వచ్చేనెలలో బదిలీలు


Thu,May 16, 2019 11:39 PM

-తహసీల్దార్లు, ఎంపీడీవోల జాబితా రెడీ
-జూన్ మూడోవారంలో బదిలీ అయ్యే అవకాశం
-దీర్ఘకాలంగా ఒకేచోట పని చేస్తున్నవారికీ స్థాన చలనం
-పంచాయతీ, పార్లమెంట్, పరిషత్ ఎన్నికలు ముగియడంతో బదిలీ ప్రక్రియకు శ్రీకారం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి,నమస్తే తెలంగాణ: రెవెన్యూ శాఖలో భారీగా బదిలీలు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఎన్నికల సమయంలో జిల్లాకు బదిలీపై వచ్చిన తహసీల్దార్లతోపాటు ఎంపీడీవోలను కూడా బదిలీ చేసేందుకు జాబితా రెడీ చేశారు. ఏయే జిల్లాల నుంచి జిల్లాకు బదిలీపై వచ్చారో ఆయా జిల్లాలకు తిరిగి తహసీల్దార్లు, ఎంపీడీవోలు బదిలీ కానున్నారు. ఇప్పటికే తహసీల్దార్ల, ఎంపీడీవోల బదిలీల జాబితా సిద్ధంకాగా జూన్ మూడో వారంలో బదిలీ చేయనున్నారు. ఎన్నికల సందర్భంగా నవంబర్‌లో బదిలీపై జిల్లాకురాగా అసెంబ్లీ ఎన్నికలతోపాటు పంచాయతీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు పూర్తి కావడంతోపాటు ఈనెల 23న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు, 27న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఈనెల 31న జరుగనున్నాయి. వచ్చేనెల 3న ఓట్ల లెక్కింపుతోపాటు ఫలితాలను వెల్లడించనున్నారు. దీంతో మున్సిపల్ ఎన్నికలు మినహా అన్ని ఎన్నికలు పూర్తి కాను న్న దృష్ట్యా జూన్ మూడో వారంలో తహసీల్దార్లను, ఎంపీడీవోలకు స్థాన చలనం చేయనున్నారు. అంతేకాకుండా జిల్లాలో దీర్ఘకాలంగా ఒకే మండలంలో పనిచేస్తున్న తహసీల్దార్లను, ఎంపీడీవోలను కూడా బదిలీ చేసేందుకు జిల్లా ఉన్నతాధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు.

15 మంది తహసీల్దార్ల జాబితా రెడీ...
జిల్లాలో భారీగా తహసీల్దార్ల బదిలీలకు అంతా సిద్ధమైంది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వచ్చేనెలలో ఎన్నికల సందర్భంగా జిల్లాకు బదిలీపై వచ్చిన వారు తిరిగి ఆయా జిల్లాలకు బదిలీ కానున్నారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలోని 12 మంది తహసీల్దార్లు నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు బదిలీకాగా ఆయా జిల్లాల నుంచి జిల్లాకు 12 మంది తహసీల్దార్లు బదిలీపై వచారు. అయితే ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్‌తోపాటు పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తి కావడంతోపాటు పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు, పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మాత్రమే ఉండడంతో బదిలీపై వచ్చిన వారి జాబితాను తిరిగి ఆయా జిల్లాలకు బదిలీ చేసేందుకు జిల్లా ఉన్నతాధికారుల నుంచి ప్రభుత్వానికి బదిలీల జాబితా అం దింది. ఎన్నికల సందర్భంగా వచ్చిన మర్పల్లి, మోమిన్‌పేట్, కోట్‌పల్లి, బంట్వారం, పరిగి, దోమ, కుల్కచర్ల, బొంరాసుపేట్, యాలాల్, బషీరాబాద్, తాండూర్, కలెక్టరేట్‌లోని సెక్షన్‌లో పనిచేస్తున్న సీతారాం అనే తహసీల్దార్లు బదిలీ కానున్నారు. వీరితోపాటు రెండేళ్లకుపైగా ఒకే మండలంలో పనిచేస్తున్న తహసీల్దార్లను కూడా బదిలీ చేసేందుకు నిర్ణయించారు. ఈ జాబితాలో వికారాబాద్ మండల తహసీల్దార్‌తోపాటు పెద్దేముల్, కొడంగల్ మండల తహసీల్దార్లను బదిలీ చేయనున్నారు. అయితే ఎన్నికల సందర్భంగా జిల్లాకు బదిలీపై వచ్చిన వారిని ఆయా జిల్లాలకు బదిలీ చేయనుండగా,...దీర్ఘకాలంగా ఒకే మండలం లో పనిచేస్తున్న తహసీల్దార్లను మాత్రం జిల్లాలోనే ఇతర మండలాలకు బదిలీ చేయనున్నారు. అదేవిధంగా గతంలో జిల్లాలో పనిచేసి ఎన్నికల సందర్భంగా ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిన తహసీల్దార్లను తిరిగి గతంలో పనిచేసిన మండలాల్లోనే కాకుండా ఇతర మండలాల్లో పోస్టింగ్ ఇచ్చే విధంగా జాబితాను జిల్లా ఉన్నతాధికారులు సిద్ధం చేసినట్లు తెలిసింది. రెవెన్యూ శాఖలో పెరుగుతున్న అవినీతిని తగ్గించి, పూర్తి ప్రక్షాళన చేసే విధంగా గతంలో పనిచేసిన మండలాల్లో కాకుం డా కొత్త మండలాల్లో పోస్టింగ్ ఇచ్చేందుకు నిర్ణయించారు.

ఎంపీడీవోల బదిలీలు...
జిల్లాలో ఎన్నికల సందర్భంగా బదిలీపై వచ్చిన ఎంపీడీవోలను సైతం బదిలీ చేసేందుకు జాబితా రెడీ చేశారు. అయితే ఎన్నికల సమయంలో జిల్లాలోని ఆయా మండలాల్లో పనిచేస్తున్న ఎంపీడీవోలను రంగారెడ్డి జిల్లాకు, రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న ఎంపీడీవోలను జిల్లాకు బదిలీ చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో జిల్లాకు 12 మంది ఎంపీడీవోలు బదిలీపై రాగా, దోమ, కుల్కచర్ల మండలాలకు ఎంపీడీవోలుగా కొత్తగా ఎంపికైన వారికి పోస్టింగ్ ఇచ్చారు.అయితే దోమ మండల ఎంపీడీవో ఇటీవల మృతిచెందడంతో దోమ మండలానికి కొత్త ఎంపీడీవోను నియమించనున్నారు.ఎన్నికల సమయంలో వచ్చిన వికారాబాద్, మోమిన్‌పేట్, పూడూర్, పరిగి, పెద్దేముల్, తాండూరు మండలాలతో బదిలీపై వచ్చిన మరో 6 ఎంపీడీవోలను బదిలీ చేయనున్నారు. జిల్లాలో దీర్ఘకాలంగా ఒకే మండలంలో పనిచేస్తున్న ధారూర్ మండల ఎంపీడీవోతోపాటు మరో ఇద్దరిని బదిలీ చేయనున్నారు. అయితే ఎంపీడీవోల బదిలీలకు సంబంధించి ప్రస్తుతం కొనసాగుతున్నట్లుగా సొంత జిల్లాల్లో కూడా ఇతర జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వడం కాకుండా తాజాగా వారి వారి సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఇచ్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది.ఎంపీడీవోల సొంత జిల్లాల వివరాలను కూడా అధికారులు సేకరించే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రకారం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లయితే వారి వారి సొంత జిల్లాల్లో పనిచేసే అవకాశం వస్తుంది.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...