తుది దశకు కలెక్టరేట్‌ నిర్మాణం


Sun,June 16, 2019 12:36 AM

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లా శాశ్వత కలెక్టరేట్‌ నిర్మాణానికి సంబంధించి పనులు తుది దశకు చేరుకున్నాయి. జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ నిర్మాణ పనులు పూర్తి చేసి సెప్టెంబర్‌లో అప్పగించనున్నారు. అయితే నూతన కలెక్టరేట్‌ను సెప్టెంబర్‌లో అప్పగించినప్పటికీ, జిల్లా ఆవిర్భావ దినోత్సవం అక్టోబర్‌ 11న నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. అయితే ఇప్పటికే ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ నిర్మాణ ప్రధాన పనులు పూర్తికాగా మిగిలిపోయిన చిన్న, చిన్న పనులు కొనసాగుతున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఎట్టిపరిస్థితుల్లో గడువులోగా సమీకృత కలెక్టరేట్‌ నిర్మాణాన్ని పూర్తి చేసేలా పనులు స్పీడందుకున్నాయి. ప్రస్తుతం ప్రధాన పనులు పూర్తికాగా ప్లంబింగ్‌, ఎలక్ట్రికల్‌, టైల్స్‌, శానిటేషన్‌ పనులు, ట్యాంకుల నిర్మాణం తదితర పనులు కొనసాగుతున్నాయి. మరో రెండు నెలలు గడువుండటంతో ఆలోగా సంబంధిత పనులను పూర్తి చేసేందుకు జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌తోపాటు కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, డీఆర్వో, నలుగురు జిల్లాస్థాయి అధికారుల నివాస సముదాయాల నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయనున్నారు. జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ను భృంగి స్కూల్‌ ఎదురుగా ఉన్న 47.38 ఎకరాల అసైన్డ్‌ భూమిలో కలెక్టరేట్‌తోపాటు అధికారుల నివాస సముదాయాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపగా, ప్రభుత్వం 33 ఎకరాల్లో కలెక్టరేట్‌తోపాటు అధికారుల క్వార్టర్స్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. సంబంధిత అసైన్డ్‌ భూముల్లోని 22 ఎకరాల్లో సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయం, మిగతా 11 ఎకరాల్లో అధికారుల నివాస సముదాయాలను నిర్మిస్తున్నారు. అదేవిధంగా కొత్త కలెక్టరేట్‌ నిర్మాణానికిగాను రాష్ట్ర ప్రభుత్వం రూ.32 కోట్ల నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే.

పూర్తయిన ప్రధాన పనులు..
జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. భృంగి స్కూల్‌ ఎదురుగా ఉన్న అసైన్డ్‌ భూమిలో కలెక్టరేట్‌ నిర్మాణ పనులు ఎస్‌ అండ్‌ పి కన్‌స్ట్రక్షన్‌ సంస్థకు సంబంధించిన వారు శరవేగంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కలెక్టరేట్‌ నిర్మాణ పనులకు సంబంధించి ప్రధాన పనులు పూర్తికాగా, టైల్స్‌ వేయడం, విద్యుత్‌ పనులు, ప్లంబింగ్‌, ట్యాంకుల నిర్మాణం, శానిటేషన్‌ పనులు కొనసాగుతుండగా, పెయింటింగ్‌ పనులు దాదాపు పూర్తయింది. అక్టోబర్‌ వరకు కలెక్టరేట్‌ నిర్మాణానికి సంబంధిత కాంట్రాక్ట్‌ సంస్థకు ఒప్పదం ఉండగా సెప్టెంబర్‌ చివరి వారంలోగా పనులు పూర్తి చేసే విధంగా కలెక్టరేట్‌ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. అయితే సమీకృత కలెక్టరేట్‌తోపాటు జిల్లా పరిషత్‌ భవనాన్ని కూడా నిర్మించేందుకు ప్రతిపాదనలను పంపినప్పటికీ ప్రస్తుతానికి సంబంధిత స్థలంలో కలెక్టరేట్‌, అధికారుల నివాస సముదాయాలకు మాత్రమే ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

అక్టోబర్‌ 11న నూతన కలెక్టరేట్‌ ప్రారంభం?
ఈ ఏడాది అక్టోబర్‌లో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ కార్యాలయం జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానుంది. జిల్లా ఆవిర్భావ దినోత్సవం రోజైన అక్టోబర్‌ 11న నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు. అయితే ప్రస్తుతం ఉన్నట్లుగా ఒక్కొ శాఖ కార్యాలయం ఒక్కొ ప్రాంతంలో కాకుండా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ కార్యాలయాలతోపాటు అన్ని శాఖల కార్యాలయాలు ఒకేచోట ఉండేవిధంగా ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ను నిర్మాణం జరుగుతుంది. పోలీస్‌ శాఖ, అగ్నిమాపక శాఖ మినహా మిగతా అన్ని శాఖల కార్యాలయాలు ఒకేచోట ఉండేలా నిర్మించడంతోపాటు హెలిప్యాడ్‌, వెయ్యి సీట్లతో కూడిన సమావేశ మందిరం, వాకింగ్‌ ట్రాక్‌, బ్యాంక్‌ ఏటీఎంలు, మీ సేవా కేంద్రాలు ఉండేలా ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ను నిర్మిస్తున్నారు.

అదేవిధంగా పాలన సమర్ధవంతంగా జరుగాలంటే పాలనకు, ప్రజలకు సౌకర్యవంతమైన కార్యాలయాలు అవసరం కాబట్టి అన్ని వసతులతో కూడిన ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఉన్న కార్యాలయాల మాదిరిలా కాకుండా అధికారులు, ఉద్యోగులతోపాటు కలెక్టరేట్‌కు వచ్చే ప్రజల కోసం కూడా క్యాంటీన్లు, టాయిలెట్లు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా కొత్తగా నిర్మించనున్న నూతన కలెక్టరేట్‌లో లంచ్‌ రూంతోపాటు రికార్డు రూం, స్ట్రాంగ్‌రూం, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, జనరేటర్‌, యానిమల్‌ ట్రాప్స్‌ ఉండేలా ప్లాన్‌ చేశారు. సీఎం, మంత్రులు జిల్లాల పర్యటన సందర్భంగా సమీక్షా సమావేశాలను నిర్వహించాల్సి ఉంటుంది కావున ఇలా అన్ని సమావేశాలకు వీలుగా ఉండేందుకుగాను వెయ్యి మంది కూర్చునేలా కాన్ఫరెన్స్‌ హాల్‌ను ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌లో ఉండనుంది. అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ ప్రాంగణంలో పచ్చదనం ఉట్టిపడేలా ల్యాంగ్‌ స్కేపింగ్‌, అదేవిధంగా వాకింగ్‌ ట్రాక్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...