ఎవుసం పనులు షురూ..


Mon,May 20, 2019 03:46 AM

-వేసవి దుక్కులతోనే పంటలో అధిక లాభాలు
-భూసార పరీక్షలు, పంట మార్పిడితో సాగు పెట్టుబడులు ఆదా
-వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు
తాండూరు, నమస్తేతెలంగాణ : తాండూరు నియోజకవర్గంలో వాన కాలం పంటల సాగుకు రైతులు దుక్కులు దున్నడం ప్రారంభించారు. నియోజకవర్గంలో మే నెలలో తప్పుడు వానలు ( ముందస్తు వానలు) కురవక పోవడంతో ఎక్కువగా రైతులు దుక్కులు దున్నడం ప్రారంభించలేదు. అయితే కొందరు రైతులు తమ పొలాల నేలల తీరును బట్టి దుక్కులకు సిద్ధ్దమవుతున్నారు. వేసవి దుక్కులతో పంట సాగులో అధిక లాభాలు వస్తాయని, అలాగే భూసార పరీక్షలతో పంట మార్పిడి, ద్వారా తక్కువ సాగు నిమిత్తం రైతులు తక్కువ పెట్టుబడులతోనే పంటలు సాగు చేసేందుకు వీలు కలుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సూచిస్తున్నారు. దుక్కులు దున్నడం ద్వారా అధిక పంట దిగుబడులకు ఆస్కారముంటుందని వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వేసవిలో లోతైన దుక్కులు దున్నుకునడంతోపాటు, పంట వేసే ముందుగా రైతులు భూసార పరీక్షలు చేసుకుని పంటలసాగుకు ఉపక్రమిస్తే అధిక పంట దిగుడులు రైతులు సాధించగలుగుతారని తాండూరు వ్యవసాయపరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు వెల్లడించారు.

భూసార పరీక్షలతో తక్కువ పెట్టుబడులకు ఆస్కారం కలుగుతుందని తెలిపారు. రైతులు పంటలకు వృథాగా వ్యయం చేస్తే పెట్టుబడులను అవగాహనతో తగ్గించుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. సరైన అవగాహన లేక పోవడం వల్లే చాలమంది రైతులు పంటల సాగుకు అధిక పెట్టుబడులు పెడుతుంటారని అన్నారు. పంటల సాగులో ఈ రెండు ముఖ్యమైన అంశాలని తెలిపారు. పంటసాగుకు సిద్ధం చేసే భూములన్ని వివిధ రకాల లోపాలను కలిగి ఉంటాయని తెలిపారు. వివిధ రకాల సమస్యలున్న భూముల లక్షణాలను బట్టి రైతులు పరిష్కారాలు చేసుకోవాలని సూచించారు. తాండూరు ప్రాంతంలో చౌడు భూములు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. చౌడు భూముల్లో కూడా తెల్ల చౌడు భూములుంటాయని తెలిపారు. భూసార పరీక్షల ద్వారా రైతులు తమ పొలాల్లోపంటల ఎదుగుదలకు అవసరమైన రసాయనాల లోపాలను క్షుణ్ణంగా తెలుసుకోవచ్చని అన్నారు. తమ పొలాల్లో భూసార పరీక్షలను వ్యవసాయ శాఖ అధికారులు, లేదా నిఫుణులైన శాస్త్రవేత్తల సలహాలు సూచనలతోనే చేపట్టాలని సూచించారు. నీటిపారుదల కింద ఉన్న భూములకు 625 ఎకరాలకు ఒక నమూనాను తీయాలని తెలిపారు. అలాగే మెట్ట భూముల్లో వర్షాధార పంటలకు 25 ఎకరాలకు ఒక నమూనా తీయాలని సూచించారు.

చౌడు అధికంగా ఉంటే..
చౌడు అధికంగా ఉన్నట్లు భూసా పరీక్షల్లో తేలితే ఎకరానికి 8నుంచి 12 బస్తాల జిప్సం వేసుకుని నీరు పెట్టి మళ్లీ వదలి పెట్టాలని సూచించారు.తెల్ల చౌడు నేలల్లో భూసారపరీక్షను బట్టి నాలుగు నుంచి ఎనిమిది బస్తాల జిప్సం వేసుకోవాలని సూచించారు.తేలికపాటి చౌడు భూముల్లో పచ్చి రొట్ట ఎరువులు ఖచ్చితంగా వేయాలని సూచించారు.జీలుగ, జనుము, పిల్లి పెసర వంటి విత్తనాలను ప్రధాన పంట వేసే 45 రోజుల ముందు చల్లుకుని కలియ దున్నాలని సూచించారు.
వేసవిలో లోతుదుక్కులు ప్రధానమైనవి
వేసవిలో లోతుదుక్కులు అత్యంత ప్రధానమైనవని తెలిపారు. కనీసం మూడు లేదా నాలుగుసారు ్లరైతులు వేసవిలో లోతైన దుక్కులు దున్నుకోవాలని తెలిపారు. దీని వల్ల నేల అంతర్భాగంలో నిద్రావస్థలోఉన్న పంటలకు హాని తలపెట్టే పురుగుల లార్వాలు, కోశస్థ దశలు, అలాగే కలుపు మొక్క విత్తనాలుఎండ వేడిమితో నశిస్తాయని తెలిపారు. దీని వల్ల పురుగు ఉధృతి తగ్గుతుందని తెలిపారు. అలాగే మొక్కల అవశేషాలను కూడా కాల్చి వేయాలని సూచించారు.

రైతులు పంట మార్పిడి విధానం పాటించాలి
రైతులు పంట విధానాన్ని ఇటీవలి కాలంలో పూర్తిగా మరిచిపోయారు. ఇవి పంటల సాగులో చాలా అనారోగ్య కరమైన పరిస్థితికి దారి తీస్తాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. దశాబ్ద కాలంగా పంటల మార్పిడి విధానం పాటించక పోవడంతో ఒకే పంట సాగు ద్వారా ఒకే నేలల్లో ఉండే పొరల్లోని భూసారం క్రమ క్రమంగా తగ్గిపోతుందని ఏ ఏటికాయేడు భూసారం క్షీణించి పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. ఈపరిస్థితులు ఎండు తెగులు వ్యాప్తికి దారి తీస్తాయన్నారు. నీటి ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో పంట మొలక దశల్లో శిలీంద్రాలు ప్రవేశించి పంట పూతను అడ్డుకుంటాయని తెలిపారు. ఈ దశలోనే ఎండు తెగులు ప్రభావం కనబడుతుందని వివరించారు. దీన్నే ఫిజోరియం ఎండు తెగులు అని వ్యవహరిస్తారన్నారు. పంట మొలక దశలో ఉన్నప్పుడు మొలకలు గుంపులు గుంపులుగా చనిపోతాయని, దీన్ని ఫైటాప్‌తెర తెగులుగా వ్యవహరిస్తారు. ఈ తెగులు ఉధృతి కూడా పెరుగుతుంది. కాబట్టి రైతులు ఖచ్చితంగా పంట మార్పిడి గురించి ఆలోచించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...