రూ.15కోట్లతో అభివృద్ధి పనులు


Mon,June 24, 2019 11:23 PM

పరిగి, నమస్తే తెలంగాణ: పరిగి మున్సిపల్ పరిధిలో రూ.15కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాడం జరుగుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ పనులకు సంబంధించిన టెండర్లు సాధ్యమైనంత త్వరగా నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సోమవారం పరిగి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలోని దుకాణాల సముదాయం, సీసీ రోడ్లు ప్రారంభోత్సవం, ధర్మశాల నిర్మాణానికి శంకుస్థాపన, మున్నూరువాడలో మహిళా సంఘం భవనం, నాయకోటివాడలో మహిళా సమాఖ్య భవనం నిర్మాణానికి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రూ.15కోట్లు పరిగి మున్సిపాలిటీకి మంజూరు చేయడం జరిగిందని, ఇందులో భాగంగా ఏ పనులు చేపట్టేది ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించగా వాటికి ఆమోదముద్ర వేశారన్నారు. సూచించిన పనులకు సంబంధించి త్వరలోనే టెండర్లు పూర్తి చేయడం జరుగుతుందని, రాబోయే రెండు నెలల్లో పరిగిలో రూ.15కోట్లకు సంబంధించి పనులు ప్రారంభం కానున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇటీవల వరుసగా ఎన్నికల కోడ్ వల్ల పనులు చేపట్టాడంలో ఆలస్యం జరిగిందని, త్వరలోనే పనులు ప్రారంభించేందుకు మున్సిపల్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. పరిగి మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి కాలనీలో అవసరమైన మేరకు సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం, అక్కడి నుంచి గాంధీ చౌక్, గాంధీచౌక్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు రోడ్డు వెడల్పు, డివైడర్‌లతోపాటు సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టాడం జరుగుతుందని ఎమ్మెల్యే చెప్పారు. ఇవేకాకుండా మరిన్ని నిధులు తీసుకువచ్చి పరిగి పట్టణాన్ని సుందర పట్టణంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఎస్పీ పద్మమ్మ, ఎంపీపీ జ్యోతి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్.ఆంజనేయులు, ఎంపీడీవో దయానంద్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...