గెలుపే లక్ష్యం


Wed,May 15, 2019 11:47 PM

-రంగంలోకి మంత్రివేముల ప్రశాంత్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు
-జడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లతో సమావేశాలు
-భారీ మెజార్టీ సాధనకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
-అయోమయంలో కాంగ్రెస్ పార్టీ
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఉమ్మడి రంగారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా టీఆర్‌ఎస్ పార్టీ కసరత్తు చేస్తుంది. రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానం గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. అయితే ఉమ్మడి రంగారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సంబంధిత ఎమ్మెల్సీ స్థానాన్ని గెలువలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితోపాటు టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లులు రంగంలోకి దిగారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటైర్లెన జడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లతో సమావేశాలు నిర్వహించి భారీ మెజార్టీతో మహేందర్ రెడ్డిని గెలిపించేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని వికారాబాద్ నియోజకవర్గంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లతో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితోపాటు టీఆర్‌ఎస్ నేతలు సమావేశం నిర్వహించి, టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించడమే లక్ష్యంగా వారిని సమాయత్తం చేశారు. మెజార్టీ ఓటర్లు టీఆర్‌ఎస్‌వైపే ఉండడంతో ఎన్నిక ఏకపక్షమే కానుందని టీఆర్‌ఎస్ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోటీ నామమాత్రమే కావడంతో ముగ్గురితో నామినేషన్ వేయించిన కాంగ్రెస్ పార్టీ ఎవరిని అభ్యర్థిగా బరిలోకి దింపాలనే దానిపై ఇంకా ఓ నిర్ణయానికి రాకపోవడం గమనార్హం.

మెజార్టీ ఓటర్లు టీఆర్‌ఎస్‌వైపే...
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికలకు పాత ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఓటర్లుగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 843 మంది ఓటర్లుండగా మెజార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు కలిపి టీఆర్‌ఎస్‌వైపే ఉన్నారు. అదేవిధంగా జిల్లాలో 276 మంది ఓటర్లున్నారు. వీరిలో తాండూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 89 మంది ఓటర్లుండగా, వికారాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 187 మంది ఓటర్లున్నారు. అయితే జిల్లా వరకు చూసుకున్న మెజార్టీ ఓటర్లు టీఆర్‌ఎస్‌కే మద్దతు తెలుపుతున్నారు. అంతేకాకుండా మరికొంత మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, ఎంపీటీసీలు కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థికే మద్దతు తెలిపేందుకు సిద్ధమైనట్లు సమాచారం. టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ఎలాంటి ప్రయోజనం ఉండదని గుర్తించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలు, కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే మర్పల్లి మండలంలోని ఆరుగురు ఎంపీటీసీలు టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపేందుకు ముందుకొచ్చినట్లు తెలిసింది.

వీరితోపాటు వికారాబాద్ నియోజకవర్గంలోని మిగతా మండలాలతోపాటు తాండూరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ ఎంపీటీసీలతోపాటు కౌన్సిలర్లను కూడా టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చే విధంగా గులాబీ నేతలు పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. అయితే ఆయా నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ పార్టీకి ఉన్న బలబలాలు చూసినట్లయితే,...పరిగి నియోజకవర్గంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కలిపి 89 మంది ఓటర్లు ఉండగా వీరిలో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారు 57 మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఉండగా మిగతా వారు కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర పార్టీల వారున్నారు. అయితే మిగతా 32 మంది ఎంపీటీసీ సభ్యులు కూడా టీఆర్‌ఎస్ పార్టీకి మద్దతిచ్చే విధంగా స్థానిక ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి రంగంలోకి దిగారు. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీటీసీలతో టచ్‌లో ఉన్న ఆయన అందరిని టీఆర్‌ఎస్‌వైపు తిప్పుకునేలా కసరత్తు చేస్తున్నారు. మరోవైపు తాండూరు నియోజకవర్గానికి సంబంధించి మెజార్టీ ఓటర్లు టీఆర్‌ఎస్ వారే ఉన్నారు. సంబంధిత నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీకి పూర్తి మెజార్టీ రానుంది. తాండూరు నియోజకవర్గంలో 89 మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఉండగా మెజార్టీ ఓటర్లు టీఆర్‌ఎస్‌వైపే ఉన్నారు. తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ మండలాలుండగా వీటిలో పెద్దేముల్ మండలం మినహాయించి మిగతా మూడు మండలాల జడ్పీటీసీలు టీఆర్‌ఎస్ వారే. అదేవిధంగా ఎంపీటీసీలకు సంబంధించి 52 ఎంపీటీసీలుండగా వీరిలో 46 మంది ఎంపీటీసీలు టీఆర్‌ఎస్ పార్టీకి చెందినవారే ఉన్నారు. మున్సిపల్ కౌన్సిలర్లకు సంబంధించి 31 మంది కౌన్సిలర్లు ఉండగా వీరిలో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారు 15 మంది ఉండగా టీడీపీ, బీజేపీలకు చెందిన వారు ఒక్కొ కౌన్సిల ర్, ఎంఐఎం పార్టీకి చెందిన కౌన్సిలర్లు 9మంది ఉన్నారు. అయితే ఎంఐఎం పార్టీ టీఆర్‌ఎస్ పార్టీకి మిత్రపక్షం కావడంతో ఎంఐఎం పార్టీకి చెందిన 9 మంది కౌన్సిలర్లు కూడా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థికే మద్దతివ్వనున్నారు. మరోవైపు వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కలిపి మొత్తం 91 మంది ఉండగా వీరిలో 58 మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు టీఆర్‌ఎస్‌కు చెందిన వారు ఉన్నారు. వీరితోపాటు మర్పల్లి మండలానికి చెందిన ఆరుగురు ఎంపీటీసీలు కూడా టీఆర్‌ఎస్‌కు ఇప్పటికే మద్దతు ప్రకటించడంతో టీఆర్‌ఎస్ ఓటర్ల సంఖ్య 64కు పెరిగింది. మిగిలిన 27 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలకు కూడా తమవైపు తిప్పుకునేలా టీఆర్‌ఎస్ నేతలు పావులు కదుపుతున్నారు.అయితే జిల్లాలోని 14 జడ్పీటీసీల్లో పెద్దేముల్, ధారూర్ మినహాయిస్తే మిగతా 12 జడ్పీటీసీలు కూడా టీఆర్‌ఎస్‌కు చెందిన వారే ఉన్నారు. ఏ విధంగా చూసిన జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...