దొంగలు..బాబోయ్..దొంగలు


Thu,May 16, 2019 11:27 PM

-రాత్రి వేళల్లో ఇండ్ల తాళాలు పగులగొట్టి చోరీలు
-మన్నెగూడ అంగట్లో సెల్‌ఫోన్లు మాయంచేస్తున్న దొంగలు
-పెట్రోలింగ్ నిర్వహించని పోలీసులు భయాందోళనలో పలు గ్రామాల ప్రజలు
పూడూరు: మండలంలోని పలు గ్రామాల్లో రెండు నెలల్లోనే 8 ఇండ్ల తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న వస్తువులు, బంగారం,వెండి,డబ్బులు దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటనలతో గ్రామాల్లో ప్రజలు భయంభయంగా ఉంటున్నారు. అసలే వేసవి కాలం కావడంతో వేడిమికి తట్టుకోలేక ఇంటికి తాళాలు వేసి తమ బంగ్లాలపై, మరి కొందరు ఇంటిముందు నిద్రిస్తుండగా దొంగలు ఇదే అదును చూసి చోరీలకు పాల్పుడుతున్నారు. ఈ మధ్యకాలంలో గ్రామాల్లో దొంగతనాలు అధికం కావడంతో ప్రజలు రాత్రి సమయంలో ఇంట్లో నుంచి బయటికి వెళ్లాంటే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రతి మంగళవారం మన్నెగూడలో జరిగే అంగట్లో కూరగాయాలు కొనుగోలు కోసం పలుగ్రామాల ప్రజలు వస్తుంటారు. అంగట్లో కూరగాయాలు కొనుగోలు చేసే సమయంలోనే వారికి తెలియకుండా వారి నుంచి విలువైన ఫోన్లను దొంగలు కొట్టేస్తున్నారు. మూడు నెలల నుంచి మన్నెగూడ అంగట్లో సుమారుగా 30 స్మార్ట్‌ఫోన్లు చోరీ జరిగినట్లు సమాచారం. రెండు నెలల క్రితం పూడూరు మండల పరిధిలోని సోమన్‌గుర్తి గ్రామంలో సి.సత్యయ్య, జె.అంజయ్య, బి.వెంకటయ్య, బి.వెంకటమ్మలు రాత్రి సమయంలో ఆరుబయట నిద్రిస్తుండగా ఇంటి తాళాలు పగులగొట్టి బంగారం,వెండి, డబ్బులు ఎత్తుకెళ్లారు. అలాగే ఈ నెల 10వ తేది రాత్రి పూడూరు మండల కేంద్రంలోని బేగరి అనిల్, లక్ష్మీ, గొర్రెంకల శ్రీనివాస్, ఎర్ర.శ్రీనివాస్‌ల ఇండ్ల తాళాలు పగులగొట్టి బంగారం, వెండి, డబ్బులు చోరీలు చేసినట్లు గ్రామస్తులు పలువురు పేర్కొంటున్నారు. గతంలో కూడా మన్నెగూడ సమీపంలో హైవే రోడ్డు మార్గాల పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల బుడ్లను తొలగించి వాటిలోని విలువైన వైర్లను చోరీ చేసిన సంఘటనలు ఉన్నాయి.

గత కొంత కాలం క్రితం పరిగి మండలం బసిరెడ్డిపల్లి గ్రామంలో ఇలాగే దొంగతనాలు జరిగాయి. ముందుగా హైవే రోడ్ల సమీపంలో ఉన్న గ్రామాలను టార్గెట్‌గా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నట్లు పలు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సరైన కాలం లేక కుటుంబాల పోషణ భారమై స్థానికులే దొంగతనాలకు పాల్పడుతున్నరా.. లేదా ఇతర రాష్ట్రాల నుంచి దొంగల ముఠాలు వచ్చారా.. అని స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.రాత్రి సమయంలో గ్రామాల్లో పోలీసులు గస్తీలు నిర్వహించాల్సి ఉండగా, నిర్వహించడం లేదనే విమర్శలు ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. మన్నెగూడ సమీపంలోని హైవే పెట్రోలింగ్ పోలీస్‌స్టేషన్ ఉన్నప్పటికీ రాత్రి హైవే రోడ్డు వెంట పెట్రోలింగ్ చేయకపోవడంతో గ్రామాల్లో దొంగతనాలు చేసుకొని ఈ రోడ్డు మార్గం నుంచి దొంగలు సాఫీగా వెళ్లే అవకాశం ఏర్పడిందని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు దొంగతనాలను అరికట్టి, ప్రజల్లోని భయాందోళన తొలగేలా చూడాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...