జిల్లాలో జోరు వాన..


Mon,June 24, 2019 01:42 AM

వికారాబాద్, నమస్తే తెలంగాణ /వికారాబాద్ రూరల్ : జిల్లాలో రెండు రోజులుగా పలు మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు, కుంటలు నిండి పొంగి పొర్లుతున్నాయి. దీంతో ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ రహదారులకు అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వికారాబాద్ మండలం సిద్దులూర్ చెరువు పొంగి పొర్తింది. అదే విధంగా మర్పల్లి మండలం బిల్‌కల్ చెరువు కూడా నిండి పొంగి పొర్తింది. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని వికారాబాద్, మర్పల్లి, కొడంగల్, మోమిన్‌పేట, బొంరాస్‌పేట, పరిగి తదితర మండలాల్లో వర్షాలు బాగా కురుస్తున్నాయి. మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షకాలం ప్రారంభమై ఏరువాక పౌర్ణమి ముగిసినా కూడా వర్షాలు సరైన విధంగా లేక పోవడంతో రైతన్నలు దిగులుతో ఎదురు చూస్తున్న సమయంలో వర్షాలు జోరందుకున్నాయి. దీంతో విత్తనాలు నాటుకునేందుకు అనువుగా ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏరువాక పౌర్ణమి వరకు మొలకలు వచ్చి గతంలో కలుపు తీసేందుకు వెళ్లేవాళ్లమని రైతులు పేర్కొంటున్నారు. ఈ సారి వర్షాలు ఆలస్యంగా వచ్చాయని, ఇప్పటి కైనా వర్షాలు బాగా పడితే పంటలు బాగా పండుతాయని పేర్కొంటున్నారు.
పొంగిన సిద్దులూర్ వాగు
వికారాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి మండల పరిధిలోని సిద్దులూర్ వాగు పొంగిపొరిలింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కురిసిన వర్షానికి సిద్దులూర్ వాగు నిండింపోయి రోడ్డుపై ప్రవహిస్తుంది. ఉధృతంగా ప్రవహిస్తున్న నీటికి సిద్దులూర్ నుంచి పులుసుమామిడి, వికారాబాద్‌కు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాగు ప్రవాహం తగ్గేంత వరకు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. గంటపాటు కురిసిన వర్షానికి వాగు పొంగడంతో గ్రామస్తులు అధిక సంఖ్యలో వాగు వద్దకు చేరుకొని ఆనందం వ్యక్తం చేశారు. సాయంత్రం వాగు ఉధృతి తగ్గడంతో పలువురు ప్రజలు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నెమ్మదిగా వాగు దాటారు. వాగు ప్రవాహం పూర్తిగా తగ్గిన తర్వాతే వాహనాల రాకపోకలు సాగాయి.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...