గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి


Mon,June 24, 2019 11:23 PM

పరిగి, నమస్తే తెలంగాణ: గ్రామాల అభివృద్ధికి సర్పంచ్‌లు, అధికారులు అంకితభావంతో పనిచేయాలని ఎమ్మె ల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి సూచించారు. సోమవారం ఎంపీపీ జ్యోతి అధ్యక్షతన పరిగి మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని సూచించారు. గ్రామాలలో పచ్చదనం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. ప్రతి గ్రామపంచాయతీకి ప్రత్యేకంగా కార్యదర్శుల నియామకంతో సర్పంచ్‌లు, గ్రామపంచాయతీ కార్యదర్శులు సమిష్టిగా పనిచేసి గ్రామాలు అభివృద్ధి చేసేందుకు ప్రజల భాగస్వామ్యంతో పనిచేయాలన్నారు. సాధ్యమైనంత త్వరగా ప్రతి గ్రామంలో 100శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయించాలని ఎమ్మెల్యే సూచించారు. ఇందుకుగాను ప్రతిఒక్కరిలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశానికి గైర్హాజరైన అధికారులపై చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్‌కు సిఫారసు చేయాలని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు శాఖలకు సంబంధించిన చర్చల్లో పరిగి పట్టణంలో మిషన్ భగీరథ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మీర్ మహమూద్‌అలీ, మండల కో-ఆప్షన్ సభ్యుడు మునీర్, ఎంపీటీసీ సమద్‌లు పేర్కొన్నారు.

పట్టణ పరిధిలోని బీసీ కాలనీ, ఖాన్ కాలనీ, మందుల కాలనీలలో ఎమ్మెల్యే స్వయంగా పర్యటించి పనులు త్వరగా చేపట్టాలని సూచించినా మందకొడిగా పనులు జరుగడం ఏమిటని వారు ప్రశ్నించారు. నీటి కోసం కాలనీవాసులు ఆందోళన చేస్తున్నారని, ఆందోళనలో అధికార పార్టీ వారు కూడా పాల్గొనేలా చేయరాదని జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మీర్ మహమూద్ అలీ అన్నారు. సాధ్యమైనంత త్వరగా మిషన్ భగీరథ పనులు పూర్తి చేయాలని ఆయన సూచించారు. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల జారీలో తీవ్ర జాప్యం జరుగుతుందని పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రాత్రి సమయంలోను కార్యాలయంలో కూర్చొని సాధ్యమైనంత త్వరగా పట్టాదారు పాసు పుస్తకాల జారీకి ప్రయత్నిస్తున్నామని తహసీల్దార్ అనురాధ పేర్కొనగా కొందరు వీఆర్‌వోలు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు, చిగురాల్‌పల్లి సర్పంచ్ వెంకటయ్యలు పేర్కొన్నారు. వెంటనే పట్టాదారు పాసు పుస్తకాల జారీకి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి తహసీల్దార్‌ను ఆదేశించారు. రెవెన్యూకు సంబంధించి పట్టాదారు పాసు పుస్తకాల జారీలో జాప్యంపై మంగళవారం జిల్లా కలెక్టర్‌తో కలిసి వీఆర్‌వోలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని, సమావేశంలో ప్రతి అంశం చర్చించి త్వరగా పనులు జరిగేలా చూస్తామని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి చెప్పారు. అనంతరం త్వరలో పదవీకాలం పూర్తి కానున్న జడ్పీటీసీ ఎస్పీ పద్మమ్మ, ఎంపీపీ జ్యోతి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యులు మీర్ మహమూద్‌అలీ, ఎంపీటీసీ సభ్యులు, మండల కో-ఆప్షన్ సభ్యులను శాలువాలు, పూలమాలలతో ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డిని పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు సన్మానించారు. కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు యు.రవి, ఎంపీడీవో దయానంద్, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 54 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పంపిణీ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్నాయని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు.

18
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...