నేటినుంచి పాఠశాలల పునఃప్రారంభం


Tue,June 11, 2019 11:54 PM

-14 నుంచి 19వ తేదీ వరకు బడిబాట
-1200 మంది బడిబయట పిల్లలను
- పాఠశాలలో చేర్పించడమే లక్ష్యం
-జిల్లాకు చేరుకున్న ఉచిత పాఠ్య పుస్తకాలు
-పుస్తకాలు పక్కదారి పట్టకుండా పటిష్ట చర్యలు
- త్వరలో విద్యార్థులకు ఉచిత దుస్తుల పంపిణీకి సర్కారు చర్యలు
పరిగి, నమస్తే తెలంగాణ: నూతన విద్యా సంవత్సరం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. నూతన విద్యా సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేపట్టారు. 2019-20 నూతన విద్యా సంవత్సరంలో విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోనుంది. జూన్ ఒకటో తేదీ నుంచే పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా ఎండల తీవ్రతతో వేసవి సెలవులు మరో పది 11 రోజులు పొడిగించారు. దీంతో 12వ తేదీ బుధవారం నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. పాఠశాలల పునఃప్రారంభం తర్వాత బడీడు పిల్లలందరినీ బడు ల్లో చేర్పించే విధంగా బడిబాట కార్యక్రమం రూపొందించారు. జిల్లాలో మొత్తం 1031 ప్రభుత్వ పాఠశాలలుండగా వాటిలో 4,369 ఉపాధ్యాయ పోస్టులున్నాయి. పాఠశాలల్లో 2,341 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా జిల్లా వ్యాప్తంగా 1,328 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని పాఠశాలల్లో సుమారు 97వేల పైచిలుకు విద్యార్థులు విద్యాభ్యాసం చేయనున్నారు. వారందరికీ సరిపడా ఉచిత పాఠ్య పుస్తకాలను ఇప్పటికే సర్కారు పంపిణీ చేసింది. మరోవైపు సాధ్యమైనంత త్వరగా ఉచిత దుస్తుల పంపిణీకి సైతం సర్కారు చర్యలు చేపట్టింది.

విద్యార్థులు కేవలం చదువుపైనే దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో పాఠశాలల పునః ప్రారంభం నాటికి ఉచిత పాఠ్య పుస్తకాలు ఆయా పాఠశాలలకు చేరవేసేలా చర్యలు తీసుకుంది. టీఆర్‌ఎస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ విధానం అమలులోకి వచ్చింది. గతంలో విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు ఎప్పుడు అందుతాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొనేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం సర్కారు బడుల బలోపేతంపై దృష్టి కేంద్రీకరించింది. విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం వండి పెడుతున్నారు. దీంతోపాటు సకాలంలో పాఠ్య పుస్తకాలు పాఠశాలలకు చేరవేయడం కోసం అవసరమైన చర్యలు చేపట్టింది. జిల్లా పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు 1031 ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల కు అందజేసేందుకు 6,32,100 పాఠ్య పుస్తకాలు అవసరమని అధికారులు గుర్తించారు. ఇందులో గత సంవత్సరం మిగిలిన పాఠ్య పుస్తకాలు గోదాములో 53,000 పుస్తకాలు ఉన్నాయి. పాతవి పోను 5, 79,100 పాఠ్య పుస్తకాలు అవసరమవుతాయని అధికారులు ప్రతిపాదనలు పంపించారు. వాటిలో వికారాబాద్‌లోని గోదాముకు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియం పాఠ్య పుస్తకాలు మొత్తం 132 టైటిల్స్‌కు సంబంధించినవి చేరుకున్నాయి.

ఇప్పటికే అవసరమైన మేరకు ఉచిత పాఠ్య పుస్తకాలు వికారాబాద్‌లోని గోదాముకు చేరుకోవడంతో అన్ని మండలాలకు పంపిణీ సైతం కొనసాగుతుంది. జిల్లాలోని 18 మండలాలకు సంబంధించి మొత్తం 6,32,100 ఉచిత పాఠ్య పుస్తకాలు అవసరమవగా మంగళవారం నాటికి జిల్లా పరిధిలోని 10 మండలాలకు వంద శాతం ఉచిత పాఠ్య పుస్తకాలు చేరుకున్నాయి. బుధవారం నాటికి మిగతా 8 మండలాలకు 100 శాతం ఉచిత పాఠ్య పుస్తకాలు చేరవేయబడతాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆయా మండలాలకు చేరవేయబడిన ఉచిత పాఠ్య పుస్తకాలను సంబంధిత పాఠశాలలకు తరలించారు. మిగతా పాఠ్య పుస్తకాలను గురువారంలోపు అన్ని పాఠశాలలకు చేరవేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా రెండుమూడు రోజుల్లో ప్రతి విద్యార్థికి ఉచిత పాఠ్య పుస్తకాలు అందజేయబడతాయి. ప్రైవేటు విద్యార్థులు మార్కెట్‌లో లభించే ప్రభుత్వం ముద్రించిన పాఠ్య పుస్తకాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

పాఠ్యపుస్తకాల పంపిణీ సైతం మరింత పకడ్బందీగా చేపట్టడం జరుగుతుంది. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపి ణీ చేసే సమయంలో విద్యార్థుల ఆధార్ సంఖ్య, వారికి పంపిణీ చేస్తున్న పుస్తకాలపై గల క్రమసంఖ్యను నమోదు చేసుకొని పంపిణీ చేస్తారు. పుస్తకాల పంపిణీ వివరాలు సైతం ఎప్పటికపుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. తద్వారా ఏ పాఠశాలలో, ఏ విద్యార్థికి పాఠ్య పుస్తకంపై ఉన్న క్రమసంఖ్య గల పుస్తకం అందజేశారనేది ఉన్నతాధికారులు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు ఉచిత పాఠ్య పుస్తకాలు పక్కదారి పట్టకుండా మరింత పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఉచిత పాఠ్య పుస్తకాలు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు చేరుతున్నాయనే సమాచారంతో సర్కారు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి చైల్డ్ ఇన్‌ఫోలో నమోదైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా పుస్తకాలు పంపిణీతోపాటు ఉచిత పాఠ్య పుస్తకాలపై ఆంగ్లంలో ఫ్రీ అని ముద్రించారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల కోసం ముద్రించిన పాఠ్య పుస్తకాలపై సేల్ అనే పదం ముద్రించి మార్కెట్‌లో అందుబాటులో ఉంచారు. తద్వారా ఉచిత పాఠ్య పుస్తకాలు పక్కదారి పట్టకుండా సర్కారు బడులలో చదువుతున్న విద్యార్థులకే అందనున్నాయి.

ఈనెల 14 నుంచి బడిబాట
జిల్లాలో ఈనెల 14 నుంచి బడిబాట కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇందుకుగాను అధికారులు ముందస్తుగా ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈనెల 14 నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించనుండగా, కార్యక్రమ నిర్వహణకు సంబంధించి ముందస్తుగా బుధవారం కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. డీఆర్‌డీవో, కార్మిక శాఖ సహాయ సంచాలకులు, ఎన్‌సీఎల్‌పీ అధికారులతో ఈ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. బడిబాటకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, అందుకు అనుగుణంగా కార్యక్రమం చేపడతారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించబడిన వెయ్యి నుంచి 1200 మంది 5 నుంచి 14 సంవత్సరాల్లోపు బడీడు పిల్లలు బయట ఉన్నారని తేలింది. వారందరినీ బడుల్లో చేర్పించేందుకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇకపోతే జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతుండగా పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్న 11 పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి పాఠశాలలు కొనసాగుతాయి.

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు కొనసాగుతున్నాయి. దీంతో ఆయా పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి పాఠశాలలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా త్వరలోనే విద్యార్థులకు ఉచితంగా దుస్తులు పంపిణీకి సంబంధించి సైతం ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. జిల్లాలో గత విద్యా సంవత్సరంలో పదో తరగతిలో ప్రభుత్వ పాఠశాలలు చక్కటి ఉత్తీర్ణత శాతం సాధించడంతోపాటు పలువురు విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. నూతన విద్యా సంవత్సరంలో మరింత అత్యధిక పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలనే సత్సంకల్పంతో బుధవారం పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...