70.86% పోలింగ్‌


Wed,May 15, 2019 12:04 AM

-అత్యధికంగా వికారాబాద్‌ మండలంలో 79.23 శాతం
-అత్యల్పంగా బంట్వారం మండలంలో 64.84 శాతం
-ఓటును వినియోగించుకున్న 1,47,759 మంది ఓటర్లు
-నవాబుపేట్‌ మండలంలోని అర్కతల గ్రామంలో టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ వర్గాల మధ్య ఘర్షణ
-రాళ్లు రువ్వుకున్న ఇరువర్గాలు, పోలీసుల లాఠీఛార్జ్‌
-తమ గ్రామాన్ని చంద్రాయన్‌పల్లిలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ.. మధ్యాహ్నం వరకు పోలింగ్‌కు దూరంగా ఉన్న బిక్కారెడ్డిగూడ గ్రామ ప్రజలు
-చించల్‌పేట్‌లో పోలింగ్‌ సిబ్బందికి గుండెపోటు, వికారాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలింపు
-చించల్‌పేట్‌లో ఓటును వినియోగించుకున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య
వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మూడో విడుత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా వికారాబాద్‌, నవాబుపేట్‌, మోమిన్‌పేట్‌, ధారూర్‌, మర్పల్లి, బంట్వారం, కోట్‌పల్లి, పోలింగ్‌ స్వల్ప సంఘటనల నడుమ ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం జిల్లాలోని 71 ఎంపీటీసీ, 7 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మూడో విడుత ఎన్నికల్లో 70.86 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా వికారాబాద్‌ మండలంలో పోలింగ్‌ నమోదుకాగా, అత్యల్పంగా బంట్వారం మండలంలో పోలింగ్‌ నమోదైంది. మూడో విడుతలోని ఏడు మండలాల్లో 2,08,537 మంది ఓటర్లు ఉండగా 1,47,759 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. అయితే నవాబుపేట్‌ మండలంలోని అర్కతలలో టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది, ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి భారీ పోలీస్‌ బందోబస్తు మధ్యన పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించారు. మరోవైపు తమ గ్రామాన్ని మోమిన్‌పేట్‌ నుంచి చంద్రాయన్‌పల్లి గ్రామ పంచాయతీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ మోమిన్‌పేట్‌ మండలంలోని బిక్కారెడ్డిగూడ ప్రజలు మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. గ్రామ ప్రజలతో మోమిన్‌పేట్‌ మండల ఎంపీడీవో మాట్లాడి నచ్చజెప్పడంతో అనంతరం ఓటును వినియోగించుకున్నారు. అదేవిధంగా చించల్‌పేట్‌ గ్రామంలో పోలింగ్‌ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న పోలింగ్‌ సిబ్బందికి గుండెపోటు రావడంతో వికారాబాద్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మరోవైపు నవాబుపేట్‌ మండలంలోని చించల్‌పేట్‌ గ్రామంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, నవాబుపేట్‌ మండలం అత్తాపూర్‌ గ్రామంలో విద్య, మౌలిక సదుపాయాల కల్పన కార్పొరేషన్‌ చైర్మెన్‌ నాగేందర్‌ గౌడ్‌ తమ ఓటును వినియోగించుకున్నారు.

70.86 శాతం పోలింగ్‌ నమోదు...
ఒకట్రెండు చెదురు, మదురు సంఘటనలు మినహా చివరి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభంకాగా పోలింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. యువకులు మొదలుకొని వృద్ధులు, మహిళలు ఇలా ఓటర్లంతా స్వచ్ఛందంగా తరలివచ్చి తమ ఓటును వినియోగించుకున్నారు. అయితే ఉదయం 11 గంటల వరకు పోలింగ్‌ శాతం అధికంగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం అనంతరం ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో తక్కువ పోలింగ్‌ శాతం నమోదైంది. అయితే జిల్లాలో 2,08,537 మంది ఓటర్లు ఉండగా, 1,47,759 మంది ఓటర్లు తమ ఓటు ను వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 76,063 మంది ఓటర్లు, మహిళా ఓటర్లు 71,696 మంది ఓటేశారు.

ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్‌ సరళి
మూడో విడుతలో ఎన్నికలు జరిగిన ఏడు మండలాల్లో 2,08,537 మంది ఓటర్లుండగా 1,47,759 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పోలింగ్‌ సరళిని పరిశీలించినట్లయితే.. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 16.17 శాతం పోలింగ్‌ నమోదుకాగా 33,722 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. అత్యధికంగా బంట్వారం మండలంలో 20.13 శాతం, అత్యల్పంగా మోమిన్‌పేట్‌ మండలంలో 10.98 శాతం పోలింగ్‌ నమోదైంది. అదేవిధంగా ధారూర్‌ మండలంలో 19.86 శాతం, కోట్‌పల్లి మండలంలో 19.05 శాతం, మర్పల్లి మండలంలో 18.74 శాతం, నవాబుపేట్‌ మండలంలో 11.32 శాతం, వికారాబాద్‌ మండలంలో 16.10 శాతం పోలింగ్‌ నమోదైంది. అదేవిధంగా ఉదయం 11 గంటల వరకు భారీగా పోలింగ్‌ నమోదైంది, ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యన పోలింగ్‌ శాతం 22 శాతానికి పెరిగింది. ఉదయం 11 గంటల వరకు 79,657 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 38.20 శాతం పోలింగ్‌ నమోదైంది. ఉదయం 11 గంటల వరకు అత్యధికంగా ధారూర్‌లో 45.48 శాతం పోలింగ్‌ నమోదుకాగా, అత్యల్పంగా మోమిన్‌పేట్‌లో 32.29 శాతం పోలింగ్‌ నమోదైంది. కోట్‌పల్లిలో 40.45 శాతం, నవాబుపేట్‌లో 38.04 శాతం, వికారాబాద్‌లో 36.64 శాతం, మర్పల్లిలో 38.38 శాతం పోలింగ్‌ నమోదైంది. అదేవిధంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు 1,17,788 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకోగా.. 56.48 శాతం పోలింగ్‌ నమోదైంది.

అయితే మధ్యాహ్నం ఒంటి గంట వరకు అత్యధికంగా 62.51 శాతం పోలింగ్‌ నమోదుకాగా, అత్యల్పంగా బంట్వారం మండలంలో 51.86 శాతం పోలింగ్‌ నమోదైంది. వికారాబాద్‌లో 61.28 శాతం పోలింగ్‌, కోట్‌పల్లిలో 58.62 శాతం, నవాబుపేట్‌లో 55.09 శాతం, మర్పల్లిలో 55.05 శాతం, మోమిన్‌పేట్‌లో 52.18 శాతం పోలింగ్‌ నమోదైంది. మరోవైపు మధ్యాహ్నం 3 గంటల వరకు 63.20 శాతం పోలింగ్‌ నమోదుకాగా 1,31,800 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. అయితే అత్యధికంగా వికారాబాద్‌లో 71 శాతం పోలింగ్‌ నమోదుకాగా, అత్యల్పంగా బంట్వారంలో 57.11 శాతం పోలింగ్‌ నమోదైంది. అదేవిధంగా ధారూర్‌లో 69.49 శాతం, కోట్‌పల్లిలో 65.84 శాతం, మర్పల్లిలో 61.81 శాతం, మోమిన్‌పేట్‌లో 60.04 శాతం, నవాబుపేట్‌లో 58.44 శాతం పోలింగ్‌ నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు... బంట్వారంలో మొత్తం ఓటర్లు 17,007 మంది ఓటర్లుండగా 9714 మంది ఓటర్లు, ధారూర్‌లో 33,418 మంది ఓటర్లుండగా 23,225 మంది ఓటర్లు, కోట్‌పల్లి మండలంలో 20,640 మంది ఓటర్లుండగా 13,590 మంది ఓటర్లు, మర్పల్లిలో 43,818 మంది ఓటర్లుండగా 27084 మంది ఓటర్లు, మోమిన్‌పేట్‌లో 37,400 మంది ఓటర్లకుగాను 22,457 మంది ఓటర్లు, నవాబుపేట్‌లో 34,384 మంది ఓటర్లకుగాను 20,095 మంది ఓటర్లు, వికారాబాద్‌లో 21,870 మంది ఓటర్లకుగాను 15,635 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకోవడం జరిగింది.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...