కురిసిన వర్షం.. మురిసిన రైతు


Sun,June 23, 2019 05:15 AM

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఎట్టకేలకూ వరుణుడు కరుణించాడు. వర్షాకాలం ప్రారంభమైనా వరుణుడి జాడ లేకపోవడంతో పంటల సాగుకు అదును దాటిపోతుందని ఆందోళనలో ఉన్న రైతన్నలకు శుక్రవారం రాత్రి కురిసిన వర్షంతో ప్రాణమొచ్చింది. వర్షకాలం ప్రారంభం కావడంతో విత్తనాలను, ఎరువులను సిద్ధం చేసుకున్న రైతులు వర్షం కోసం 20 రోజులుగా ఎదురుచూశారు. అయితే శుక్రవారం కురిసిన వర్షంతో రైతులు విత్తనాలు నాటేందుకు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. నిన్న శనివారం కావడంతో విత్తనాలను, ఎరువులను సిద్ధం చేసుకున్న రైతులు నేడు నాటేందుకు సమాయ త్తమయ్యారు. వ విత్తనాలు వేసేందుకు సరిపోను వర్షం కురువడంతో నేడు జిల్లా వ్యాప్తంగా 50 శాతానికిపైగా విత్తనాలను నాటే అవకాశముందని జిల్లా వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. అయితే విత్తనాలను నాటేందుకు 20 రోజులు ఆలస్యమైనా రైతులు ఆందోళన చెందాల్సిన అవసంరలేదని, మరో పదిహేను రోజుల వరకు పంటలను సాగు చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది సాధారణ సాగు విస్తీర్ణం 1,72,153 హెక్టార్లు కాగా ఇప్పటివరకు 3138 హెక్టార్లలో ఆయా పంటలు సాగయ్యాయి. మరోవైపు జిల్లాలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షంతో జిల్లాలోని యాలాల మండలంలో అత్యధికంగా 5.68 సెం.మీటర్ల వర్షపాతం నమోదయింది. బొంరాస్‌పేట, కొడంగల్, దౌల్తాబాద్, ధారూర్ మండలాల్లో 3 సెం.మీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది.
యాలాల మండలంలో అత్యధికంగా
5.68 సెం.మీటర్ల వర్షపాత ం
ఎట్టకేలకూ నైరుతి రుతుపవనాల ప్రభావంతో జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షంతో జిల్లావ్యాప్తంగా 5 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జిల్లాలోని యాలాల మండలంలో 5.68 సెం.మీటర్ల వర్షపాతం నమోదుకాగా, బొంరాసుపేట్ మండలంలో 4.02 సెం.మీటర్లు, కొడంగల్, దౌల్తాబాద్ మండలాల్లో 3.24 సెం.మీటర్లు, ధారూర్ మండలంలో 3 సెం.మీటర్లు, బషీరాబాద్ మండలంలో 2.12 సెం.మీటర్లు, పెద్దేముల్ మండలంలో 2.6 సెం.మీటర్లు, బంట్వారం మండలంలో 2.12 సెం.మీటర్లు, తాండూర్ మండలంలో 1.92 సెం.మీటర్లు, దోమ మండలంలో 1.4 మి.మీటర్లు, పరిగి మండలంలో 6.4 మి.మీటర్లు, వికారాబాద్ మండలంలో 1.2 సెం.మీటర్లు, మోమిన్‌పేట్ మండలంలో 1.04 సెం.మీటర్లు, మర్పల్లి మండలంలో 6.4 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.
జూలై మొదటి వారం వరకు
విత్తనాలు నాటొచ్చు..
ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ పంటలను సాగు చేసేందుకు అదును దాటలేదు. వర్షాకాలం ప్రారంభమై 20 రోజులైనా నైరుతి రుతుపవనాల ఆలస్యంగా వచ్చాయి. విత్తనాలను నాటేందుకుగాను మరో 15-20 రోజుల వరకు అనువుగా ఉంటుంది. ప్రతి ఏటా కొందరు రైతులు జూలై మొదటి వారం వరకు పంటలను సాగు చేసినా ఎలాంటి నష్టముండదు. ఒకవేళ వర్షాలు ఆలస్యమై జూలై 15 దాటితేనే పంటలను సాగు చేసేందుకు వీలుండదని అధికారులు చెబుతున్నారు. జూలై 15 తర్వాత ఇక ప్రత్యామ్నాయ పంటలపైనే రైతులు ఆధారపడాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో ఈ వానకాలం సీజన్‌కుగాను సాధారణ సాగు విస్తీర్ణం 1,72,153 హెక్టార్లుకాగా ఇప్పటివరకు 3138 హెక్టార్లలో ఆయా పంటలు సాగయ్యాయి. అయితే జిల్లాలో ఇప్పటివరకు సాగైన పంటల్లో కొడంగల్, తాండూర్ నియోజకవర్గాల్లోనే పంటలను సాగు చేశారు. అయితే ఇప్పటివరకు సాగైన పంటలకు సంబంధించి, జొన్న సాధారణ సాగు విస్తీర్ణం 3792 హెక్టార్లకుగాను ఇప్పటివరకు 52 హెక్టార్లు, మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 29,429 హెక్టార్లుకాగా ఇప్పటివరకు 420 హెక్టార్లు, కందులు సాధారణ సాగు విస్తీర్ణం 56,721 హెక్టార్లుకాగా ఇప్పటివరకు 543 హెక్టార్లు, పెసర సాధారణ సాగు విస్తీర్ణం 8013 హెక్టార్లుకాగా ఇప్పటివరకు 225 హెక్టార్లు, మినుములు సాధారణ సాగు విస్తీర్ణం 4977 హెక్టార్లుకాగా ఇప్పటివరకు 57 హెక్టార్లు, సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 1381 హెక్టార్లుకాగా ఇప్పటివరకు 47 హెక్టార్లు, పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 45,349 హెక్టార్లుకాగా ఇప్పటివరకు 1730 హెక్టార్లు, పసుపు సాధారణ సాగు విస్తీర్ణం 2382 హెక్టార్లుకాగా ఇప్పటివరకు 10 హెక్టార్లలో సాగయింది.
ఎరువులు, విత్తనాలు సిద్ధం
రాష్ట్ర ప్రభుత్వం ఎరువులు, విత్తనాల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టింది. ప్రభుత్వం ఎరువులతోపాటు విత్తనాలను కూడా రైతులకు సబ్సిడీతో పంపిణీ చేస్తుంది. జనుము తదితర విత్తనాలకు 50 శాతం రాయితీ ఇస్తుండగా, జొన్న, కొర్రలు, రాగులకు సంబంధించి 65 శాతం రాయితీతో ప్రభుత్వం రైతులకు సరఫరా చేస్తుంది. జిల్లాలో 7915 క్వింటాళ్ల ఆయా విత్తనాలు అందుబాటులో ఉండగా 4128 క్వింటాళ్ల విత్తనాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పంపిణీ చేశారు. అదేవిధంగా ఎరువులకు సంబంధించి యూరియా 14,197 మెట్రిక్ టన్నుల అవసరమని అంచనా వేయగా 7128 మెట్రిక్ టన్నులు జిల్లాలో అందుబాటులో ఉంది. అదేవిధంగా డీఏపీ 19,795 మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేయగా, 2903 మెట్రిక్ టన్నులు, ఎంవీపీ 5947 మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేయగా 174 మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌సీ 15,962 మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేయగా 49 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులకు సంబంధించి 3233 మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేయగా 2361 మెట్రిక్ టన్నులు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని సంబంధిత అధికారులు వెల్లడించారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...