ఉత్కంఠ


Fri,May 17, 2019 11:11 PM

-ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభ్యర్థులు, ప్రజలు
-ఈనెల 23న పార్లమెంట్, 27న పరిషత్ ఎన్నికల ఫలితాలు
-రెండు ఎన్నికల్లోనూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న టీఆర్‌ఎస్ శ్రేణులు
-చేవెళ్లలో 50వేలకు పైగా మెజార్టీతో పాటు జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకుంటామని విశ్వాసం
-ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం

జిల్లాలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్నది. వరుసగా పార్లమెంట్, పరిషత్ ఎన్నికలు పూర్తి కావడం.. ఓట్ల లెక్కింపు తేదీ సమీపిస్తుండటంతో ఇటు అభ్యర్థులు, అటు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 23 పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు, 27న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. టీఆర్‌ఎస్ శ్రేణులు మాత్రం వార్ వన్‌సైడేనని, పార్లమెంట్, పరిషత్ ఎన్నికల్లో విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో 50వేలకు పైగా మెజార్టీ ఖాయమంటున్నారు. జడ్పీ పీఠాన్ని సైతం కైవసం చేసుకుంటామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయంటున్నారు. మరోవైపు ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.

-వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: వరుసగా పార్లమెంట్, పరిషత్ ఎన్నికలు పూర్తి కావడం ఫలితాలు వెల్లడించే సమయం సమీపిస్తుండడంతో అటు అభ్యర్థులు, రాజకీయ నేతల్లోనూ ఇటు ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే పార్లమెంట్ ఎన్నికలు పూర్తై నెల గడుస్తున్నా ,...దేశమంతటా విడుతల వారీగా ఎన్నికలు జరిగినందునా ఎన్నికలు జరిగిన అన్ని రాష్ర్టాల్లోనూ ఫలితాలను ఒకేసారి వెల్లడించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించడంతో పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వెల్లడి ఆలస్యమైంది. అయితే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను వెల్లడించిన తర్వాతనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను వెల్లడించాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఆయా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతోపాటు అందరూ ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈనెల23న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను, ఈనెల 27న పరిషత్ ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. మరో వారంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను, మరో పది రోజుల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానుండడంతో జిల్లాలో రాజకీయం మరింత వేడెక్కింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లోనూ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ అధికార పార్టీ టీఆర్‌ఎస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుంది. ఏదేమైనా ఈ ఉత్కంఠకు తెరదించాలంటే మరో వారం, పది రోజులు ఆగాల్సిందే. మరోవైపు పార్లమెంట్, పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారులు అన్ని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు.

గెలుపుపై టీఆర్‌ఎస్ ధీమా...
అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసిన టీఆర్‌ఎస్ పార్టీ పార్లమెంట్, పరిషత్ ఎన్నికల్లోనూ గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే టీఆర్‌ఎస్ ప్రభు త్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో అటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ, ఇటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ వార్ వన్‌సైడ్ మాదిరిగానే టీఆర్‌ఎస్ పార్టీకి అనుకూలంగానే ఫలితాలు రానున్నాయని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ తరఫున డాక్టర్ రంజిత్ రెడ్డి పోటీ చేయగా,...కాంగ్రెస్ పార్టీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం జిల్లాలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ఆసరా పింఛన్లు, రైతుబీమా, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలతో జిల్లా ప్రజానీకం టీఆర్‌ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. ఎన్నికలు ఏమైనా సరే టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తూ సీఎం కేసీఆర్ నాయకత్వానికి జై కొడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయంలోనూ టీఆర్‌ఎస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి జిల్లాలో ఎక్కడెళ్లిన జనం నీరాజనం పలికారు.

రైతులు, ఆసరా పింఛన్ లబ్ధిదారులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులతోపాటు సంబండ వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్‌వైపే ఉండడంతో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీకి 50 వేలకుపైగా మెజార్టీ వచ్చే అవకాశముందని ఆ పార్టీ వర్గాల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూర్ నియోజకవర్గాలు వస్తా యి. అయితే సంబంధిత మూడు నియోజకవర్గాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత మెజార్టీ రానుందనే దానిపై కూడా సర్వాత్ర చర్చా జరుగుతుంది. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతోపాటు ముఖ్య నేతలు ఏయే నియోజకవర్గంలో ఎంత మెజార్టీ రానుందనే దానిపై ఇప్పటికే ఓ లెక్కలేసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిని ముందే ఒప్పుకొని ప్రచారానికి కూడా పూర్తిగా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. పైకి గెలుస్తామని చెబుతున్న వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ వారు ఓటమిని ఎప్పుడో ఒప్పుకున్నారనే వాస్తవాని ప్రజలు గుర్తించారు. అదేవిధంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయనుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 221 ఎంపీటీసీ స్థానాలకు, 18జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగగా, దాదాపు 200 వరకు ఎంపీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. అంతేకాకుండా జడ్పీ పీఠంపై కూడా గులాబీ జెండా రెపరెపలాడనుంది.

జిల్లాలోని 18జడ్పీటీసీలకుగాను ఒకట్రెండు మిన హా మిగతా అన్ని జడ్పీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లోనే ఒకట్రెండు జడ్పీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్ పార్టీ కోల్పోయే పరిస్థితి ఉందని ఆ పార్టీలు లెక్కలేసుకుంటున్నారు. ఏదేమైనా జడ్పీ పీఠాన్ని మాత్రం గులాబీ చేజిక్కించుకోనుంది. అయితే కోట్‌పల్లి మండల జడ్పీటీసీ స్థానం నుంచి జడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థి సునీతారెడ్డి పోటీ చేశారు. కోట్‌పల్లిలో ఆమె భారీ మెజార్టీతో గెలిచే పరిస్థితి ఉండడంతో మూడోసారి జడ్పీ చైర్‌పర్సన్‌గా పట్నం సునీతారెడ్డి బాధ్యతలు చేపట్టనుంది. మరోవైపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలు అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు ఏ మాత్రం పోటీనివ్వలేదు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎవరూ టికెట్ అడిగితే వారికి బీ-ఫాంలిచ్చి పోటీ చేయించారు జిల్లా కాంగ్రెస్ నేతలు. ఏదేమైనా పార్లమెంట్, పరిషత్ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ దూకుడు ప్రదర్శించడం ఖాయంగా కనిపిస్తుంది.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...