ప్రతి రైతుకు న్యాయం చేస్తాం


Mon,June 24, 2019 01:43 AM

పూడూరు /వికారాబాద్ రూరల్: రైతుల భూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా పేర్కొన్నారు. ఆదివారం పూడూరు మండలం కడ్మూర్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక రెవెన్యూ క్యాంప్ నిర్వహించి నేరుగా కలెక్టరే రైతుల సమస్యలపై అడిగి తెలుసుకొన్నారు. ఆ గ్రామ రెవెన్యూ పరిధిలోని 107 మంది రైతుల వివిధ భూ సమస్యలపై దరఖాస్తులు చేశారు. వీటిలో ఆన్‌లైన్, కొత్త పాస్‌బుక్కులు, ఇరువర్గాల మధ్య భూ వివాదాలు, వంటి దరఖాస్తులు వచ్చాయి. రైతుల నుంచి వచ్చిన దరఖాస్తుల్లో 70 మంది రైతుల సమస్యలను అక్కడే పరిష్కరించారు. మిగతా రైతుల రికార్డులను పరిశీలించి వెంటనే సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కొత్త పాస్‌బుక్కులు రాని రైతులకు త్వరలోనే అందేలా చూస్తానన్నారు. ప్రతి రైతులకు భూ సమస్యలు లేకుండాచూసి రికార్డు సరిగ్గా ఉండేలా అధికారులు చూడాలని తెలిపారు. ఈ గ్రామంలో అధిక సంఖ్యలో రైతుల సమస్యలు ఉండటంతోనే ప్రత్యేక క్యాంప్ ద్వారా ఇక్కడే పరిష్కరించి రైతుల భూముల రికార్డులను వారికి అందజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో విశ్వనాథం, తహసీల్దార్ వహీద ఖాతున్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ ఆర్‌ఐ పార్థసారదిరెడ్డి రైతులు ఉన్నారు.

అటవీ శాఖ, రెవెన్యూ శాఖలను సమన్వయ పరుస్తాం
ప్రతి రైతుకు న్యాయం చేస్తామని, అటవీ శాఖ రెవిన్యూ శాఖలను సమన్వయ పరిచి రైతులకు న్యాయం చేస్తామన్ని కలెక్టర్ మస్రత్ ఖానమ్ అయేషా అన్నారు. ఆదివారం వికారాబాద్ మండల పరిధిలోని మదన్‌పల్లి, మదన్‌పల్లి అనుసంధాన గ్రామం చెంచుపల్లి రైతులతో కలిసి రెవిన్యూ సమస్యల ఆరా తీశారు. రైతులు కొందరూ తమ సమస్యలు వివరిస్తూ మదన్‌పల్లి గ్రామ రెవిన్యూ పరిధిలో ఫారెస్ట్ భూమి, రెవిన్యూ భూములు ఉన్నాయి. 40 ఏండ్ల నుంచి ఈ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నామన్నారు. 2005లో రైతులందరికీ అసైన్డ్ పట్టాలు రెవిన్యూ అధికారులు అందించారన్నారు. 4 ఏండ్ల నుంచి అటవీ శాఖ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. గత సంవత్సరం పంట వేసిన తర్వాత పంట కోతకు వచ్చే సమయంతో అటవీ శాఖ అధికారులు వచ్చి 8 ట్రాక్టర్లతో దున్ని వేశారని కలెక్టర్‌కు చెప్పుకున్నారు. భూ రికార్డుల ప్రక్షాలన పేరుతో రైతులకు నూతన పాసు పుస్తకాలు అందిస్తామని ఇప్పటి వరకు అందించడం లేదన్నారు. వికారాబాద్ తహసీల్దార్‌ను అడుగగా ఫారెస్ట్ భూములు ఉన్నాయని అటవీ అధికారులు తెలుపుతున్నారని చెప్పారన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందించే రైతు బంధును కోల్పోతున్నామని తెలిపారు. మదన్‌పల్లి రెవిన్యూ పరిధిలో అటవీ శాఖ , రెవిన్యూ శాఖ మధ్య 107 మంది రైతులు నలిగిపోతున్నారన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా మాట్లాడుతూ ప్రతి రైతుకు న్యాయం చేస్తామని , రైతులకు నూతన పాసు పుస్తకాలు అందిస్తామన్నారు. ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు సమస్యలు 15 రోజుల్లో పరిష్కరించి నివేదికలు పంపాలన్నారు. రెండు శాఖలు సమన్వయంతో పని చేసి రైతులకు త్వరగా నూతన పట్టా పాసుపుస్తకాలు అందేలా చూడాలన్నారు. చెంచుపల్లిలో సర్వే నంబర్ 67,68, 69,70,76లో అనేక ఇబ్బందులు ఉన్నాయని వాటిని పరిష్కరించాలన్నారు. మదన్‌పల్లిలో సర్వే నంబర్ 219, 215 తదితర వాటిలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వాటి సమస్యలు తొలగించి పరిష్కారం చూపుతామన్నారు. అటవీ శాఖ అధికారులు రైతులకు ఇబ్బందులు కలిగించరాదన్నారు. 15 రోజుల్లో ఆటవీ భూములకు సంబంధించిన రికార్డులు తీసుకుని వాటి వివరాలు తెలుపాలన్నారు. ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో విశ్వనాథం, వికారాబాద్ తహసీల్దార్ చిన్నప్పలానాయుడు, ఫారెస్ట్ రేంజ్ అధికారి బాలయ్య, మదన్‌పల్లి సర్పంచ్ బండ రాజు, వీఆర్‌వో తులసీరాం , రైతులు ,గ్రామస్తులు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...