స్వచ్ఛత దిశగా అడుగులు


Sat,June 22, 2019 12:04 AM

-ఇప్పటికే 208 గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి
-స్వచ్చభారత్, ఉపాధి హామీ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణాలు
-పూర్తి దశకు మున్సిపాలిటీలో మరుగుదొడ్ల నిర్మాణాలు
-జూలై మొదటి వారంలో పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు
-వికారాబాద్, మోమిన్‌పేటలో మరుగుదొడ్ల నిర్మాణాలు పూరి
వికారాబాద్, నమస్తే తెలంగాణ : గ్రామాల అబివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా గ్రామాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటుంది. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహంతో జిల్లాను మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా మార్చేందేకు అధికార యంత్రాంగం తీవ్ర కసరత్తు చేస్తున్నది. జిల్లా యంత్రాంగం మరుగుదొడ్ల నిర్మాణంలో కీలక భూమిక పోషించేలా కలెక్టర్ మస్రత్‌ఖానమ్ ఆయేషా మండలాల వారీగా సమావేశాలను నిర్వహిస్తూ గ్రామస్థాయి అధికారులకు బాధ్యతలను అప్పగిస్తున్నారు. జిల్లాలో పాత గ్రామ పంచాయతీల ప్రకారం 374 గ్రామ పంచాయతీలకుగాను ఇప్పటికి 208 గ్రామ పంచాయతీలను స్వచ్ఛ గ్రామాలుగా ఎంపిక చేశారు. జిల్లాలో 91,971 మరుగుదొడ్ల నిర్మాణాలకు అనుమతులు ఉండగా, 42,723 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయ్యాయ్యాయి., 47,877 వివిధ దశల్లో నిర్మాణ పనుల్లో ఉన్నాయి. బంట్వారంలో 4,472 మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉండగా, 1,360 పూర్తికాగా, 3,089 వివిధ దశల్లో నిర్మాణాలు సాగుతుండగా , 12 గ్రామాలు ఓడీఎఫ్‌గా ప్రకటించారు. బషీరాబాద్ 5,284 నిర్మించాల్సి ఉండగా 647పూర్తి కాగా, 4488 వివిధ దశల్లో పనులు కొనసాగుతున్నాయి. 9 గ్రామాలు ఓడీఎఫ్‌గా ప్రకటించారు.

బొంరాస్‌పేట మండలంలో 4,904 నిర్మించాల్సి ఉండగా, 1,457 నిర్మించగా, 3,434 వివిధ దశల్లో నిర్మాణాల్లో పనులు కొనసాగుతున్నాయి. 10 గ్రామాలను ఓడీఎఫ్‌గా ప్రకటించారు. ధారూరు 5,558 మరుగుదొడ్లకుగాను, 3,620 పూర్తికాగా, 1,925 వివిధ దశల్లో నిర్మాణాల్లో కొనసాగుతుండగా 20 గ్రామాలను ఓడీఎఫ్‌గా ప్రకటించారు. దోమ మండలంలో 4,438 మరుగుదొడ్లకు గాను, 2,129 పూర్తికాగా, 2,232 వివిధ దశల్లో నిర్మాణాల్లో కొనసాగుతుండగా 13 గ్రామాలను ఓడీఎఫ్‌గా ప్రకటించారు. దౌల్తాబాద్ 5,959 మరుగుదొడ్లకుగాను, 1,513 పూర్తి కాగా, 4,437 వివిధ దశల్లో నిర్మాణాలు సాగుతుండగా, 5 గ్రామాలను ఓడీఎఫ్‌గా ప్రకటించారు. కొడంగల్ 6,011 మరుగుదొడ్లకుగాను, 1,047 పూర్తి కాగా, 4,937 వివిధ దశల్లో నిర్మాణాల్లో కొనసాగుతున్నాయి., ఒక గ్రామాన్ని ఓడీఎఫ్‌గా ప్రకటించారు. కులకచర్ల మండలంలో 7,576 మరుగుదొడ్లకుగాను, 4,874 పూర్తి కాగా, 2,648 వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. 16 గ్రామ పంచాయతీలను ఓడీఎఫ్‌గా ప్రకటించారు. మర్పల్లిలో 4,739 మరుగుదొడ్లకుగాను 3,665 మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి కాగా, 822 వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతుండగా, 14 గ్రామాలను ఓడీఎఫ్‌గా ప్రకటించడం జరిగింది.

నవాబుపేట 3,271 మరుగుదొడ్ల నిర్మాణాలకు గాను, 2,322 పూర్తికాగా, 909 వివిధ దశల్లో నిర్మాణంలో కొనసాగుతుండగా, 9 గ్రామాలను ఓడిఎఫ్‌గా ప్రకటించారు. పరిగిలో 6,081 మరుగుదొడ్ల నిర్మాణాలకుగాను, 2,653పూర్తికాగా, 3,419 వివిధ దశల్లో నిర్మాణాల్లో సాగుతుండగా, 10 ఓడిఎఫ్ గ్రామాలుగా ప్రకటించారు. పెద్దేముల్ మండలంలో 5,875 మరుగుదొడ్ల నిర్మాణాలకు గాను 1,600 పూర్తి కాగా, 4,192 వివిధ దశల్లో నిర్మాణంలో ఉండగా, 5 గ్రామాలను ఓడీఎఫ్‌గా ప్రకటించారు. పూడూరు మండలంలో 6,039 మరుగుదొడ్ల నిర్మాణాలకుగాను 4,468 పూర్తికాగా, 1,344 వివిధ దశల్లో నిర్మాణంలో ఉండగా, 18 గ్రామాలను ఓడీఎఫ్‌గా ప్రకటించారు. తాండూరు 7,569 మరుగుదొడ్ల నిర్మాణాలకు గాను, 3,093 పూర్తికాగా, 4,149 వివిధ దశల్లో నిర్మాణంలో ఉండగా, 12 గ్రామాలను ఓడిఎఫ్‌గా ప్రకటించారు. యాలాల 5,984 మరుగుదొడ్ల నిర్మాణానికి గాను, 1,744 పూర్తికాగా, 4,240 వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉండగా, 9 గ్రామాలను ఓడిఎఫ్‌గా ప్రటకించారు. మిగత మరుగుదొడ్ల నిర్మాణాలన్నింటిని జులై మొదటి వారం లోగా పూర్తి చేసేందుకు అధికారులు అన్ని విధాలుగా సమాయత్తంతో ముందుకు సాగుతున్నారు.

జిల్లాలోని మున్సిపాలిటీలైన తాండూరు, వికారాబాద్ మున్సిపాలిటీలో నిర్ణయించిన గడువులోగా మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు చర్యలను ముమ్మరం చేశారు. మున్సిపాలిటీల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. అందుకు అనుగుణంగా వికారాబాద్ మున్సిపాలిటీలో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. తాండూరులో పూర్తి దశకు చేరుకునేందుకు సిద్ధమవుతుంది. గ్రామస్థాయిలో కార్యదర్శులు, అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు, ఉపాధి హామి సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకొని బాధ్యతయుతంగా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టర్ ప్రత్యేక ఆదేశాలతో కార్యచరణ దిశగా అధికార యంత్రాంగం కదులుతుంది.

మున్సిపాలిటీల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి
వికారాబాద్ మున్సిపల్ పరిధిలో 28 వార్డులు ఉన్నాయి. పట్టణంలో 55వేల జనాభా ఉంది. వికారాబాద్‌ను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా మార్చడంలో మున్సిపల్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మొత్తంగా ఇంటింటికీ సర్వే చేయగా 2,068 వ్యక్తి గత మరుగుదొడ్లను కొత్తగా నిర్మిస్తే చాలని నిర్ణయించారు.
వాటన్నింటిని పూర్తి చేశారు. లబ్ధిదారులకు సంబంధించిన డబ్బులను వారి వారి ఖాతాల్లో జమ చేశారు. కొత్తగా నిర్మించుకున్నవారంతా అక్టోబర్ నుంచి పూర్తిగా వాటిని వినియోగించుకుంటున్నారు. దీంతో వికారాబాద్ పట్టణం బహిరంగ మలమూత్ర విసర్జనరహిత పట్టణంగా రూపుదాల్చుకుంది. తాండూరు పట్టణంలో 65,252 జనాభాకు 31 వార్డులు ఉన్నాయి. సర్వే తరువాత మొత్తం 2,059 మంది వ్యక్తి గత మరుగుదొడ్ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నారు. వీటి పనులు కూడా పూర్తయి స్వచ్ఛ భారత్ లక్ష్యాన్ని చేరుకున్నాయి.

ఓడీఎఫ్ మండలంగా మార్చాలి
బంట్వారం : బంట్వారం, కోట్‌పల్లి మండలంలోని ప్రతి గ్రామంలో వంద శాతం మరుగు దొడ్లు నిర్మించి ఓడీఎఫ్ మండలాలుగా మార్చాల్సిన బాధ్యత సర్పంచ్‌లు, ఎంపీటీసీలదేనని కలెక్టర్ మస్రత్‌ఖానమ్ అయేషా పేర్కొన్నారు. శుక్రవారం బంట్వారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, అధికారులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజా ప్రతినిధుల సహకారంతో అధికారులతో కలిసి మరుగు దొడ్లను నిర్మించే పనులు వేగవంతం చేయాలన్నారు. ఇప్పటికే మండలానికి అనేక నిధులు ఇచ్చామని, ఇంక ఎంత అవసరం ఉంటే అన్ని నిధులు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి రవీందర్, ఎంపీపీ సుజాత, జడ్పీటీసీ సునీతా, ఎంపీడీవో సుశీల్‌కుమార్, తహాసీల్దార్లు లలితా, గోపాల్, ఈవోపీఆర్డీ పాల్గొన్నారు.

ఎంపీడీవోలదే బాధ్యత
వికారాబాద్, నమస్తే తెలంగాణ : జిల్లాలోని అన్ని మండలాల్లో ఎంపీడీవోలు పూర్తి బాధ్యత వహించి ఈ నెల 30 వరకు పూర్తి చేసి, జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా ప్రకటించాలని కలెక్టర్ మస్రత్‌ఖానమ్ ఆయేషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఎంపీడీవోలు, ఏపీఎంలు , కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారీగా మరుగుదొడ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా అధికారులు కొన్ని గ్రామాల్లో ప్రజలు మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టడానికి ముందుకు రావడం లేదని కలెక్టర్‌కు తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ప్రభుత్వ పరంగా అందించే పింఛన్లు, ఇతర సౌకర్యాలను నిలిపివేయాలని సూచించారు. అలాగే పాఠశాలల విద్యార్థులతో ఆ గ్రామంలో ర్యాలీలు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. ఆర్థిక స్తోమత లేని నిరుపేదలకు బ్యాంక్ రుణాలు మంజూరు చేయించి మరుగుదొడ్ల నిర్మాణం చేయించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెర్టర్ అరుణకుమారి, డీఆర్‌వో మోతీలాల్, జడ్పీసీఈవో జితేందర్‌రెడ్డి, డీఆర్‌డీవో జాన్సన్‌లతో పాటు అన్ని మండలాల ఎంపీడీవోలు, ఏపీవోలు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...