స్థానిక సంస్థల గెలుపుపై ఎవరి ధీమా వారిదే


Wed,May 15, 2019 11:10 PM

-క్రాస్ ఓటింగ్‌కు మొగ్గు చూపిన ఓటర్లు
-అంచనాకు రాలేకపోతున్న అభ్యర్థులు
బంట్వారం : మండలంలో మంగళవారం జరిగిన స్థానిక సం స్థల ఎన్నికల ఫలితాలపై ఎవరికీ వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో కార్యకర్తలు, మండల స్థాయి నాయకులు గెలుపు తమకే వరిస్తుందని చర్చించుకుంటున్నారు. ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు గెలిచేది మే మే అంటూ పోటాపోటీగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికల్లో తెరాసా, కాంగ్రెస్ నాయకులే పోటాపోటీగా గ్రామా ల్లో విస్తృత ప్రచారం నిర్వహించి, ఓటర్లను వెన్నంటి పోలింగ్ కేంద్రాల వరకు తీసుకెళ్లి ఓట్లు వేయించారు. అంతే కాకుండా రాత్రి, పగలు ప్రజలతో మమేకమై ఉండి ఓటర్లను ఓటు వేసేలా ఒప్పించారు. దీంతో ఓటు వేసిన వారంతా తమ పార్టీకే వేశామని, ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఈ లెక్కన ప్రతి గ్రామంలో ఎవరూ ఎవరికీ ఓటు వేస్తారనేది తమకు కచ్చితంగా తెలుసునని, ఈ లెక్కన గ్రామంలోని ఓట్ల శాతాన్ని సైతం కార్యకర్తలు పరిశీలిస్తున్నారు. మంగళవారం జరిగిన ఎన్నికల సమయంలో ఆయా గ్రామాల పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల సందడి కనిపించింది. దీంతో పోటీ అనేది ఈ రెండు పార్టీల మధ్యనే ఉన్నదనేది స్పష్టమవుతున్నది.

కోట్‌పల్లి జడ్పీటీసీ స్థానం టీఆర్‌ఎస్‌దే...
మండలంలో ఏడు ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. అందులో ప్రధానంగా టీఆర్‌ఎస్ జడ్పీటీసీ అ భ్యర్థి సునీతారెడ్డి మండలంలోని ప్రతి గ్రామం, ప్రతి గడపను సందర్శించి ఓటు వేయాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ జడ్పీటీసీ అభ్యర్థిగా ఎన్నారం గ్రామానికి చెందిన వెంకట్‌రాంరెడ్డి బరిలో ఉండగా, ప్రజల వద్దకు పూర్తి స్థాయిలో వెళ్లలేకపోయారని ప్రజలు చర్చించుకుంటున్నారు.
అంతేకాకుండా ఓటర్లను అంతగా ప్రభావితం చేయలేకపోయారు. దీంతో జడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డికి గెలుపునకు ఇదో కారణం. ఇదేకాక ఆమె ఉమ్మడి బంట్వారం మండలం ఉండగా ఇక్కడి నుంచి జడ్పీటీసీగా ఎన్నికై చైర్మన్ అయ్యారు. దీంతో నాటి నుంచి ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో అనేక నిధులను వెచ్చించి అభివృద్ధి చేసింది. నాటి నుంచి రెండు సార్లు జడ్పీ చైర్మన్‌గా అయ్యి మరో మారు మండలానికి మరిన్ని నిధులను ఇస్తూ వచ్చింది. దీంతో బంట్వారం అంటే గతంలో ఎంతో వెనుకబడిన మండలంగా ఉండి అభివృద్ధికి దూరంలో ఉండేది. సునీతారెడ్డి చైర్మన్ కావడంతో ఈ మండల అభివృద్ధికి కోట్లాది నిధులను వెచ్చించింది. దీంతో మండలానికి ఓ రూపు వచ్చిందని గ్రామ స్థాయి నాయకుల నుంచి, జిల్లా స్థాయి నాయకుల వరకు కొనియాడుతున్నారు. ఇంత చేసిన ఆమె గెలుపును ఎవరూ కాదనడం లేదు. ఈ కారణంగా కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్‌లు సైతం సునీతా రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందనే ఉన్నారు. దీంతో మంగళవారం జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా క్రాస్ ఓటింగ్ జరిగిందని తెలుస్తున్నది. ఈ లెక్కన టీఆర్‌ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి గెలుపు ఖాయమైందని ప్రతి ఒక్కరూ గ్రామాల్లో చర్చించుకుంటున్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...