టార్గెట్.. జూన్ 2


Mon,May 20, 2019 03:49 AM

-జిల్లాను ఓడీఎఫ్‌గా ప్రకటించేందుకు శరవేగంగా మరుగుదొడ్ల నిర్మాణం
-రెండుమూడు గ్రామాలకు ఒక నోడల్ అధికారికి బాధ్యతలు
-జిల్లాలో నిర్మించాల్సిన మరుగుదొడ్లు 60,293
-వెయ్యి మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి
-106 సంపూర్ణ స్వచ్ఛత గ్రామాలుగా ప్రకటన
పరిగి, నమస్తే తెలంగాణ : వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసి బహిరంగ మలమూత్ర విసర్జన లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. శరవేగంగా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయించేందుకు జిల్లా స్థాయి అధికార యంత్రాంగం నడుం బిగించింది. ప్రధానంగా ఈ నెలాఖరు వరకు పూర్తిస్థాయిలో మరుగుదొడ్ల నిర్మాణ పనులు చేపట్టి జూన్ 2వ తేదీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి ఓడీఎఫ్‌గా ప్రకటించేందుకు అధికారులు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నారు. ఇందుకుగాను గ్రామస్థాయి నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపడుతూ ప్రతి గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం మరింత వేగంగా కొనసాగేందుకు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తూ, ఏవైనా ఇబ్బందులుంటే వాటిని పరిష్కరిస్తూ అధికార యంత్రాంగానికి మార్గదర్శనం చేస్తూ ముంపదకు సాగుతున్నారు. విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీ ఆధ్వర్యంలో మరుగుదొడ్లు నిర్మించి ఇచ్చేలా అధికారులు చర్యలు చేపట్టారు. కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లాను ఓడీఎఫ్‌గా ప్రకటించే దిశగా అడుగులు వేయడంలో జిల్లా యంత్రాంగానికి మార్గనిర్ధేశం చేస్తున్నారు. మండల స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రతి గ్రామంలో ఎన్ని మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉన్నది, ఎంతలోపు నిర్మాణం పూర్తి చేస్తారంటూ కలెక్టర్ సమీక్షలు జరుపుతున్నారు.

అలాగే ప్రతిరోజు జరుగుతున్న పనులకు సంబంధించి సైతం ఎప్పటికప్పుడు నివేదికలు పంపించే బాధ్యతలను గ్రామస్థాయిలో గ్రామపంచాయతీ కార్యదర్శులకు, ఇతర అధికారులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో మొత్తం 60,293 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉన్నది. స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి సర్కారు నిధులు అందజేస్తుంది. జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛభారత్ మిషన్ కింద 91,971 మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా ఇప్పటివరకు 30,118 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఒక్కో వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి 12వేల రూపాయలు అందించడం జరుగుతుంది. ఈ డబ్బులను రెండు విడుతలలో విడుదల చేస్తారు. గుంతలు తవ్వి, రింగులు ఏర్పాటు చేసుకొన్న తర్వాత ఒక విడుత, పూర్తయిన తర్వాత రెండవ విడుత లో నిధులు విడుదల చేయడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు స్వచ్ఛ భారత్ మిషన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి మొత్తం రూ.58కోట్లు మంజూరవగా వాటిలో రూ.38కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ప్రస్తుతం కొనసాగుతున్న పనులకు సంబంధించి సైతం ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లించేందుకు అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 106 గ్రామాలను సంపూర్ణ స్వచ్ఛత గ్రామాలుగా ప్రకటించారు. సంబంధిత గ్రామాలలో వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది.

కలెక్టర్ ప్రత్యేక చొరవ...
జిల్లాను సంపూర్ణ స్వచ్ఛత జిల్లాగా ప్రకటించేందుకు వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయించేందుకు జిల్లా కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి నోడల్ అధికారులు, గ్రామ స్థాయి అధికారులందరినీ ఓడీఎఫ్ ప్రకటనలో భాగస్వాములను చేస్తున్నారు. తమకు కేటాయించిన గ్రామాలలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయించాలని, ఇందుకుగాను అన్ని శాఖల అధికారులు తమ స్వంత శాఖకు సంబంధించిన పనులు చేస్తూనే వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులను చేయించేందుకు కృషి సల్పాలని సూచిస్తున్నారు. నిర్దేశించిన సమయం లోపు వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగాలని యంత్రాంగానికి మార్గనిర్దేశం చేస్తున్నారు. అవసరమైనచోట ప్రత్యేకంగా రుణాలు ఇప్పించి మరీ మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయించాలని ఆదేశించారు. నిధులకు ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక నిధుల నుంచి జిల్లా కలెక్టర్ రూ.6.5కోట్లు రీయంబర్స్‌మెంట్ పద్ధతిలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి కేటాయింపులు జరిపారు. ప్రతి మండలానికి సుమారు రూ.40లక్షల వరకు ఈ నిధులు అందజేయడం జరిగింది. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగేందుకు ఈ నిధులు ఉపకరిస్తాయని చెప్పవచ్చు. మరుగుదొడ్ల నిర్మాణం వేగంగా జరుగాలంటే నిధులు అవసరమని గుర్తించిన అధికార యంత్రాంగం వెంటవెంటనే లబ్ధిదారులకు డబ్బులు అందజేసేందుకు ఈ నిధులు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం ద్వారా నిధులు వచ్చిన తర్వాత తిరిగి కలెక్టర్ ప్రత్యేక నిధులకు అందజేయాల్సి ఉంటుంది.

2,3 గ్రామపంచాయతీలకు ఒక ప్రత్యేకాధికారి
వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం నిర్దేశించిన సమయం లోపు పూర్తి చేసేందుకు రెండుమూడు గ్రామపంచాయతీలకు ఒక నోడల్ అధికారిని నియమించారు. ఈ మేరకు ఆయా మండలాల్లో మండల స్థాయి అధికారులందరికీ నోడల్ అధికారులుగా నియమాకం చేపట్టడం జరిగింది. ప్రతి మండలంలో కనీసం పది మంది వరకు మండల స్థాయి అధికారులుంటారు. సంబంధిత అధికారులకు రెండు నుంచి మూడు గ్రామపంచాయతీల బాధ్యతలు అప్పగించారు. సంబంధిత గ్రామాలలో పనిచేసే గ్రామపంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌వోలు, ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్‌లు, ఆశావర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఇతర శాఖల ఉద్యోగులందరిని ఈ కమిటీలలో సభ్యులుగా పరిగణించడం జరుగుతుంది. సంబంధిత గ్రామంలో నిర్మాణం చేపట్టాల్సిన మరుగుదొడ్లకు సంబంధించి ఆయా శాఖల అధికారుల పరంగా కేటాయించి వారు ప్రత్యేకంగా ఇంటింటికీ తిరిగి ఆయా కుటుంబాల వారితో మాట్లాడి మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టేలా అవగాహన కల్పిస్తున్నారు.

ప్రత్యేకంగా మరుగుదొడ్ల నిర్మాణం ఆవశ్యకతపై మహిళలను చైతన్యవంతం చేస్తూ సంబంధిత కుటుంబాల వారు మరుగుదొడ్ల నిర్మాణానికి ముందుకు వచ్చేలా చూస్తున్నారు. కొన్నిచోట్ల భూమి గట్టిగా ఉన్న ప్రాంతాలలో జేసీబీల సహాయంతో గుంతలు తవ్విస్తున్నారు. అవసరమైన వారికి ఇటుకలు, రింగులు, సిమెంటు, ఇతర పరికరాలు సైతం ఇప్పించడం ద్వారా మరుగుదొడ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ఆయా కుటుంబాల వారు స్వయం సహాయక సంఘాల సభ్యులైతే వారికి రుణాలు ఇప్పించి మరీ మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టేలా అధికార యంత్రాంగం పనిచేయడం జరుగుతుంది. ఇందుకుగాను ఎప్పటికప్పుడు నోడల్ అధికారులు తమ సూచనలు అందజేస్తున్నారు. నోడల్ అధికారులు తమకు కేటాయించిన గ్రామాలలో ప్రతిరోజు పర్యటనలు చేస్తూ ఆయా గ్రామాలలో వేగంగా మరుగుదొడ్ల నిర్మాణం కొనసాగేలా అవసరమైన చర్యలు చేపడుతున్నారు.

అనునిత్యం పర్యవేక్షణ...
జిల్లాలో వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి అనునిత్యం అధికారులు పర్యవేక్షణ చేపడుతున్నారు. గ్రామస్థాయిలో ప్రతిరోజు ఎన్ని మరుగుదొడ్ల నిర్మాణాలకు ముగ్గులు వేశారు, ఎన్ని గుంతలు తీశారు, ఇతర ఎంతమేరకు పనులు కొనసాగుతున్నాయనేది ఎప్పటికప్పుడు రోజువారీగా నివేదికలను గ్రామ స్థాయి నుంచి సేకరించడం జరుగుతుంది. దీంతోపాటు జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ ప్రగతిపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని వాట్సప్ గ్రూపులో అప్‌లోడ్ చేస్తుండడంతో ఎక్కడ ఏ పనులు కొనసాగుతున్నాయన్నది అనునిత్యం ఉన్నతాధికారుల వరకు తెలిసేలా చర్యలు తీసుకున్నారు. ప్రతిరోజు చేపడుతున్న పనులకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తుండడంతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులలో వేగం పెరిగిందని చెప్పవచ్చు. ఏ గ్రామంలోనైనా తక్కువ మొత్తంలో పనులు కొనసాగుతుంటే వెంటనే ఉన్నతాధికారులు సంబంధిత గ్రామాల నోడల్ అధికారులు, ఇతర ఉద్యోగులతో స్వయంగా మాట్లాడుతుండడం వల్ల పనులు మరింత త్వరగా జరిగేలా చూస్తున్నారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైనా వాటి పరిష్కారానికి అధికారులు సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. తద్వారా జూన్ 2వ తేదీ నాటికి జిల్లాను సంపూర్ణ స్వచ్ఛత జిల్లాగా మార్చేందుకు అధికారులు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నారు.

జూన్ 2వ తేదీ వరకు ఓడీఎఫ్ లక్ష్యం
జిల్లాను రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీ వరకు సంపూర్ణ స్వచ్ఛత జిల్లాగా ప్రకటించాలని లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. ఇందుకుగాను గ్రామాలలో వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులు మరింత వేగంగా కొనసాగేందుకు నోడల్ అధికారులు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. మండల స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంతోపాటు రోజు వారీగా కొనసాగుతున్న పనుల నివేదికలను తెప్పించుకోవడం ద్వారా మరింత వేగంగా మరుగుదొడ్ల నిర్మాణ పనులు జరిగేలా చర్యలు తీసుకున్నాము. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని శాఖల అధికారులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం జరిగింది.
- జాన్సన్ (జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి)

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...