జూలైలో రెండో విడుత గొర్రెల పంపిణీ


Fri,June 21, 2019 12:36 AM

-రెండో విడుతలో భాగంగా 11,071 యూనిట్ల గొర్రెల పంపిణీ
-రూ.100 కోట్లతో గొర్రెల కొనుగోలు
-యాద్గిర్, షోలాపూర్, బీజాపూర్ నుంచి గొర్రెలను కొనుగోలు చేయనున్న జిల్లా యంత్రాంగం
-తొలి విడుతలో 10,954 మందికి గొర్రెల పంపిణీకిగాను..
-10,477 మందికి పంపిణీ
-ఒక్కో లబ్ధిదారుడికి 21 గొర్రెల పంపిణీ
-జిల్లా వ్యాప్తంగా 22,025 మంది గొర్రెల పెంపకందారులు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా రెండో విడుత గొర్రెల పంపిణీకిగాను ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈనెలాఖరు లేదా వచ్చేనెలలో రెండో విడుతలో భాగంగా గొర్రెలను పంపిణీ చేయనున్నారు. రెండో విడుత గొర్రెల పంపిణీకి సంబంధించి మరో రెండు, మూడు రోజుల్లో స్పష్టత రానుంది. అయితే రెండో విడుతలోనూ జిల్లాకు యాద్గిర్, షోలాపూర్, బీజాపూర్ ప్రాంతాల నుంచి గొర్రెలను కొనుగోలు చేసి తీసుకురానున్నారు. అయితే ఇప్పటికే తొలి విడుత గొర్రెల పంపిణీతో గొల్ల, కుర్మల్లో జీవితాల్లో వెలుగులు నిండాయి. గొల్ల, కుర్మలు ఆర్థికంగా ఎదుగడంతోపాటు కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకుగాను టీఆర్‌ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లు కూలీ, నాలి చేసుకొని బతుకునీడుస్తున్న గొల్ల, కుర్మలకు గొర్రెలను పంపిణీ చేయడంతో ఆ కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండాయి. అదేవిధంగా గొర్రెల యూనిట్ల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా గొర్రెల పంపిణీ పథకాన్ని అమలుచేసేందుకుగాను ఈ ఏడాది కూడా లాటరీ పద్ధతిలోనే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. జిల్లాలో ఉన్న గొల్ల, కుర్మల సొసైటీ సభ్యుల్లో కొంతమందికి గతేడాది గొర్రెలను పంపిణీ చేయగా మిగిలిన సభ్యులకు వచ్చేనెలలో గొర్రెలను పంపిణీ చేయనున్నారు. జిల్లాలో రెండో విడుతలో భాగంగా 11,071 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా గతేడాది 10,954 గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాల్సి ఉండగా 10,477 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు.

వచ్చేనెలలో రెండో విడుత గొర్రెల పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా రెండో విడుత గొర్రెల పంపిణీ ప్రక్రియను వచ్చేనెలలో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రెండో విడుత గొర్రెల పంపిణీపై ప్రభుత్వం నుంచి అధికారికగా మరో రెండు, మూడు రోజుల్లో నిర్ణయం వెలువడనున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. గతేడాది ఆగస్టు మాసంలోనే రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినప్పటికీ, ఉద్యోగుల బదిలీలతోపాటు వరుస ఎన్నికల దృష్ట్యా రెండో విడుత గొర్రెల పంపిణీ ప్రక్రియను ప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. రెండో విడుతలో భాగంగా జిల్లాలోని 11,071 యూనిట్లకు గొర్రెలను పంపిణీ చేయనున్నారు. రెండో విడుత గొర్రెల పంపిణీకిగాను రూ.100 కోట్లతో కర్ణాటక, మహారాష్ర్టాల్లోని యాద్గిర్, షోలాపూర్, బీజాపూర్ తదితర ప్రాంతాల నుంచి గొర్రెలను కొనుగోలు చేసి తీసుకురానున్నారు. అయితే తొలి విడుతలో 10,954 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేయాల్సి ఉండగా 10,477 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు. తొలి విడుతలో గొర్రెల పంపిణీకిగాను రూ.89 కోట్లను ఖర్చు చేసింది. అయితే అదేవిధంగా జిల్లావ్యాప్తంగా 22,025 మంది లబ్ధిదారులుండగా, వీరిని ఏ, బీ గ్రూపులుగా విభజించి లాటరీ పద్ధ్దతిన లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. లాటరీ పద్ధతినే గతేడాది కొంతమందికి, ఈ ఏడాది మిగిలిన వారికి గొర్రెలను పంపిణీ చేయనున్నారు.

కుల వృత్తులకు పూర్వవైభవ
రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే కులవృత్తులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకుగాను గొల్ల, కుర్మలకు సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తున్నారు. గతేడాది సబ్సిడీపై పంపిణీ చేసిన గొర్రెలతో చాలా మంది గొల్ల, కుర్మల కుటుంబాల్లో వెలుగులు నిండాయి. సంబంధిత లబ్ధిదారులు ఇప్పటికే రెండు పర్యాయాలు గొర్రె పిల్లలతోపాటు ఉన్నితో లబ్ధి పొందారు. అయితే ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేస్తున్న గొర్రెలను రెండు విడుతల్లో లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు, గొర్రెల పెంపకం పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిని ఏ, బీ గ్రూపులుగా విభజించి తొలి విడతలో కొంతమందికి పంపిణీ చేయగా, రెండో విడుతలో మిగిలిపోయిన లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేయనున్నారు. ఒక్కొ లబ్ధిదారుడికి ఒక్కొ యూనిట్ కింద 20 గొర్రెలతోపాటు ఒక గొర్రె పొటేలును పంపిణీ చేస్తున్నారు. ఒక్కొ యూనిట్‌కు రూ.1.25 లక్షలు వెచ్చిస్తున్నారు, ఇందులో ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ ఇవ్వనుండగా, మిగతా 25 శాతం డబ్బును లబ్ధిదారులు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం రూ.93,750లను భరిస్తుండగా,..మిగతా రూ.31,250లను లబ్ధిదారులు భరిస్తున్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...