సంస్థాగతం పై దృష్టి


Wed,June 26, 2019 12:36 AM

-ఈనెల 28 నుంచి టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వాల నమోదు
-క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై అధిష్ఠానం నజర్
-రెండు నియోజకవర్గాలకు ఒక ఇన్‌చార్జిని నియమించనున్న పార్టీ
-ఎమ్మెల్యేలతో కలిసి సభ్యత్వ నమోదును
-పర్యవేక్షించనున్న ఇన్‌చార్జీలు
-జిల్లాలో ఈసారి 4 లక్షల సభ్యత్వాలు చేయడమే లక్ష్యం
-జూలై 20 వరకు కొనసాగనున్న సభ్యత్వ నమోదు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు పాగా వేయడంతోపాటు జిల్లాలో తిరుగులేని పార్టీగా అవతరించిన టీఆర్‌ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పంచాయతీ, పార్లమెంట్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కారు దుమ్మురేపిన టీఆర్‌ఎస్ పార్టీ గ్రామగ్రామాన బలమైన క్యాడర్‌ను ఏర్పాటు చేసుకోవడంపై నిర్ణయించింది. జిల్లాలో ఎంపీతోపాటు వికారాబాద్, పరిగి, తాండూర్, కొడంగల్ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ఉండడంతోపాటు మెజార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్ పదవులను ఛేజిక్కించుకొని బలమైన పార్టీగా తయారైన గులాబీ పార్టీ గ్రామగ్రామాన పార్టీ సభ్యత్వాలు చేసి మరింత బలోపేతం కావడంపై దృష్టి పెట్టింది.

ఇప్పటికే అన్ని జిల్లాల్లో టీఆర్‌ఎస్ భవన్ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అధికార పార్టీ టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వంతోపాటు మండల, గ్రామ కమిటీల ఏర్పాటుతో క్షేత్రస్థాయిలోనూ బలమైన గులాబీ క్యాడర్ ఉండే విధంగా టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఈనెల 27 టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ తొలి సభ్యత్వం తీసుకున్న అనంతరం అన్ని జిల్లాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభంకానుంది. అయితే గతంలో జిల్లాలో 2 లక్షల సభ్యత్వం చేసిన జిల్లా టీఆర్‌ఎస్ నాయకత్వం ఈ దఫా 4 లక్షల వరకు పార్టీ సభ్యత్వం చేయించేలా పట్టుదలతో ఉన్నారు. అయితే వరుస ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ప్రభంజనంతోపాటు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో గత ఏడాదిలో క్షేత్రస్థాయిలోని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల నుంచి టీఆర్‌ఎస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరారు. గ్రామగ్రామాన ఉన్న గులాబీ క్యాడర్‌కు గ్రామ, మండల కమిటీల్లో స్థానం కల్పించి క్షేత్రస్థాయిలో రెట్టింపు ఉత్సాహన్ని నింపేలా టీఆర్‌ఎస్ అధినాయకత్వం ముందుకెళ్తుంది.

జిల్లాలో తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్...
జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ ఎదురులేని శక్తిగా తయారైంది. మునుపెన్నడూ లేనివిధంగా జిల్లాలో సర్పంచ్ నుంచి ఎంపీ వరకు అంతా టీఆర్‌ఎస్ పార్టీ వారినే ప్రజలు గెలిపించుకోవడంతో జిల్లాలో తిరుగులేని పార్టీగా టీఆర్‌ఎస్ పార్టీ అవతరించింది. ఎన్నికలు ఏమైనా గెలుపు టీఆర్‌ఎస్‌దే అనే విధంగా జిల్లాలో గులాబీ పార్టీ పుంజుకుంది. 2014లో టీఆర్‌ఎస్ పార్టీ తొలిసారి అధికారంలోకి వచ్చిన సమయంలోనూ జిల్లాలో అంతంతాగానే ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ ప్రస్తుతం జిల్లాలో ఏ ఎన్నికలు జరిగినా టీఆర్‌ఎస్ ప్రభంజనం కొనసాగుతూ వస్తుంది. జిల్లాలో అధికార పార్టీ బలోపేతంతో సర్పంచ్‌ల నుంచి ఎమ్మెల్యేల వరకు టీఆర్‌ఎస్‌వారే కొనసాగుతుండడం గమనార్హం. గత 9 మాసాల్లో వరుసగా జరిగిన అసెంబ్లీ, పంచాయతీ, పార్లమెంట్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కారు దుమ్మురేపింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ దూసుకుపోయింది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలుండగా మూడు నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ విజయదుందిభి మోగించింది.

జిల్లాలోని వికారాబాద్, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి తాండూర్ ఎమ్మెల్యేగా గెలిచిన పైలట్ రోహిత్ రెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరడంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే పాగా వేశారనే చెప్పవచ్చు. 2014 ఎన్నికల్లో జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరే ఉండగా 2019 ఎన్నికల్లో జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూర్, కొడంగల్ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు పంచాయతీ ఎన్నికల్లోనూ వార్ వన్‌సైడ్‌లా టీఆర్‌ఎస్ విజయభేరి మోగించింది.

జిల్లాలో 565 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగగా.., 355 గ్రామ పంచాయతీల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టించింది. పరిషత్ ఎన్నికల్లోనూ గులాబీ జోరు కొనసాగింది. జిల్లాలో మొత్తం 221 ఎంపీటీసీ స్థానాలుండగా 137 ఎంపీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అదేవిధంగా జడ్పీటీసీ స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ పార్టీ హవా కొనసాగింది. జిల్లాలో 18 జడ్పీటీసీ స్థానాలుండగా 15 జడ్పీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపొందింది. అదేవిధంగా ఎంపీపీ అధ్యక్ష పీఠాలకు సంబంధించి కూడా టీఆర్‌ఎస్ పార్టీ మెజార్టీ ఎంపీపీ పీఠాలను కైవసం చేసుకుంది. జిల్లాలో 18 ఎంపీపీ పీఠాలుండగా 14 ఎంపీపీ అధ్యక్ష పీఠాలను టీఆర్‌ఎస్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూడా అధికార పార్టీ సొంతం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ కారు ప్రభంజనం కొనసాగే విధంగా టీఆర్‌ఎస్ పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది.

28 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభం
ఈనెల 27న సీఎం కేసీఆర్ సభ్యత్వం తీసుకొని టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తదనంతరం 28 నుంచి జూలై 20 వరకు జిల్లావ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్ శ్రేణులు జోరుగా చేపట్టనున్నారు. అదేవిధంగా పార్టీ సభ్యత్వ నమోదును పర్యవేక్షించేందుకుగాను రాష్ట్ర కార్యవర్గంలోని సభ్యులను రెండు నియోజకవర్గాలకు ఒకరిని చొప్పున ఇన్‌చార్జీలను నియమించనున్నట్లు తెలిసింది. సంబంధిత ఇన్‌చార్జీలు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కలిసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు. అయితే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకుగాను ఇన్‌చార్జీలను నియమిస్తారా లేదంటే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకే పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తారనే దానిపై ఈనెల 27న స్పష్టత రానుంది. అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎంపీ మొదలుకొని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు ఇలా అందరూ భాగస్వాములు కానున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామగ్రామాన పండుగలా నిర్వహించేలా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ప్రణాళికలు చేస్తున్నారు. ఏ పార్టీకి లేని విధంగా అత్యధిక పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేసే విధంగా కసరత్తు చేస్తున్నారు. గతంలో జిల్లాలో 2 లక్షల పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేసిన టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకత్వం.. ఈ దఫా నియోజకవర్గానికి లక్ష చొప్పున నాలుగు నియోజకవర్గాల్లో 4 లక్షల సభ్యత్వం చేయించేలా ముందుకెళ్తున్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...