పోలీసులకు వీక్లీ ఆఫ్


Mon,June 24, 2019 11:28 PM

-నేటి నుంచి అమలు
-ఉత్తర్వులు జారీ చేసిన ఎస్పీ నారాయణ
-సీఐ స్థాయి నుంచి హోంగార్డుల వరకు వారాంతపు సెలవులు
-జిల్లాలో 950 మంది పోలీసులు
-రోజుకు వారంతపు సెలవుల్లో 50 మంది పోలీసులు
-సివిల్ పోలీసులతో పాటు ఏఆర్ పోలీసులకు కూడా వర్తింపు
-వీక్లీ ఆఫ్ అమలుపై సంతోషం వ్యక్తం చేస్తున్న జిల్లా పోలీసులు
-కుటుంబంతో గడిపేందుకు సమయమివ్వడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లా పోలీసులకు శుభవార్త. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న వారంతపు సెలవు కల నేటి నుంచి నిజం కానుంది. సీఐ స్థాయి నుంచి కానిస్టేబుల్, హోంగార్డు స్థాయి వరకు వీక్లీ ఆఫ్స్‌ను అమలు చేయనున్నారు. అయితే పోలీసులకు వారంతపు సెలవుపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా పోలీసు అధికారులు ఒక్కొ జిల్లాలో అమలు చేస్తూ వస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా నిత్యం శాంతి భద్రతల పరిరక్షణ కోసం పనిచేసే పోలీసులకు వారంలో ఒకరోజు సెలవొచ్చింది. జాతీయ పండుగలు మొదలుకొని సాధారణ సెలవుల వరకు దూరమవుతూ పూర్తిగా విధులకే పరిమితమవుతున్న ఖాకీలకు ఎట్టకేలకూ వీక్లీ ఆఫ్ ఇవ్వడంపై పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే శాంతిభద్రతల పరిరక్షణలో అనునిత్యం శ్రమించే పోలీసులకు కుటుంబంతో కలిసి గడిపేందుకు ఒకరోజు ఇవ్వడంపై తెలంగాణ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 950 మంది పోలీసులుండగా వీరిలో రోజుకు 50 మంది వరకు వీక్లీ ఆఫ్ లభించనుంది. వారంతపు సెలవు అమలుపై జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఏదేమైనా పోలీసులకు వారంతపు సెలవు ఇవ్వడంపై ఇటు పోలీసు సిబ్బందిలోనూ అటు వారి కుటుంబాల్లోనూ సంతోషం నింపింది.

రోజుకు 50 మందికి వారాంతపు సెలవులు
నేటి నుంచి ప్రతి పోలీస్ స్టేషన్‌లో సీఐ స్థాయి నుంచి హోంగార్డు వరకు వారాంతపు సెలవును అమలుచేయనున్నారు. ప్రతీ పోలీస్ స్టేషన్‌లోని సిబ్బందికి వారంలో ఏదో ఒక రోజు సెలవు ఇవ్వనున్నారు. సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఉన్న సిబ్బందిని బట్టి వారాంతపు సెలవులను ఇచ్చేలా ప్లాన్ చేశారు. అయితే ఒకే రోజు పరిమితికి మించి వీక్లీ ఆప్స్ తీసుకోకుండా శాంతిభద్రతల నిర్వహణలో ఎలాంటి సమస్య తలెత్తకుండా వారంతపు సెలవులను పక్కాగా అమలు చేసేలా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఏ ప్రభుత్వ శాఖలో లేని విధంగా పోలీసు శాఖలో పనిచేస్తున్న వారు కుటుంబానికి దూరంగా 24 గంటలపాటు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. వయసు మీద పడిన పోలీసు సిబ్బంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తు వచ్చారు. ఎంత కష్టమైనప్పటికీ ఓర్చుకొని పోలీసు సిబ్బంది క్రమశిక్షణతోపాటు సమయానుకూలంగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వం తీసుకున్న వీక్లీ ఆఫ్ సెలవు నిర్ణయంతో పోలీసులు వారానికి ఒక రోజు కుటుంబంతో గడపడంతోపాటు వ్యక్తిగత పనులు చేసుకునేందుకుగాను వీలుంటుంది. అంతేకాకుండా నిర్విర్వామంగా విధులు నిర్వహిస్తూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురి అవుతున్న పోలీసులకు సీఎం కేసీఆర్ నిర్ణయం నిజంగా శుభవార్తే. అయితే జిల్లాలో హోంగార్డు నుంచి ఏఎస్‌ఐ వరకు రోజుకొకరికి చొప్పున వారంతపు సెలవులను అమలుచేయనున్నారు. సబ్ ఇన్‌స్పెక్టర్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌లకు వారాంతపు సెలవు ఇచ్చే దానిపై పోలీస్ స్టేషన్ వారీగా ఇవ్వాలా లేదా సర్కిల్‌ను పరిగణనలోకి తీసుకొని సెలవు ఇవ్వాలనే దానిపై జిల్లా పోలీసు ఉన్నతాధికారి నేడు క్లారిటీ ఇవ్వనున్నారు. జిల్లాలో ఎస్పీ మొదలుకొని కానిస్టేబుల్, హోంగార్డు వరకు దాదాపు 950 మంది పోలీసులుండగా వీరిలో ప్రతిరోజూ 50 మంది వరకు వారాంతపు సెలవు దొరకనుంది.

అయితే జిల్లాలో 18 సివిల్ పోలీస్ స్టేషన్లు, ఒక మహిళా పోలీస్ స్టేషన్, ఒక సీసీఎస్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అదేవిధంగా జిల్లాలో ఎస్పీతో పాటు ఇద్దరు అదనపు ఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 12 మంది సీఐలు, ఒక మహిళా సీఐ, 33 మంది ఎస్‌ఐలు, 44 మంది ఏఎస్‌ఐలు, ఒక మహిళా ఏఎస్‌ఐ, 93 మంది హెడ్ కానిస్టేబుల్స్, ముగ్గురు మహిళా హెడ్ కానిస్టేబుల్స్, 370 మంది కానిస్టేబుల్స్, 31 మంది మహిళా కానిస్టేబుల్స్, అదేవిధంగా జిల్లాలోని అర్మ్‌డ్ రిజర్వ్ బలగాలకు సంబంధించి ఒక డీఎస్పీ, ముగ్గురు ఆర్‌ఐలు, ఒక ఆర్‌ఎస్‌ఐ, 8 మంది ఏఆర్‌ఎస్‌ఐలు, 21 ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్స్, 215 మంది ఏఆర్ కానిస్టేబుల్స్ ఉన్నారు.

పోలీసుల బాధలను గుర్తించిన ఏకైక సీఎం కేసీఆర్
పోలీసుల కష్టాలను, బాధలను గుర్తించిన ఏకైక సీఎం కేసిఆర్, వారంలో ఉద్యోగ పరంగా ఉండే ఒత్తిడిల్లో ఒక రోజు వీక్లీ ఆఫ్‌తో పని ఒత్తిడి తగ్గి కుటుంబసభ్యులతో ప్రశాంతంగా గడుపడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీక్లీ ఆఫ్ కొరకు కృషి చేసిన మా డీజీపీ గారికి ,ఎస్పీ గారికి ధన్యవాదాలు. పోలీసుల బాధలను, కష్టాలను పెద్ద మనుస్సుతో అర్థం చేసుకొని వీక్లీ ఆఫ్‌ను అమలు చేయడం చాలా సంతోషకం.
- మల్లేశం, హెడ్‌కానిస్టేబుల్, పెద్దేముల్ పోలీస్ స్టేషన్

పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వడం హర్షణీయం
పోలీసులకు పని ఒత్తిడి తగ్గించడానికి ప్రభుత్వం వీక్లీ ఆఫ్ ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం,ముఖ్యంగా పోలీసులు ఇంటి పనులు చేసుకోవడానికి,చేయాల్సిన పనులను ఒక రోజు ముందే ప్రణాళిక వేసుకోవడానికి, ఎక్కడికి వెళ్లాలంటే ముందే నిర్ణయించుకోవడానికి, సొంత పనులను సక్రమంగా చేసుకోవడానికి వీక్లీ ఆఫ్ ఉపయోగపడుతుంది. పోలీసుల వృత్తి పట్ల శ్రద్ధ వహించి వీక్లీ ఆఫ్‌ను ఇచ్చినందుకు పోలీసు కుటుంబాల పక్షాన సీఎం కేసీఆర్, డీజీపీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు.
- కృష్ణారెడ్డి, కానిస్టేబుల్, పెద్దేముల్ పోలిస్ స్టేషన్

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...