మరో 4గురుకులాలు


Thu,June 13, 2019 12:18 AM

-ఈ విద్యా సంవత్సరానికి నియోజకవర్గానికి
- ఒక గురుకుల పాఠశాల మంజూరు
-17న ప్రారంభించనున్న ఎమ్మెల్యేలు
జిల్లాలో 12కు పెరుగనున్న బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు
- ఒక్కో విద్యార్థికి ఏడాది రూ.1.20 లక్షలను ఖర్చు చేస్తున్న ప్రభుత్వం
-గురుకులాల్లో చేరికకు విద్యార్థుల ఆసక్తి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ:టీఆర్‌ఎస్ ప్రభు త్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. కేజీ టూ పీజీ వర కు ఉచిత విద్యనందిస్తామని ఇచ్చిన హామీ మేరకు టీఆర్‌ఎస్ సర్కార్ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. ప్రతీ ఏడాది గురుకుల పాఠశాలల సంఖ్యను పెంచుతూ పోతు హామీని నెరవేర్చడంతోపాటు నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ తరహాలో విద్యనందించేందుకుగాను సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారు. గత ప్రభుత్వాలు విస్మరించిన విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులను ఖర్చు చేస్తుంది. అంతేకాకుండా గత ప్రభుత్వాలు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలకు దాసోహంకాగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యనందించడంతోపాటు అదే తరహాలో అన్ని రకాల వసతులను కల్పించేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో గతేడాది నియోజకవర్గానికి ఒకటి చొప్పున బీసీ గురుకుల పాఠశాలలను మంజూరు చేసిన ప్రభుత్వం,...ఈ విద్యా సంవత్సరానికి కూడా నియోజకవర్గానికి ఒకటి చొప్పున బీసీ గురుకుల పాఠశాలలను మంజూరు చేసింది.బీసీ గురుకుల పాఠశాలలతోపాటు జిల్లాలో ఇప్పటికే మూడు మైనార్టీ గురుకుల పాఠశాలలు జిల్లాకు గతేడాది మంజూరుకాగా కొనసాగుతున్నాయి.

గురుకులాల్లో బోధనకు అర్హత, అనుభవజ్ఞులైన వారిని నియమించడంతోపాటు గురుకులాల్లో చదివే ఒక్కొ విద్యార్థికి ప్రతీ ఏటా రూ.1.20 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. జిల్లాకు మరో 4 బీసీ గురుకుల పాఠశాలలు మంజూరయ్యాయి. 2019-20విద్యా సంవత్సరానికిగాను నియోజకవర్గానికి ఒకటి చొప్పున బీసీ గురుకుల పాఠశాలలను ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున ప్రారంభంకానున్నాయి. అయితే సంబంధిత గురుకుల పాఠశాలలను ఈనెల 17న ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రారంభించనున్న ట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన గురుకుల పాఠశాలలతో జిల్లాలో రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్య 12కు పెరుగనుంది. అయితే ఈ ఏడాది మంజూరైన బీసీ గురుకుల పాఠశాలల్లో రెండు బాలుర పాఠశాలలుకాగా, మరో రెండు బాలికల గురుకుల పాఠశాలలను ప్రభుత్వం మంజూరు చేసింది.

అదేవిధంగా జిల్లాకు గతేడాది ఏడు గురుకుల పాఠశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు ఒక్కొక్కటి చొప్పున బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లుకాగా, మిగతా మూడు మైనార్టీ గురుకుల పాఠశాలలు గతేడాది ప్రారంభమయ్యాయి. అయితే అంతకు ముందే జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలో ఒక బీసీ గురుకుల పాఠశాల కొనసాగుతుండగా,..ప్రస్తుతం జిల్లాలో బీసీ గురుకుల పాఠశాలల సంఖ్య 9కి చేరింది. జిల్లాలో గతేడాది ప్రారంభమైన నాలుగు గురుకుల పాఠశాలల్లో పరిగి, బురాన్‌పూర్‌లో బాలికల గురుకుల పాఠశాలలు, వికారాబాద్, యాలాల మండలాలకు సంబంధించి బాలుర గురుకుల పాఠశాలలు కొనసాగుతున్నాయి. పరిగి, బొంరాసుపేట్ మండలాలకు మంజూరైన గురుకుల పాఠశాలలను పరిగిలో నిర్వహిస్తుండగా, యాలాల, వికారాబాద్ మండలాలకు కేటాయించిన గురుకుల పాఠశాలలను తాండూరు పట్టణంలో నిర్వహిస్తున్నారు. అయితే కొడంగల్‌లోని బీసీ గురుకులలో ఇంటర్మీడియట్ వరకు కొనసాగుతుంది. అంతేకాకుండా ఒక్కొ గురుకుల పాఠశాలల్లో మొత్తం 240 మంది విద్యార్థులకు విద్యనందిస్తున్నారు. ఈ ఏడాది మంజూరైన 4 బీసీ గురుకుల పాఠశాలల్లో 240 మంది విద్యార్థులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ వరకు బోధించనున్న గురుకులాల్లో గతేడాది 5,6,7 తరగతులు ప్రారంభంకాగా, ఈ ఏడాది నుంచి 8వ తరగతి వరకు ప్రారంభంకానున్నాయి. ఇలా ప్రతీ ఏడాది ఒక్కొ తరగతి పెంచుతూ పోనున్నారు.

కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ గురుకులాలు...
రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన గురుకుల పాఠశాలల్లో అటు విద్యా బోధనలోనూ, వసతులను కల్పించడంలోనూ కార్పోరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వం గురుకుల పాఠశాలలను నిర్వహిస్తుంది. జిల్లాలో గతేడాది నాలుగు బీసీ గురుకుల పాఠశాలలతోపాటు మూడు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించి అన్ని రకాల వసతులను కల్పించారు. గురుకుల పాఠశాలలవైపు ఆసక్తి చూపడంతో విద్యార్థుల సంఖ్య పెరుగడంతోపాటు ఇతర వర్గాల నిరుపేద విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్యనందించేందుకు ఈ ఏడాది మరో నాలుగు బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అంతేకాకుండా గురుకుల పాఠశాలల్లో సకల వసతులతో కూడిన ఆంగ్ల బోధనను విద్యార్థులకు అందిస్తున్నారు. గురుకులాల్లోని విద్యార్థులకు సన్నబియ్యంతోకూడిన భోజనంతోపాటు రోజుకో రకమైన టిఫిన్, స్నాక్స్, గుడ్డు, అరటిపండు వారానికి ఒకసారి బిర్యానీ విద్యార్థులకు అందిస్తున్నారు. అంతేకాకుండా అన్ని అర్హతతోపాటు అనుభవజ్ఞులైన వారిచే విద్యాబోధన అందిస్తున్నారు. ఇప్పటికే గురుకులాల్లో టీచర్ల పోస్టుల భర్తీ తొలి విడుత పూర్తి చేసిన ప్రభుత్వం రెండో నోటిఫికేషన్ జారీ చేయడంతోపాటు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ కూడా ఇప్పటికే పూర్తయ్యింది. వీరితోపాటు విద్యార్హత, అనుభవజ్ఞులైన కాంట్రాక్టు ఉపాధ్యాయులతో కూడా విద్యాబోధన కొనసాగుతుంది.

కూతురును గురుకులంలో చేర్పించిన కలెక్టర్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కలెక్టర్ తన కూతురును మైనార్టీ గురుకుల పాఠశాలలో చేర్పించింది. కలెక్టర్ మస్రత్ ఖనమ్ ఆయేషా తన కూతురు తబిష్ రైనాను వికారాబాద్ పట్టణం సమీపంలోని శివారెడ్డిపేట్‌లోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఐదో తరగతిలో చేర్పించారు. కలెక్టర్ తీసుకున్న తన నిర్ణయంతో ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యా యులు స్టేటస్ అంటూ కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో లక్షల్లో ఖర్చు చేసి చదివిస్తున్న ప్రస్తుత రోజుల్లో కలెక్టర్ ఆయేషా తీసుకున్న నిర్ణయం మరికొంత మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు మార్పు కలిగించేలా ఉంది. మరోవైపు కార్పొరేట్ తరహాలో నిర్వహిస్తున్న ప్రభుత్వ గురుకుల పాఠశాలలో తన కూతురును చేర్పించి అందరిలో స్ఫూర్తిని నింపేలా చేశారని కలెక్టర్‌పై ప్రశంసల జల్లు కురు స్తుంది. ఇదే విషయంపై కలెక్టర్ మాట్లాడుతూ...ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నారు కాబట్టి మా కూతురును ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చేర్పించామన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...