షురూ కానున్న రోడ్ల విస్తరణ పనులు


Tue,May 21, 2019 12:20 AM

తాండూరు, నమస్తే తెలంగాణ: తాండూరు మున్సిపల్‌ పరిధిలో (పట్టణంలో) రూ. 32.6 కోట్ల నిధులతో గతంలో ప్రారంభించిన పట్టణంలోని రోడ్ల విస్తరణ పనులు తిరిగి వారం పది రోజుల్లో తిరిగి ప్రారంభం కానున్నాయి. గత మూడు నెలల నుంచి ఎన్నికల కోడ్‌ కారణంగా పట్టణంలో రోడ్ల విస్తరణ పనులు నిలిచాయి. ఒక వైపు సీసీ రహదారుల నిర్మాణం పూర్తవగా మరి కొన్ని అర్ధంతరంగా ఉండిపోయాయి. పట్టణంలోని మున్సిపల్‌ ప్రధాన రోడ్లకు రూ. 25.61 కోట్ల నిధులు రోడ్ల విస్తరణకు తెలంగాణ అర్బన్‌ అండ్‌ ఫైనాన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా ( పట్టణ ప్రాంతాల మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ) మంజూరు చేయగా వీటిలో ఇప్పటి వరకు రూ. 3 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. ఇంకా రూ. 22 కోట్ల విలువైన పనులు పూర్తి చేయాల్సి ఉంది. అలాగే ప్లాన్‌ గ్రాంటు కింద సీఎం ప్రత్యేక కోటా ద్వారా మంజూరైన రూ. 7.5 కోట్ల నిధులతో కూడా తాండూరు పట్టణంలోని విలియమూన్‌ హైస్కూల్‌ చౌరస్తా నుంచి పోలీస్‌ స్టేషన్‌ వరకు కిలో మీటరు దూరం సీసీ రోడ్డును వేస్తున్నారు. ఈ రోడ్డు కూడా ఒక వైపు అసంపూర్తిగా ఉంది. ఇప్పటికే పోలీస్‌ స్టేషన్‌ నుంచి విలిమూన్‌ హైస్కూల్‌ వరకు రూ. 7.5 కోట్ల వ్యయంతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించగా ఒక వైపు రోడ్డు పనులు పూర్తయిన్నాయి. మరో వైపు రోడ్డు పనులు త్వరలో చేపట్టనున్నారు. ఈ ప్రధాన రోడ్డును 40 అడుగుల రోడ్డుగా విస్తరించనున్నారు. పట్టణ పరిధిలో మొత్తం రూ. 32.6 కోట్ల వ్యయంతో పట్టణంలో నాలుగు రోడ్ల పనులకు గతంలో శంకుస్థాపన జరిగింది.

మున్సిపల్‌ పరిధిలోని రోడ్ల విస్తరణ పనులను ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగించారు. దీంతో పట్టణంలో దాదాపు 6.25 కిలో మీటర్ల పొడవు మేర ప్రధాన రహదారులు, ఇంటర్నల్‌ రహదారుల విస్తరణ జరుగుతోంది. ఎన్నికల కోడ్‌ ముగియనుండడంతో వారం, పది రోజుల్లో రోడ్ల పనులు తిరిగి ప్రారంభించేందుకు రోడ్లు భవనాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలో 16 అంగుళాల మందంతో కనీసం 66 అడుగుల వెడల్పుతో సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్న విషయం తెలిసిందే. కనీసం 20 ఏండ్ల పాటు రోడ్ల సమస్యలు తలెత్తకుండా ఈ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. త్వరలో అసంపూర్తి రోడ్లను పూర్తి స్థాయిలో నిర్మాణం చేయనుండడంతో ఈ రోడ్లన్ని సీసీ పనులతో అందంగా మారుతున్నాయి. దీంతో పట్టణంలో ప్రధానంగా రైల్వే స్టేషన్‌ రోడ్డు మార్గంలో ట్రాఫిక్‌ కష్టాలు పూర్తిగా తీరనున్నాయి. తాండూరు పట్టణంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని ముందుగా రోడ్ల విస్తరణకు మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో భాగంగా తాండూరు పట్టణంలోని మున్సిపల్‌ రోడ్లను, ఆర్‌అండ్‌బీ రోడ్లను విస్తరించేందుకు ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు.

రోడ్ల నిర్మాణం తీరిలా ....
పట్టణంలో మున్సిపల్‌ రోడ్ల అభివృద్ధికి రూ. 25.6 కోట్ల నిధులతో పలు రోడ్లను సీసీ రహదారులుగా 20 మీటర్ల వెడల్పుతో వేస్తున్నారు. మరి కొన్ని రోడ్లను 14 మీటర్ల వెడల్పుతో వేస్తున్నారు. 20 మీటర్ల వెడల్పుతో వేసే రోడ్డు ఒక వైపు 10 మీటర్లు ఉంటుంది. ఎత్తు 16 అంగుళాలు మందంతో ఉంటుంది. 14 మీటర్ల వెడల్పుతో వేసే రోడ్డు ఒక వైపు 7 మీటర్లు ఉండనుంది. సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్‌ల కోసం మీటరున్నర దిమ్మెలు నిర్మిస్తారు. ఐదు బిట్లుగా రోడ్లను నిర్మించేందుకు ప్రతిపాదించారు. తాండూరు పట్టణంలోని ఇందిరాచౌక్‌ నుంచి రైల్వే స్టేషన్‌ వరకు రూ. 6.8 కోట్ల వ్యయంతో .450 మీటర్ల రోడ్డును ( 20 మీటర్ల రోడ్డు),రూ. 4.5 కోట్ల వ్యయంతో జిల్లా దవాఖాన క్వార్టర్ల నుంచి మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి ఇంటి వరకు, అలాగే బస్టాండు నుంచి శాంత్‌మహల్‌ చౌరస్తా వరకు 750 మీటర్ల రోడ్డును 14 మీటర్ల రోడ్డు ( ఇరు వైపులా 7+7 మీటర్ల రోడ్డు) నిర్మిస్తారు. అలాగే శివాజీ చౌక్‌నుంచి పాండురంగ దేవాలయం వరకు రూ. 7.5 కోట్లతో 1. 2 కిలో మీటర్ల దూరం ( ఇరు వైపులా 7+7 మీటర్ల రోడ్డు), డీఎస్పీ కార్యాలయం నుంచి పాత తాండూరు రైల్వే గేట్‌ వరకు రూ. 2.2 కోట్లతో 350 మీటర్ల రోడ్డును 14 మీటర్ల రోడ్డు ( ఇరు వైపులా 7+7 మీటర్ల రోడ్డు) నిర్మాణం ప్రతిపాదించారు.

అయితే ఇప్పటి వరకు 20 శాతం రోడ్ల పనులే జరుగడంతో ఇక వారం, పది రోజుల్లో మిగిలిపోయిన రోడ్ల పనులు ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు. అయితే కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ద్వారా రూ. 3 కోట్ల బిల్లులు రావల్సి ఉందని అధికారులు తెలిపారు. అలాగే రూ. 4 కోట్లతో ఖాంజాపూర్‌ గేట్‌ నుంచి తాండూరు పట్టణంలోని పోలీస్‌ స్టేషన్‌ వరకు 3.5 కిలో మీటర్ల సెంట్రల్‌ డివైడర్‌ పనులు చేపట్టారు. ఇప్పటికే సగం పనులు పూర్తవగా మిగిలిపోయిన పనులను కూడా వారం రోజుల్లో ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పూర్తయని డివైడర్‌లలో పచ్చదనాన్నిచ్చే, అందాలు చిందించే మొక్కలను కూడా పెంచుతున్నారు. ఈ హైదరాబాద్‌- తాండూరు ఆర్‌అండ్‌బీ రోడ్డు మార్గంలోని ఖాంజాపూర్‌ నుంచి తాండూరు పట్టణంలోని పోలీస్‌ స్టేషన్‌ వరకు రోడ్‌ డివైడర్‌లతో పాటు సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టంను ఏర్పాటు చేసే పనులు కూడా రోడ్ల నిర్మాణం పూర్తయిన తరువాత ప్రారంభిస్తారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...