జూన్‌ 30 వరకు టార్గెట్‌ పూర్తి చేయాలి


Sat,June 15, 2019 12:14 AM

-ఆ తర్వాత మరుగుదొడ్లు కట్టుకుంటేప్రోత్సాహం ఉండదు
-కలెక్టర్‌ మస్రత్‌ ఖానమ్‌ ఆయేషా
తాండూరు రూరల్‌/దౌల్తాబాద్‌: వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి జూన్‌ 30వ వరకు ప్రభుత్వం గడుపు పెంచిందని, అప్పటి వరకు లబ్ధిదారులు పూర్తి చేస్తేనే వారికి బడ్జెట్‌ మంజూరు చేస్తామని కలెక్టర్‌ మస్రత్‌ ఖానమ్‌ ఆయేషా స్పష్టం చేశారు. శుక్రవారం తాండూరు ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల, ఉపాధి హామీ సిబ్బందితో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నెల రోజులుగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై అధికారబృందం తీవ్రంగా కృషి చేసినప్పటికీ, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం బాధకరమన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌ల పై బాధ్యత ఎక్కువగా ఉందన్నారు. గ్రామంలో ప్రథమ పౌరులుగా ఉన్నారని, లబ్ధిదారులకు వ్యక్తిగత మరుగుదొడ్ల అవశక్యత గురించి వివరించాలన్నారు. బహిరంగ మల, మూత్రవిసర్జన రహిత జిల్లాగా చేసేందుకు సమిష్టిగా కృషి చేయాలన్నారు. టార్గెట్‌ ఎక్కువగా, సమయం తక్కువ ఉందన్నారు. యుద్ధ ప్రాతిపదికన మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసేందకు కృషి చేయాలన్నారు. జూన్‌ 30 వరకు మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు యత్నించాలని, జూన్‌ తర్వాత కట్టుకుంటే నిధులు ఇవ్వరని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని లబ్ధిదారులకు స్పష్టం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం వర్షాలు ప్రారంభమయ్యాయని, గ్రామాల్లో వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు అందరూ మరుగుదొడ్లు నిర్మించుకొని ఆరోగ్య సూత్రాలు పాటించాలన్నారు. బహిరంగ మల, మూత్ర విసర్జన కారణంగాప్రజలు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందన్నారు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేయాలని సూచించారు.

హరితహారంలో మొక్కలు విరివిగా నాటాలి
అదేవిధంగా హరితహారంలో భాగంగా మొక్కల నాటే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాలన్నారు.గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రత పాటించాలన్నారు. కాలుష్యం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గ్రీన్‌ట్రిబ్యునల్‌ కూడా ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. సుప్రీం కోర్టు ఈ విషయంలో సీరియస్‌గా ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత పాటించకపోతే కార్యనిర్వహణాధికారులకు కఠినమైన శిక్షలు కూడా వేసే అవకాశం ఉందన్నారు. మోడల్‌ కండక్ట్‌ కోడ్‌ ముగిసిందని, ఇకపైగ్రామాల్లో స్వేచ్ఛగా అభివృద్ధి పనులు చేసుకునే అవకాశం ఉందని, ఎంపీడీవోలకు కూడా కొన్ని నిధులు మంజూరు చేశామన్నారు. డీఎఫ్‌వో వేణుమాధవ్‌ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలని కోరారు. ఎక్కడా ఖాళీ స్థలం కనిస్తే చాలు అ ప్రాంతంలో విరివిగా మొక్కలు నాటేందుకు యత్నించాలన్నారు. మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. పీడీ జాన్సన్‌ మాట్లాడుతూ 12 నెలల్లో 14 వేల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేస్తే, ఈ రెండు నెలల్లో సుమారు 10 వేల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. ఇంకా మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉందన్నారు. మండలంలో 2,600 మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేశామని, ఇంకా 3 వేలకు పైగా నిర్మించాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో తాండూరు ఆర్డీవో వేణుమాధవరావు, ఎంపీడీవో లక్ష్మప్ప, తహసీల్దార్‌ దశరత్‌, పలువురు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది ఉన్నారు.

లబ్ధిదారులకు అవగాహన కల్పించాలి
స్వచ్ఛభారత్‌ మిషన్‌ పథకంలో భాగంగా దౌల్తాబాద్‌ మండల వ్యాప్తంగా ఉన్న 33 గ్రామ పంచాయతీల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్‌ మస్రత్‌ ఖానామ్‌ ఆయేషా అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. శుక్రవారం దౌల్తాబాద్‌ మండల కేంద్రంలోని నారాయణ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలతో పాటు హరితహారం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఒక్కో గ్రామ పంచాయతీ సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శులు కలిసిఈ నెలా ఈనెలాఖారులోపు గ్రామానికి ప్రస్తుతం మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు ఓ ప్రణాళికతో అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకువెళ్లాలని సూచించారు. డీఆర్‌డీవో పీడీజాన్సన్‌ మాట్లాడుతూ మరుగుదొడ్ల నిర్మాణాలు విజయవంతంగా 100 శాతం పూర్తి కావలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేసి నిర్మాణాలు చేపాడితే లక్ష్యాం చేరవచ్చన్నారు. మండలంలో హరితహారం పథకంలో భాగంగా గ్రామానికి 40 వేలకు మించి మొక్కలు నాటించాలని, ప్రతి ఒక్కరికి అవగహన కల్పిస్తు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో దౌల్తాబాద్‌ మండల ప్రత్యేకాధికారి రామారావు, తహసీల్దార్‌ శైలేందర్‌కుమార్‌, ఎంపీడీవో నర్సింహారెడ్డి, ఈవోపీఆర్డీ షఫి, సర్పంచ్‌లు, అంగన్‌వాడీ టీచర్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఏపీవో దస్తయ్య, తదితరులు పాల్గొన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...