పట్టాదారు పాసుపుస్తకాల జారీ వేగవంతం


Sat,June 15, 2019 12:15 AM

-ఈనెలాఖరులోగా అందరికీ పాసు పుస్తకాలను జారీ చేసేందుకు చర్యలు
-ఇప్పటివరకు 2,08,487 మంది పట్టాదారులకు పాసు పుస్తకాలు
-పార్ట్‌-బీ భూముల సమస్యల పరిష్కారంపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి
-గ్రామసభల ద్వారా పార్ట్‌-బీ భూములపై విచారణ
-వారంరోజులుగా కొనసాగుతున్న వివాదాస్పద భూముల విచారణ
వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఈనెలాఖరులోగా పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేసేందుకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టింది. పట్టాదారు పాసు పుస్తకాల కోసం రైతులు ఏండ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోకపోవడంపై రాష్ట్ర సీఎం కేసీఆర్‌ సీరియస్‌ తీసుకోవడంతో పాటు త్వరితగతిన రైతుల భూ సమస్యలను పరిష్కరించి పాసు పుస్తకాలను జారీ చేయాలని ఆదేశించడంతో జిల్లా రెవెన్యూ యంత్రాంగం రంగంలోకి దిగింది. ఎట్టిపరిస్థితుల్లోనూ మరో పదిహేను రోజుల్లోగా పార్ట్‌-ఏ (వివాదారహిత) భూములకు సంబంధించి పట్టాదారు పాసు పుస్తకాలు అందరికీ జారీ చేసేలా జిల్లా ఉన్నతాధికారులు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. అంతేకాకుండా వివాదస్పద భూముల సమస్యలను కూడా పరిష్కరించి భూములకు సంబంధించి పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేసేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత వారం రోజులుగా గ్రామ సభలు నిర్వహించి పార్ట్‌-బీ భూముల సమస్యలపై గ్రామగ్రామాన విచారణ నిర్వహిస్తున్న రెవెన్యూ సిబ్బంది మరో వారంలో వివాదాస్పద భూములకు సంబంధించి విచారణ పూర్తి చేసి పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేసే ప్రక్రియను జిల్లా రెవెన్యూ యంత్రాంగం వేగవంతం చేసింది. అయితే జిల్లావ్యాప్తంగా 2,66,474 ఖాతాలు ఉండగా ఇప్పటివరకు 2,08,487 ఖాతాలకు పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేయడం జరిగింది. మిగిలిన 57,987 ఖాతాలకు సంబంధించి పట్టాదారు పాసు పుస్తకాలకు సంబంధించి పాసు పుస్తకాలను జారీ చేయాల్సి ఉంది.

2,08,487 ఖాతాదారులకు పాసుపుస్తకాలు జారీ...
జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 2,08,487 ఖాతాదారులకు పట్టాదారు పాసు పుస్తకాలు జారీ అయ్యాయి. పట్టాదారు పాసు పుస్తకాల జారీలో అత్యధికంగా దౌల్తాబాద్‌ మండలంలో 14,502 ఖాతాదారులకు, కొడంగల్‌ మండలంలో 14,015 మంది, వికారాబాద్‌లో 13,789 మంది, పరిగిలో 13,615 మంది, బొంరాసుపేట్‌లో 13,495 మంది, పూడూర్‌లో 13,283 మంది, మర్పల్లిలో 13,334 మంది, మోమిన్‌పేట్‌లో 11,235 మంది, యాలాల్‌లో 10,851 మంది, తాండూర్‌లో 10,609 మంది, పెద్దేముల్‌లో 11,159 మంది, బషీరాబాద్‌లో 10,821 మంది, నవాబుపేట్‌లో 13,458 మంది, కోట్‌పల్లిలో 6,999 మంది, దోమలో 10,332 మంది, ధారూర్‌లో 10,661 మంది, బంట్వారంలో 5386 మంది, కుల్కచర్లలో 10,943 మంది ఖాతాదారులకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ అయ్యాయి. అదేవిధంగా పార్ట్‌-ఏ భూములకు సంబంధించి 57,987 ఖాతాలకు డిజిటల్‌ సంతకం కావాల్సి ఉంది.

57,987 ఖాతాదారులకు అందని పాసు పుస్తకాలు...
జిల్లాలో 2,66,474 ఖాతాలుండగా 57,987 ఖాతాదారులకు సంబంధించి ఇప్పటివరకు పట్టాదారు పాసు పుస్తకాల జారీ పెండింగ్‌లో ఉంది. అయితే ప్రధానంగా వీఆర్వోల నిర్లక్ష్యం, డబ్బులు ఆశించడంతోనే చాలా వరకు పట్టాదారు పాసు పుస్తకాల జారీ ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నట్లు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. క్షేత్రస్థాయిలో వీఆర్వోలు డబ్బులు ఆశించే చాలా మంది రైతుల ఖాతా నెంబర్లు తప్పులు రాయడం, సర్వే నెంబర్లను తప్పుగా నమోదు చేయడం, భూ విస్తీర్ణాన్ని తప్పుగా రాయడంతోనే రైతులు పాసు పుస్తకాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. వీఆర్వోలు చేసిన తప్పిదాలతోనే ప్రస్తుతం రైతులు పాసు పుస్తకాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినప్పటికీ రెవెన్యూ అధికారుల్లో మాత్రం ఏ మాత్రం చలనం రాకపోవడం గమనార్హం. అయితే పట్టాదారు పాసు పుస్తకాల జారీలో నిర్లక్ష్యం వహించే రెవెన్యూ అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్న కొందరు రెవెన్యూ అధికారుల్లో మాత్రం ఏమాత్రం స్పందన రావడం లేదు. జిల్లావ్యాప్తంగా 57,987 పట్టాదారు పాసు పుస్తకాలు పెండింగ్‌లో ఉండగా.., అత్యధికంగా వికారాబాద్‌ మండలంలో 5903 ఖాతాలు, దోమలో 4,369 ఖాతాలు, తాండూర్‌లో 4,424 ఖాతాలు, పరిగిలో 4585 ఖాతాలు, మర్పల్లిలో 4126 ఖాతాలు, పూడూర్‌లో 4,296 ఖాతాలు, కుల్కచర్లలో 3,149 ఖాతాలు, బొంరాసుపేట్‌లో 3,163 ఖాతాలు, దౌల్తాబాద్‌లో 2,703 ఖాతాలు, యాలాల్‌లో 2,923 ఖాతాలు, కొడంగల్‌లో 2,246 ఖాతాలు, పెద్దేముల్‌లో 2,543 ఖాతాలు, మోమిన్‌పేట్‌లో 3,241 ఖాతాదారులకు పాసు పుస్తకాలు జారీ చేయాల్సి ఉంది.

త్వరలో పార్ట్‌-బీ భూములకు పాసు పుస్తకాలు...
త్వరలో జిల్లాలోని వివాదస్పద(పార్ట్‌-బీ) భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి పాసు పుస్తకాలను జారీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే పార్ట్‌-బీ భూముల్లోని అసైన్డ్‌, వక్ఫ్‌, దేవాదాయ తదితర భూ సమస్యలను పరిష్కరించేందుకు ఊరూరా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో వారం రోజుల క్రితం వివాదస్పద భూముల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించిన జిల్లా రెవెన్యూ యంత్రాంగం మరో వారంలో పూర్తి చేయనున్నారు. జిల్లాలో వివాదాస్పద భూములకు సంబంధించి 23,368 ఖాతాలు ఉండగా ప్రస్తుతం సంబంధిత భూముల సమస్యలను పరిష్కరించే పనిలో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...