జూలైలో..మున్సిపోల్స్


Wed,June 19, 2019 11:37 PM

- జిల్లాల్లో మొత్తం నాలుగు మున్సిపాలిటీలు
- త్వరలో రిజర్వేషన్‌ల ప్రక్రియ ప్రారంభం
- వార్డుల వారీగా ఓటర్ల జాబితా
పరిగి, నమస్తే తెలంగాణ : జూలై నెలాఖరు లోపు మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశ పరిచి మున్సిపల్ చట్టం ఆమోదించడం లేదా ఆర్డినెన్సు తీసుకువచ్చి చట్టం అమలు చేసిన తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరిపించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేపడుతుంది. జూలై నెలాఖరు లోపు మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా మంగళవారం మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రకటించారు. దీంతో మరో నెలన్నర రోజుల వ్యవధిలోనే మున్సిపల్ ఎన్నికలు పూర్తి కానున్నాయని చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నెలలోనే నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామపంచాయతీల ఎన్నికలు పూర్తి చేసిన ప్రభుత్వం, కొత్తగా మున్సిపల్ చట్టం తీసుకువచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇందుకు సంబంధించి కొత్త చట్టం రూపొందించడంలో ఉన్నతాధికారుల కమిటీ పనిచేస్తుంది. ఈ చట్టం అమలులోకి తీసుకువచ్చి నూతన చట్టం ప్రకారం ఎన్నికలు జరిపించాలన్నది సర్కారు ఆలోచన. ఇందులో భాగంగా ఓటర్ల జాబితాకు సంబంధించిన పనులు మార్చిలోనే పూర్తి చేయాలని నిర్ణయించినా కొంత ఆలస్యం జరిగింది. తాజాగా సీఎం కేసీఆర్ ప్రకటనతో సాధ్యమైనంత త్వరగా మున్సిపల్ పోరు ప్రారంభం కానుందని చెప్పవచ్చు. రాబోయే వారం పది రోజులలో రిజర్వేషన్‌ల ప్రక్రియకు సంబంధించిన ఆదేశాలు జారీ చేస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. తద్వారా పూర్తిస్థాయిలో మున్సిపల్ ఎన్నికలకు అధికార యంత్రాంగాన్ని సన్నద్దం చేయనున్నారు. జిల్లా పరిధిలో పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటిలో తాండూరు, వికారాబాద్ పాత మున్సిపాలిటీలు కాగా ఇటీవల పరిగి, కొడంగల్‌లు నూతనంగా మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయబడ్డాయి.

ఓటర్ల జాబితా తర్వాత రిజర్వేషన్‌లు
ఓటర్ల తుది జాబితా ప్రకటన తర్వాత రిజర్వేషన్‌ల ప్రక్రియ కొనసాగించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. మున్సిపాలిటీలకు సంబంధించి ప్రత్యేకంగా కొత్త చట్టం తీసుకువస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. నూతన పంచాయతీరాజ్ చట్టం తీసుకువచ్చిన ప్రభుత్వం మరింత పకడ్బందీగా మున్సిపాలిటీల చట్టం తీసుకురానున్నట్లు తెలిసింది. ఈ చట్టం రూపొందించడంలో ఉన్నతాధికారులు నిమగ్నమై ఉన్నట్లు సమాచారం. ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు జరిపి నూతన మున్సిపల్ చట్టం ఆమోదించడమా లేక ఆర్డినెన్స్ తీసుకువచ్చి చట్టం అమలు చేయడం ద్వారా నూతన చట్టం ప్రకారం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలనే అంశంపై వారం పది రోజులలో స్పష్టమైన నిర్ణయం వెలువడనుంది. తద్వారా నూతన మున్సిపల్ చట్టాన్ని అనుసరించి మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నెలాఖరు లోపు ఇందుకు సంబంధించి అధికారులకు సమాచారం చేరవేసి రిజర్వేషన్‌ల ప్రక్రియ చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందని తెలిసింది. తర్వాత చట్టంలో పేర్కొన్న విధంగా రిజర్వేషన్‌ల ప్రక్రియ కొనసాగించడం జరుగుతుంది. ఆయా మున్సిపాలిటీలలో రిజర్వేషన్‌ల ప్రక్రియ పూర్తి చేసి, ఆ తర్వాత పోలింగ్ స్టేషన్‌ల ఏర్పాటు తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించడం జరుగుతుందని అధికారులు తెలిపారు.

ఆశావహుల ఎదురుచూపులు
జూలైలో మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించడంతోపాటు రిజర్వేషన్‌ల ప్రక్రియ సైతం త్వరలోనే నిర్వహించడం జరుగుతుందని పేర్కొనడంతో మున్సిపల్ బరిలో నిలిచేందుకు ఉవ్విళ్లూరుతున్న ఆశావహులు రిజర్వేషన్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. తాము నివాసముంటున్న ప్రాంతం ఏ రిజర్వేషన్ వస్తుంది, లేదంటే తమకు అనుకూలమైన రిజర్వేషన్ ఎక్కడ వస్తుందని వారు ఆలోచిస్తున్నారు. రిజర్వేషన్‌ల ప్రకటన తర్వాతే ఏ వార్డు ఏ వర్గానికి రిజర్వు చేయబడింది తెలిసేది. దీంతో అప్పటివరకు ఆశావహుల ఎదురుచూపులు తప్పేలా లేవు. అన్ని ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన టీఆర్‌ఎస్ పార్టీ నుంచే ఆశావహుల సంఖ్య అత్యధికంగా ఉన్నది. కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్ స్థానాలను ఆశిస్తున్న వారి సంఖ్య ప్రతిచోట పదుల సంఖ్యలో ఉండడం గమనార్హం.

ఒక్కో వార్డులో కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న వారు కనీసం పది పైనే ఉండగా ఆర్థిక, రాజకీయంగా బలంగా ఉన్నవారు మున్సిపల్ చైర్మన్ స్థానాలపై కన్నేశారు. వరుస విజయాలతో మంచి ఊపుమీదున్న టీఆర్‌ఎస్ మున్సిపాలిటీలు సైతం క్లీన్ స్వీప్ చేసేందుకు ప్రత్యేక వ్యూహరచనతో ముందుకు సాగనుంది. ఈ దిశగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ యంత్రాంగాన్ని మున్సిపల్ ఎన్నికలకు సన్నద్దం చేస్తున్నారు. జూలైలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయనే ప్రకటనతో టీఆర్‌ఎస్ పార్టీలోని ఆశావహులంతా అప్పుడే టికెట్‌ల వేటలో పడ్డారు. మిగతా పార్టీలకు సంబంధించి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పెద్దగా పోటీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. రిజర్వేషన్‌ల ప్రకటన తర్వాత పార్టీల తరఫున అభ్యర్థుల ఎంపిక చేపట్టి ముందస్తుగానే ప్రచార రంగంలో దిగాలని టీఆర్‌ఎస్ సన్నాహాలు చేస్తుంది.

వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారు
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందుగా ఓటర్ల జాబితా తయారు చేపట్టాడం జరుగుతుంది. 2018 నవంబర్‌లో ప్రచురించిన జాబితా ప్రకారం పరిగి మున్సిపాలిటీలోని 9 వార్డులలో 15,547 మంది ఓటర్లుండగా, తాండూరులోని 31 వార్డుల పరిధిలో 54,512 మంది ఓటర్లు, కొడంగల్‌లోని 7 వార్డులలో 14,412 మంది, వికారాబాద్‌లో 28 వార్డులలో 48,005 మంది ఓటర్లు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య ఆధారంగా వార్డుల వారీగా జాబితా తయారు చేశారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ తర్వాత మున్సిపల్ పరిధిలోని ఓటర్ల జాబితా సవరించలేదు. దీంతోపాటు ఇటీవల కొత్తగా ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్న వారి వివరాలను సైతం ఆయా వార్డుల వారీగా విభజించి ఓటర్ల జాబితా తయారు చేయడం జరుగుతుంది. మార్చి 27వ తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రకటించేందుకు అప్పట్లో నిర్ణయించినా వాయిదా పడింది. జూలైలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించడంతో ఇక త్వరలోనే ఓటర్ల జాబితా తయారుకు సంబంధించిన ఆదేశాలు వెలువడనున్నాయి. ఓటర్ల ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాను తయారు చేసి విడుదల చేయడం జరుగుతుంది.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...