కారు కంచుకోట!


Fri,June 14, 2019 12:02 AM

-వరుస ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం
-జిల్లాలో బలంగా తయారైన టీఆర్‌ఎస్‌పార్టీ
-అభివృద్ధి, సంక్షేమ పథకాలతో గులాబీ పార్టీ వైపు
-సంబ్బండ వర్గాలుజిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే..
-జడ్పీ పీఠంతోపాటు 15 జడ్పీటీసీలు, 14 ఎంపీపీ అధ్యక్ష పీఠాలు కైవసం
-355 సర్పంచ్ పదవులతోపాటు 137 ఎంపీటీసీ స్థానాల్లో కారు పాగా
-జిల్లాలో కాంగ్రెస్ కథ ముగిసినట్లే..
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో అధికార పార్టీదే జోరు కొనసాగుతుంది. జిల్లాలో రాజకీయంగా మిగతా అన్ని పార్టీల కంటే బలంగా తయారైంది. గతంలో టీడీపీకి కంచుకోటగా ఉన్న జిల్లా టీఆర్‌ఎస్ పార్టీకి కంచుకోటగా మారింది. ఎన్నికలు ఏవైనా గులాబీ పార్టీదే జోరు కొనసాగుతుంది. జిల్లాలో చిన్నచిన్న పదవుల నుంచి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యుల వరకు అంతా గులాబీ పార్టీదే హవా కొనసాగుతుంది. జిల్లాలో కారు దూకుడుతో ప్రతిపక్ష పార్టీలకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి జిల్లాలో అధికార పార్టీ దూకుడును ప్రదర్శిస్తోంది. సీఎం కేసీఆర్ పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో ఆయా పార్టీల నేతలతోపాటు సామాన్య ప్రజానీకం కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి జై కొడుతున్నారు. అంతేకాకుండా ఒక్కొక్కరిగా కాంగ్రెస్, టీడీపీ పార్టీలను వీడి గులాబీ కండువాలు కప్పుకున్నారు. చోటామోటా నేతల నుంచి కార్యకర్తల వరకు అంతా గులాబీ పార్టీలోకి చేరారు. అంతేకాకుండా ఇటీవల జరిగిన అసెంబ్లీ, పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, పార్లమెంట్ ఎన్నికల్లో వార్ వన్‌సైడ్ అనే విధంగా టీఆర్‌ఎస్ పార్టీకే జిల్లా ప్రజలు వరుస విజయాలను అందించారు. అదేవిధంగా వరుస విజయాలతో అధికార పార్టీ టీఆర్‌ఎస్ త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయభేరి మోగించేందుకు ఉవ్విళ్లూరుతుంటే మరోవైపు కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీల నేతలకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. జిల్లాలో కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలకు కాలం చెల్లినట్లేనని, ఇక భవిష్యత్ అంతా టీఆర్‌ఎస్‌దేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో టీఆర్‌ఎస్ ప్రభంజనం, బలోపేతంలో సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశంతోపాటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితోపాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టి సారించడమే ప్రధాన అంశంగా చెప్పవచ్చు.

సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు అంతా గులాబీ దండే...
జిల్లాలో మునుపెన్నడూ లేనివిధంగా సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేల వరకు అంతా టీఆర్‌ఎస్ పార్టీ వారినే ప్రజలు గెలిపించుకోవడంతో జిల్లాలో తిరుగులేని పార్టీగా టీఆర్‌ఎస్ పార్టీ అవతరించింది. ఎన్నికలు ఏమైనా గెలుపు టీఆర్‌ఎస్‌దే అనే విధంగా జిల్లాలో గులాబీ పార్టీ పుంజుకుంది. 2014లో టీఆర్‌ఎస్ పార్టీ తొలిసారి అధికారంలోకి వచ్చిన సమయంలోనూ జిల్లాలో అంతంతాగానే ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ ప్రస్తుతం జిల్లాలో ఏ ఎన్నికలు జరిగినా టీఆర్‌ఎస్ ప్రభంజనం కొనసాగుతుంది. జిల్లాలో అధికార పార్టీ బలోపేతంతో సర్పంచుల నుంచి ఎమ్మెల్యేల వరకు టీఆర్‌ఎస్‌వారే కొనసాగుతుండడం గమనార్హం. 9 నెలల్లో వరుసగా జరిగిన అసెంబ్లీ, పంచాయతీ, పార్లమెంట్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కారు దుమ్మురేపింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ దూసుకుపోయింది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలుండగా మూడు నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ విజయదుందిభి మోగించింది. జిల్లాలోని వికారాబాద్, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి తాండూరు ఎమ్మెల్యేగా గెలిచిన పైలట్ రోహిత్ రెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరడంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే పాగా వేశారనే చెప్పవచ్చు. 2014 ఎన్నికల్లో జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరే ఉండగా 2019 ఎన్నికల్లో జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు పంచాయతీ ఎన్నికల్లోనూ వార్ వన్‌సైడ్‌లా టీఆర్‌ఎస్ విజయభేరి మోగించింది. జిల్లాలో 565 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగగా,...355 గ్రామ పంచాయతీల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టించింది. పరిషత్ ఎన్నికల్లోనూ గులాబీ జోరు కొనసాగింది. జిల్లాలో మొత్తం 221 ఎంపీటీసీ స్థానాలుండగా 137 ఎంపీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అదేవిధంగా జడ్పీటీసీ స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ పార్టీ హవా కొనసాగింది. జిల్లాలో 18 జడ్పీటీసీ స్థానాలుండగా 15 జడ్పీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపొందింది. అయితే మిగతా జడ్పీటీసీలు కూడా త్వరలో టీఆర్‌ఎస్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఎంపీపీ అధ్యక్ష పీఠాలకు సంబంధించి కూడా టీఆర్‌ఎస్ పార్టీ మెజార్టీ ఎంపీపీ పీఠాలను కైవసం చేసుకుంది. జిల్లాలో 18 ఎంపీపీ పీఠాలుండగా 14 ఎంపీపీ అధ్యక్ష పీఠాలను టీఆర్‌ఎస్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూడా అధికార పార్టీ టీఆర్‌ఎస్ సొంతం చేసుకుంది. ఈ ఎన్నికలతోపాటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ పార్టీ తిరుగులేని విధంగా గెలుపొంది, రాజకీయ భవిష్యత్ ఇచ్చిన టీఆర్‌ఎస్‌ను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఓడించి ప్రజలు దిమ్మతిరిగే షాకిచ్చారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌కు కొండంత బలం...
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ బలోపేతం కావడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కూడా ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఏ దిక్కులేని వారికి అండగా నిలిచేందుకుగాను ఆసరా పథకాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. వృద్ధ, వితంతువులు, వికలాంగులకు అండగా నిలిచేందుకుగాను ఆసరా పథకాన్ని తీసుకువచ్చి రూ.200ల పింఛన్‌ను రూ.1000లకు, రూ.500ల పింఛన్‌ను రూ.1500లకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెంచింది. తదనంతరం రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆసరా పింఛన్లను రూ.1000ల నుంచి రూ.2016లకు, దివ్యాంగుల పింఛన్లను రూ.1500ల నుంచి రూ.3016లకు పింఛన్ డబ్బులను పెంచుతు నిర్ణయించింది. పెంచిన పింఛన్లను వచ్చే నుంచి అమల్లోకి రానుండగా, జూలై మాసం నుంచి ఆసరా లబ్ధిదారులకు రెట్టింపు అయిన ఆసరా పింఛన్ డబ్బులను అందించనున్నారు. ఆసరా పథకంతోపాటు ఆహారభద్రత పథకాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజలకు కడుపు నిండా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో కుటుంబ సభ్యుల సంఖ్యతో నిమిత్తం లేకుండా కుటుంబంలో ఎంత మంది ఉన్నప్పటికీ అందరికీ ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తుంది. అదేవిధంగా ప్రతి ఇంటింటికి నల్లా ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరధ కార్యక్రమాన్ని చేపట్టి జిల్లా ప్రజలకు రూ.1187 కోట్లతో పనులు పూర్తి చేసి 971 ఆవాసాలకు, నాలుగు మున్సిపాలిటీలకు తాగునీరందిస్తున్నారు.

అదేవిధంగా చెరువులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకుగాను మిషన్ కాకతీయ, పేద కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక చేయూతనందించేందుకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం అమలుచేస్తుంది. అంతేకాకుండా అన్నదాతలను అన్నివిధాల ఆదుకునేందుకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపడుతుంది. జిల్లాలో రైతుబంధు పథకంలో భాగంగా గతేడాది ఖరీఫ్‌లో 1,98,994 మంది రైతులకు రూ.226 కోట్లు, రబీలో 1,75,989 మంది రైతులకు రూ.206 కోట్ల పెట్టుబడి సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ప్రభుత్వం జమ చేసింది. అదేవిధంగా ఏదేని రైతు మరణిస్తే సంబంధిత రైతు కుటుంబాన్ని ఆదుకునేందుకుగాను రూ.5 లక్షల బీమాను ప్రభుత్వం అందజేస్తుంది. జిల్లాలో ఇప్పటివరకు 437 మంది రైతులు మరణించగా సంబంధిత రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.21.85 కోట్లను అందజేసింది. ఇవేకాకుండా దళితులకు భూపంపిణీ, డబుల్ బెడ్‌రూం ఇళ్లు తదితర సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలుచేస్తుంది. సంక్షేమ పథకాలతోపాటు కోట్ల రూపాయాలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుంది. జిల్లాలోని ప్రతీ గ్రామానికి రోడ్లు వేయించడంతోపాటు గ్రామాల నుంచి మండలాలకు, మండలాల నుంచి జిల్లా కేంద్రానికి లింక్ రోడ్లు, ప్రతీ గ్రామపంచాయతీల్లోనూ సీసీ రోడ్లు ఏర్పాటుకు భారీగా నిధులు ప్రభుత్వం వెచ్చించింది. అదేవిధంగా జిల్లాలోని ఆర్‌అండ్‌బీ రోడ్ల నిర్మాణానికి రూ.930 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలోని పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణానికి రూ.250 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

అంతేకాకుండా రోడ్ల మరమ్మతులకు ఈ నాలుగేండ్లలో జిల్లాకు 120 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లాలోని ప్రతీ గ్రామం నుంచి మండల కేంద్రానికి, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి లింక్ రోడ్ల అభివృద్ధికిగాను రూ.802 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలోని కాగ్నా వాగుపై రెండు వంతెనలను నిర్మించేందుకుగాను ప్రభుత్వం రూ.30 కోట్లను విడుదల చేసింది. అదేవిధంగా మిషన్ కాకతీయ పథకంలో భాగంగా జిల్లావ్యాప్తంగా 1142 చెరువులుండగా నాలుగు విడుతల్లో భాగంగా 757 చెరువులకు అనుమతులను మంజూరు చేయడంతోపాటు నిధులను మంజూరు చేసింది. జిల్లావ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణ పనులకుగాను నాలుగు విడుతల్లో రూ.229 కోట్ల నిధులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం విడుదల చేసింది. అదేవిధంగా ఒక్క కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికే రాష్ట్ర ప్రభుత్వం గత ఐదారు మాసాల్లో రూ.150 కోట్లకుపైగా ఆయా అభివృద్ధి పనులకు ఖర్చు చేసింది. కొడంగల్ నియోజకవర్గంలోని రోడ్లు లేని గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఏకంగా బీటీ రోడ్ల అభివృద్ధికిగాను రూ.80 కోట్ల నిధులను, కమ్యూనిటీ భవన నిర్మాణాలకు రూ.18 కోట్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.32 కోట్లు మంజూరు చేశారు. అంతేకాకుండా కోస్గి మండల కేంద్రంలో బస్ డిపో, కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో ఫైర్ స్టేషన్‌ను, కోస్గి మండల కేంద్రంలో పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని, అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గంలోని బొంరాస్‌పేట్, దౌల్తాబాద్ మండల కేంద్రాల్లో జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తున్న ప్రభుత్వం గొల్ల కురుమలకు రాయితీపై గొర్రెల పంపిణీ చేయడంతో గొల్ల, కుర్మల్లో ఆనందోత్సహం మొదలైంది. జిల్లావ్యాప్తంగా 22 వేల యాదవ సంఘం సభ్యులకుగాను ఇప్పటివరకు రూ.117 కోట్లతో 10,444 మంది సభ్యులకు గొర్రెలను పంపిణీ చేశారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...