కామెంటుతున్నారా.. జాగ్రత్త!


Mon,May 13, 2019 02:33 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మారు మూల ప్రాంతాల్లో జరిగే చిన్న సంఘటైనా అది నేడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. వ్యక్తుల ప్రతిష్టను, మహిళల వ్యక్తిత్వాన్ని, తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని పరువు తీసే విధంగా చేష్టలు... మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో కక్ష సాధింపు చర్యలు.. ఇలా ఏవో జిమ్మిక్కులు చేస్తూ అవతలి వారిని కించపరుస్తున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా ఇతరులను కించపరిచినా, అవమాన పరిచినా, మార్ఫింగ్‌తో తమకు అనుకూలమైన ఫొటోలు, వీడియోలను పెట్టి బ్లాక్‌మెయిలింగ్ చేసినా పక్కాగా దొరికిపోవడం ఖాయం. సోషల్ మీడియా దుర్వినియోగంపై ఇటీవల సైబర్ క్రైమ్‌కు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. సైబర్‌క్రైమ్ విభాగం ఆయా ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ నిందితులను గుర్తించి పట్టుకుంటుంది. అయినా కూడా కొందరు తమనెవరు గుర్తిస్తారనే? ధీమాతో సోషల్ మీడియాను తమ స్వార్థం కోసం దుర్వినియోగ పరుస్తున్నారు. దీనిపై సైబర్‌క్రైమ్ పోలీసులు కూడా సీరియస్‌గా ఉన్నారు.

ఇటీవలి కొన్ని ఘటనలు..
-తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టే విధంగా టిక్ టాక్‌లో ఒక యువకుడు తెలంగాణపై పరుష పదజాలంతో ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు. దీనిపై తెలంగాణ వాదులు మండిపడుతూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని వెంటనే రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు.
-వైఎస్‌ఆర్‌సీపీ నాయకురాలు షర్మిల వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా యూట్యూబ్, ఫేస్‌బుక్‌లలో వీడియోలు సర్క్యులేట్ చేసి ఆమెను మానసిక క్షోభకు గురిచేశారు. దీనిపై ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయా యూట్యూబ్ చానల్స్, ఫేస్‌బుక్, ఆయా వీడియోలకు కామెంట్లు చేసిన వారిని గుర్తించారు. చట్టపరంగా అలాంటి వారిపై చర్యలు తీసుకున్నారు.
-వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి తనకు అసభ్యకరమైన మేసేజ్‌లు పంపి, తనను మానసికంగా వేధిస్తున్నారంటూ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదయ్యింది.
-ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోను మార్ఫింగ్ చేసి, దానికి కింద కామెంట్లు పెట్టారు. దీనిపై పలువురు టీఆర్‌ఎస్వీ నాయకులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కామెంట్లు చేసిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేశారు.
-ఉగాది వేడుకలు జరుపుకుంటూ ఉగాది పచ్చడి తాగుతున్న రాష్ట్ర మంత్రుల ఫొటోలను తీసి, వాళ్లు తాగుతున్నది మద్యమంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై టీఆర్‌ఎస్వీ విభాగం సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

-ఇంజినీరింగ్ చేస్తున్న ఒక యువతిని సోషల్ మీడియాలో ఒక యువకుడు పరిచయం చేసుకొని, ఆమెతో స్నేహం చేశాడు. ఆమె వ్యక్తిగతమైన ఫొటోలను తీసుకొని, వాటిని మార్ఫింగ్ చేసి, యువతిని బ్లాక్‌మెయిల్ చేస్తుండటంతో సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
-భార్యాభర్తలు హోటల్ గదిలో ఉండగా, వారి స్వేచ్ఛకు భంగం కల్గిస్తూ గుర్తు తెలియని వ్యక్తులు ఫొటోలు తీసి, వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఆ దంపతులు సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు.
-ఒక తెలుగు హిరోయిన్‌ను నమ్మించి ఆమె వ్యక్తిగతమైన వివరాలు మాట్లాడుతూ కొందరు రికార్డు చేశారు. ఆ రికార్డులను వారి స్వార్థం కోసం సోషల్‌మీడియాలో పెట్టి ఉపయోగించుకున్నారు. దీంతో ఆమె సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
ఐదేండ్ల జైలు.. రూ. 10 లక్షల వరకు జరిమానా
-సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకర పదజాలాన్ని ఉపయోగిస్తూ వారి వ్యక్తిగత ప్రతిష్ట, పరువుకు భంగం కలిగిస్తే ఐపీసీ 509, ఐటీ యాక్టు 67 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. రుజువైతే మూడేండ్ల వరకు జైలు శిక్ష పడుతుంది.
-మార్ఫింగ్ పొటోలు పెట్టడం, వాటి కింద కామెంట్లు చేస్తూ వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీయడం, సమాజంలో ఆయా పోస్టులతో సమాజంలో వారిని కించపరిచేందుకు ప్రయత్నించడం, మహిళల నగ్న ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం నేరాలు చేస్తే ఐపీసీ 469, ఐటీ యాక్టు 67ఎ తదితర సెక్షన్ల కింద కేసులు పెడుతారు. ఈ కేసులో మూడేండ్ల నుంచి ఐదేండ్ల వరకు జైలు, రూ. 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశాలున్నాయి.
-వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు వారికి తెలియకుండా తీయడం, వాటితో బ్లాక్‌మెయిల్ చేయడంతో పాటు ఇతరత్ర దుర్వినియోగానికి పాల్పడితే ఐటీ యాక్ట్ 66సీ, 66డి, 66ఈ, 6, 67ఎ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. ఈ కేసులలో పట్టుబడ్డ నేరస్తుడు, రెండో సారి కూడా అదే తప్పు చేశాడంటే 5 ఏండ్ల వరకు జైలు శిక్షలు పడే అవకాశాలున్నాయి.

పట్టుబడడం ఖాయం..
ఇంటర్ నెట్‌ను సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ ద్వారా ఉపయోగించాలంటే తప్పని సరిగా ఐపీ (ఇంటర్‌నెట్ ప్రొటోకాల్) అనేది కీలకం. ఇంటర్ నెట్ వాడే ప్రతి ఒక్కరికీ ఒక్కో నంబర్ ఉంటుంది. దీంతో ఆయా పోస్టులు ఎక్కడి నుంచి సోషల్ మీడియాలోకి వచ్చాయనే విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు తెలుసుకుంటారు. కేవలం పోస్టులు చేసిన వారే కాకుండా, ఆయా అసభ్యకరమైన, వ్యక్తులను కించ పరిచే విధంగా ఉన్న పోస్టులకు సంబంధించిన వాటిపై కామెంట్లు చేసే వారిపై కూడా నిఘా ఉంటుంది. వాటిపై కామెంట్లు చేసే సమయంలో ఎక్కడైనా అసభ్యకరమైన స్టేట్‌మెంట్, పదాలు ఉన్నాయంటే తప్పని సరిగా వారు కూడా ఆయా కేసుల్లో నిందితులుగా మారక తప్పదు. దీనికి తోడు సోషల్ మీడియాలో వ్యక్తులు, సంస్థలను అవమానిస్తూ, కించపరిచే విధంగా పోస్టులు చేసేవారిపై బాధితులు న్యాయ స్థానంలో పరువు నష్టం దావాను వేస్తున్నారు. పోస్టులు పెట్టిన వారిని తెలుసుకోవడం సులభంగా మారడంతో, న్యాయస్థానికి అవే సాక్ష్యాలుగా మారుతున్నాయి. దీంతో న్యాయస్థానాలకు వెళ్లి పరువు నష్టం కేసులు వేస్తున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకూ పెరుగుతున్నది. ముందుగా బాధితులు సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కొన్ని కేసుల్లో పరువు నష్టం దావా వేసుకోండంటూ సూచిస్తున్నారు.

హద్దు మీరితే..
సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకుంటే సమాచారాన్ని పదిమందికి తెలుపవచ్చు. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరచడం, అవమాన పరచడం, పరువు ప్రతిష్టలకు భంగం కల్గించడం, బ్లాక్‌మెయిలింగ్ చేయడం వంటి వాటికి సోషల్ మీడియాను ఉపయోగించారంటే జైలుకు వెళ్లక తప్పదు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ దాన్ని దుర్వినియోగం చేస్తే.. చట్టాలు తమ పని తాము చేసుకుంటూ పోతాయి. ఇలాంటి కేసుల్లో కేవలం సైబర్‌క్రైమ్ పోలీసులే కాకుండా లా అండ్ అర్డర్ పోలీసులు కూడా కేసులు నమోదు చేస్తారు. సోషల్‌మీడియాను ఉపయోగించే వారు జాగ్రత్తతో ఉపయోగించడంతో ఎలాంటి అనర్థాలు ఉండవు. కామెంట్లు చేసే సమయంలోనూ జాగ్రత్తగా ఉండాలి.
- రఘువీర్, సైబర్‌క్రైమ్స్ అదనపు డీసీపీ

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...