ఓడీఎఫ్ జిల్లాగా ప్రకటించుకుందాం..


Tue,June 11, 2019 11:52 PM

-సర్పంచ్‌లు పూర్తి బాధ్యత వహించాలి..
-వచ్చే వర్షాకాలంలో మొక్కలు నాటుకుందాం..
-ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, కలెక్టర్ మస్రత్‌ఖానమ్ ఆయేషా
కొడంగల్, నమస్తే తెలంగాణ : ఇంటింటి మరుగుదొడ్డి నిర్మాణాలపై ప్రతి ఒక్కరూ స్పందించాలని, ఈ నెల ఆఖరులోగా జిల్లాను ఓడిఎఫ్‌గా ప్రకటించుకుందామని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జాన్సన్, ఆర్‌డీవో మోతీలాల్‌లు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని కేఎస్‌వీ ఫంక్షన్ హాల్‌లో మరుగుదొడ్ల నిర్మాణాలపై అవగాహన సదస్సు, హరితహారం, రైతు పట్టాదార్ పాస్‌బుక్‌ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న వారు మాట్లాడుతూ.. ఇంటింటి మరుగుదొడ్డి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చాలా అవసరమని తెలిపారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తప్పకుండా ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి నిర్మాణాలు చేపట్టుకోవాలని కోరారు. ఇంటింటి మరుగుదొడ్డితో గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం మొత్తం స్వచ్ఛత చేకూరుతుందని తెలిపారు.

మరుగుదొడ్ల నిర్మాణాలపై కొత్తగా ఎన్నుకోబడిన సర్పంచ్‌లు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని, గ్రామంలోని ప్రతి శాఖ సిబ్బందిని బాగస్వామ్యం చేసి లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తే తప్పకుండా 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కాబడుతుందన్నారు. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో 27 జిల్లాలు ఓడీఎఫ్‌ను ప్రకటించుకున్నాయని, మిగతా వాటిలో వికారాబాద్ జిల్లా చివరి నుంచి రెండో స్థానంలో ఉందన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలకు గాను కావాల్సిన నిధులు గ్రామ కమిటీ ఖాతాలో జమ కాబడి ఉన్నాయని, కాబట్టి లబ్ధిదారులు సంకోచించకుండా నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి ఆర్థిక లబ్ధిని పొందాలని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతగా పేర్కొన్నారు. మండల పరిధిలో 6వేల మరుగుదొడ్లు నిర్మించుకోవాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 883 మాత్రమే నిర్మాణాలు కాబడినట్లు తెలిపారు. మరుగుదొడ్లకు సంబంధించి రూ.3కోట్ల 37లక్షలు ప్రస్తుతం గ్రామ కమిటీ ఖాతాలో నిల్వ ఉన్నాయని, నిర్మాణాలు చేపట్టుకున్న వెంటనే ప్రభుత్వం ద్వారా పొందే రూ.12వేల నగదును అందుకోవచ్చని తెలిపారు.

వర్షాకాలంలో మొక్కలు నాటుకుందాం..
వాతావరణ పరిరక్షణలో భాగంగా గత ఐదు సంవత్సరాల కాలంగా హరితహారం పథకం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుందని, ఈ వర్షాకాలంలో ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో మొక్కలు నాటుకొని వాతావరణ కాలుష్య సమస్యను నివారించుకుందామని తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామానికి ఓ నర్సరీని ఏర్పాటు చేసి మొక్కల పెంపకాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మరో వారం పది రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని కాబట్టి మొక్కలు నాటేందుకు వీలుగా గ్రామ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. మొక్కల నాటే కార్యక్రమంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులదే కీలక బాధ్యత ఉంటుందని, గ్రామంలోని నర్సరీ ఏర్పాటు, మొక్కల పెంపకం, మొక్కలు నాటే కార్యక్రమాలతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతలు చేపట్టాలని తెలిపారు. వర్షాలు ప్రారంభం కాగానే హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా పూర్తి ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ప్రతి రైతుకు పాస్‌బుక్..
ప్రతి రైతు భూమికి సంబంధించి పాస్‌బుక్ అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. మండల పరిధిలో మొత్తం 16వేల పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీకి గాను ఇప్పటి వరకు 14వేల మంది రైతులకు పట్టాదార్ పాస్‌బుక్‌లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. పట్టాదార్ పాస్‌బుక్‌ల పంపిణీలో జిల్లా నెం 1. స్థానంలో ఉన్నట్లు తెలిపారు. కానీ మరుగుదొడ్ల విషయానికి వచ్చే సరికి చివరి స్థానంలో ఉండిపోయిందన్నారు. ఆయా గ్రామాల్లో నేటి వరకు కూడా కొన్ని గ్రామాల్లో రైతులకు పాస్‌బుక్‌లు మంజూరు కాలేదని, విరాసత్, ఆధార్‌లింకేజీ, కమ్యూనికేషన్, సర్వే వంటి ఇబ్బందులు ఉన్నట్లు తెలిపారు. ఆధార్‌లింకేజీలో వేలి ముద్రలు మ్యాచ్ కాబడం లేదని, జిల్లా కేంద్రంలో ఐరిస్ ద్వారా ఆధార్‌లింకేజీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, వైస్ ఎంపీపీ నర్సింహులు, జడ్పీటీసీ ఎల్లమ్మ, ఎంపీడీవో సుజాత, తహసీల్దార్ శివకుమార్‌లతో పాటు మండల పరిధిలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...