావించాలి
-తాండూరు ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
-మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి
-సర్పంచ్, కార్యదర్శులు సమన్వయంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి
-జిల్లా కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా
తాండూరు, నమస్తే తెలంగాణ: పర్యావరణ సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని అందుకు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు సమన్వయంతో ఉంటు ప్రజా అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు సమసమాజ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను విధిగా నిర్వహించి బంగారు భవితకు మార్గదర్శకంగా నిలవాలని తాండూరు ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని భవానీ ఫంక్షన్‌హాల్‌లో స్వచ్ఛభారత్ మిషన్, తెలంగాణకు హరితహారం, నీటి పొదుపు సంరక్షణపై నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామ కార్యదర్శులతో పాటు వివిధ శాఖల సిబ్బందికి జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతనలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అథితులుగా పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ నీటి సంరక్షణను ప్రజలు తమ కర్తవ్యంగా భావించి నీరును వృథా చేయకూడదని సూచించారు. నీటి సంరక్షణకు ఇండ్లు, పొలాల దగ్గర ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలన్నారు. అడవుల శాతాన్ని పెంపొందించేందుకు, కరువు కాటకాను పూర్తిగా పారదోలడానికి ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలను నాటి పెంచాలని సూచించారు.

మనం నివసించే పరిసరాలు పచ్చగా ఉంటే అందరం ఆరోగ్యంగా ఉంటామన్నారు. పర్యావరణ పరిరక్షణకు, వర్షాలు సమృద్దిగా పడుటకు పచ్చని చెట్లే కారణమని తెలిపారు. అందుకు ప్రజలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సేవాసంస్థలు, కుల సంఘాలతో పాటు ఉద్యోగులు, విద్యార్థులు మొక్కలను నాటాలని పేర్కొన్నారు. మరుగుదొడ్లను ప్రతి ఒక్కరూ నిర్మించుకోవాలన్నారు. తాండూరు నియోజకవర్గంలో సంబంధిత నేతలు నిర్లక్ష్యం చేయకుండా ప్రజలను అవగాహన పరచి వేగంగా పూర్తి చేయించాలని సూచించారు. బషీరాబద్‌లో కేవలం 14 శాతమే ఉన్న మరుగు దొడ్ల నిర్మాణాలను 100 శాతం చేసేందుకు అక్కడి ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. 63 శాతం ఉన్న తాండూరు, 32 శాతం ఉన్న యాలాల, పెద్దేముల్ మండలాల్లో కూడా వెంటనే వంద శాతం పూర్తి చేయాలన్నారు. నిర్మాణంకు ఇసుక అనుమతులకు అధికారుల సహకరించాలని సూచించారు.

కలెక్టర్ ఆయేషా మాట్లాడుతూ ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం చేస్తున్న సహకారంతో ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను బాధ్యతతో విధిగా నిర్మించుకోవాలన్నారు. ఎవరు నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. సర్పంచ్, కార్యదర్శులు సమన్వయంతో ఉంటు పల్లె ప్రగతికి కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించుకోవాలన్నారు. గ్రామాల్లో 100 మొక్కలు నాటి వాటి రక్షణకు వ్యక్తులను ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వ ప్రొత్సాహకం అందుతుందన్నారు. ప్రతి గ్రామంలో 5 శాతం ఈత, చింత మొక్కలను నాటుటకు సూచించిన విధంగా మొక్కలు నాటుకోవాలన్నారు. అటవీ శాఖ, నర్సరీల ద్వారా ఇచ్చే వివిధ రకాల ఉచిత మొక్కను ప్రజలు తీసుకొని అనుకూలమైన చోట నాటేందుకు చదువుకున్న ప్రతి ఒక్కరూ గ్రామీణుల్లో చైతన్యం కలిగించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వేణుమాధవరావు, తాండూరు నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...