ఉపాధిలో టాప్


Mon,June 24, 2019 01:52 AM

-ఉపాధిహామీలో రాష్ట్ర స్థాయిలో
-మొదటి స్థానంలో నిలిచిన వికారాబాద్ జిల్లా
-14,475 కుటుంబాలకు వంద రోజులు పని
- 2018-19 సంవత్సరంలో 55.45లక్షల పనిదినాలు
పరిగి, నమస్తే తెలంగాణ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల నిర్వహణ, లక్ష్య సాధనలో వికారాబాద్ జిల్లా వరుసగా రెండో సంవత్సరం మొదటి స్థానంలో నిలిచింది. గత సంవత్సరం సైతం రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలువడంతోపాటు కేంద్ర ప్రభుత్వం ద్వారా అవార్డు పొందింది. ఈసారి కూడా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యత పనితీరు సూచికల ఆధారంగా ఆయా జిల్లాలకు సంబంధించి చేపట్టిన పనులు బేరీజు వేసి ఎంపిక చేపట్టారు. 2018-19 సంవత్సరంలో రాష్ట్రంలోని 30 జిల్లాల పనితీరును పూర్తిస్థాయిలో సమీక్షించడంతోపాటు పనితీరు సూచికల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన వికారాబాద్ జిల్లాకు 4.58 పాయింట్లు కేటాయిస్తూ రాష్ట్ర స్థాయిలో సిరిసిల్ల జిల్లాతో కలిసి మొదటి స్థానంలో నిలిచిందని అధికారులు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల వారీగా విడుదల చేసిన ర్యాంకుల ప్రకారం వికారాబాద్ జిల్లా వరుసగా రెండో సంవత్సరం సైతం మొదటి స్థానంలో నిలవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక్క సంవత్సరం మొదటి స్థానంలో నిలిచిందంటే గర్వకారణంగా పేర్కొనవచ్చు. అలాంటిది ఉపాధి హామీ పథకంలో పనిచేసే సిబ్బంది మొదలుకొని ఉన్నతాధికారుల వరకు చక్కటి పనితీరు కనబరుస్తూ పనిచేయడం ద్వారా వికారాబాద్ జిల్లా తన మొదటి స్థానాన్ని పదిలం చేసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.

జిల్లా పరిధిలో 2018-19 సంవత్సరంలో 55.45 లక్షల పనిదినాలు కల్పించారు. అందులోనూ 14,475 కుటుంబాలకు వంద రోజులు పని కల్పించడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా సంవత్సరకాలంలో 1,75,490 మందికి (95,295 కుటుంబాలు)కు పని కల్పించామని అధికారులు తెలిపారు. సంవత్సరంలో కూలీలకు రూ.87.02 కోట్లు చెల్లించగా, మెటీరియల్ కోసం రూ.45 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు ప్రకటించిన వివరాలు వెల్లడిస్తున్నాయి.

పనితీరు ఆధారంగా పాయింట్లు
జాతీయ ఉపాధి హామీ పథకం అమల్లో పనితీరు ఆధారంగా పాయింట్లు కేటాయించి ర్యాంకులు ప్రకటించారు. ఉపాధి హామీ పనుల నిర్వహణ, లక్ష్యసాధనలో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 2018-19 సంవత్సరం జిల్లా పరిధిలో ఉపాధి కూలీలకు పని కల్పించడంలో భాగంగా ప్రతి కుటుంబానికి సగటున 58.2 రోజుల పని కల్పించినందుకు 0.97 పాయింట్లు పొందారు. అత్యధిక 100 రోజులు పూర్తి చేసుకున్న 15,200 కుటుంబాలకు పని కల్పించినందుకు 0.90 పాయింట్లు వచ్చాయి. జియో టాగింగ్‌లో జిల్లాకు 0.90 పాయింట్లు, పనులు పూర్తి చేయడంలో 0.79 పాయింట్లు, సరాసరి కూలీ చెల్లింపులో రోజుకు కూలీ 160.4 రూపాయలు చెల్లిస్తున్నందుకు 0.72 పాయింట్లు, కూలీ పేమెంట్లు 7 రోజుల లోపు చెల్లిస్తున్నందుకు 0.31 పాయింట్లు జిల్లాకు వచ్చాయి. ఆయా విభాగాల వారిగా పనితీరు బేరీజు వేసి పాయింట్లు కేటాయించారు. అన్ని విభాగాలు కలిపి జిల్లాకు మొత్తం 4.58పాయింట్లు కేటాయించడం ద్వారా రాష్ట్రంలో మరోసారి ప్రథమ స్థానంలో వికారాబాద్ జిల్లా నిలిచింది.

జాతీయ స్థాయిలో అవార్డు
జిల్లా ఏర్పాటు తర్వాత ప్రతి సంవత్సరం జిల్లా ఉపాధి హామీలో అవార్డులు సాధిస్తుంది. 2016-17 సంవత్సరంలో కొత్త జిల్లాలు ఏర్పడిన క్రమంలో వికారాబాద్ జిల్లా చక్కటి పనితీరుతో 2017 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో సీఎం కేసీఆర్ చేతులమీదుగా జిల్లా గ్రామీణాభివృద్ధ్ది అధికారి జాన్సన్ పురస్కారం అందుకున్నారు. 2017-18 సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు జాతీయ అవార్డును జిల్లా అందుకుంది. 2018 సెప్టెంబర్ 11న కొత్త ఢిల్లీలోని విజ్ఞాన్‌భవనలో జరిగిన కార్యక్రమంలో అప్పటి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మత్రి నరేంద్రసింగ్ తోమర్ చేతులమీదుగా అప్పటి జిల్లా కలెక్టర్ ఓమర్ జలీల్‌తోపాటు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి పి.డబ్ల్యు.జాన్సన్ అవార్డును అందుకున్నారు. 2018-19 సంవత్సరంలో పనితీరు సూచికల అసెస్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వ జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రెటరీ అపరాజితా సారంగి జిల్లాను సందర్శించారు. వికారాబాద్ జిల్లాలో అమలు జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించిన ఆమె ప్రశంసించారు. వికారాబాద్ జిల్లా ఏర్పాటు తర్వాత ప్రతి సంవత్సరం ఉపాధి హామీ పథకం అమలులో జిల్లాకు అవార్డుల పంట పండుతుందని చెప్పవచ్చు. కింది స్థాయి ఉద్యోగులతోపాటు ప్రతి ఒక్కరు సమిష్టిగా పనిచేయడం ద్వారా ఈ అవార్డులు జిల్లాకు దక్కుతున్నాయని గ్రామీణాభివృద్ధి అధికారులు పేర్కొంటున్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...