సర్కార్ దవాఖానల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలి


Tue,April 23, 2019 12:05 AM

కులకచర్ల: ప్రభుతాస్పత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా పేర్కొన్నారు. సోమవారం కులకచర్ల ప్రభుత్వాస్పత్రిని ఆమె పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం కోసం వచ్చే ప్రతి పేషెంటుకు ప్రభుత్వాస్పత్రి ధైర్యాన్ని ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వాస్పత్రిపై ప్రజలకు పూర్తిస్థాయిలో నమ్మకం కలిగేలా వైద్య సిబ్బంది వ్యవహరించాలని అన్నారు. ఆస్పత్రిలో అన్ని రకాల సౌకర్యాలు ఉండే విధంగా చూడాలని ప్రభుత్వాస్పత్రికి వచ్చే వారు తిరిగి ప్రైవేటుకు వెళ్లకుండా ఉండేందుకు వారికి సక్రమమైన చికిత్సలు అందించాలని వైద్యులకు సూచించారు. ప్రభుత్వాస్పత్రిలో ప్రస్తుతం జరుగుతున్న ప్రసవాలకంటే మరింత ఎక్కువగా జరిగే విధంగా చూడాలని అన్నారు. ప్రభుత్వాస్పత్రిలో సుఖప్రసవాలు అవుతాయనే విషయాన్ని గ్రామాల్లో గర్భిణీ మహిళలకు, వారి కుటుంబసభ్యులకు తెలియజేయాలన్నారు. ప్రభుత్వాస్పత్రిలో ఓపీ శాతాన్ని మరింతగా పెంచాలని వైద్యులకు సూచించారు. ప్రభుత్వాస్పత్రిలో అన్ని గదులను ఆమె పరిశీలించారు. బాలింతలతో ఆస్పత్రిలో జరిగే వసతులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి పరిసరాలను, ల్యాబ్‌ను, పరిశీలించారు. అనంతరం కులకచర్ల ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల కోసం ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. నామినేషన్లకు వచ్చే వారికి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. కార్యక్రమంలో కులకచర్ల వైద్యాధికారి డాక్టర్ మురళీకృష్ణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

పాము, కుక్కకాటుకు మందులు అందుబాటులో ఉంచాలి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పాము, కుక్కకాటుకు మందులు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ వైద్యులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పాము కాటు బారిన పడి ఆస్పత్రికి వస్తే వారికి ఆస్పత్రిలోనే మందులు ఇచ్చి పూర్తిగా నయం చేయాలని అన్నారు. ఆస్పత్రికి వచ్చిన వారిని రెఫర్ చేయకుండా అన్నిరకాల మందులు కొనుగోలు చేయాలని సూచించారు. వైద్యం అందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరుగుదొడ్ల నిర్మాణం జూన్ 2లోగా పూర్తి చేయాలి
వికారాబాద్, నమస్తే తెలంగాణ : జిల్లా అధికారులు ప్రతి రోజు గ్రామాలను సందర్శించి మరుగుదొడ్ల నిర్మాణ పనులను పర్యవేక్షించి, జూన్ 2వ తేదీ నాటికి జిల్లాను ఓడిఎఫ్‌గా ప్రకటించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ మస్రత్‌ఖానమ్‌ఆయేషా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరుగుదొడ్ల పనులకు వెంటనే పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. మరుగుదొడ్డి పనులకు ముగ్గులు వేయగానే గుంతలు తవ్వి పనులను వెంటనే చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ స్థాయి అధికారులు ఎంపీడీవోలు, కార్యదర్శుల సహకారంతో వెంటనే పనులను పూర్తి చేయించాలని అధికారులకు తెలియజేశారు. అటవీ శాఖ నర్సరీలలో మొక్కలను సంరక్షించి జూన్ మాసంలో నాటేందుకు అవసరమైన మొక్కలు పెంచాలన్నారు. రైతులకు అవసరమైన టేకు, పండ్ల మొక్కలను పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య పనులను చేపట్టి చెత్తను డంపింగ్‌యార్డులకు తరలించి పరిశుభ్రత పాటించాలని కలెక్టర్ సర్పంచులకు, సంబంధిత అధికారులకు సూచించారు. మురుగు కాల్వలను పరిశుభ్రం చేయించి ప్రతి రోజు బ్లీచింగ్ పౌడర్ చల్లి పరిశుభ్రతకు ముఖ్య ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేశారు. జిల్లాలోని వికారాబాద్, తాండూరు ఆసుపత్రులలో మాదిరిగా మిగత మండలాల్లో ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బందికి శిక్షణను ఇప్పించి లక్ష్యాలను అదిగమించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.మండలాలకు జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించి మే 30వ తేదీ వరకు మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసి బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించేందుకు నిర్ణయించుకొని ఆ దిశగా యంత్రాంగం ముందుకు సాగడం జరుగుతుందని తెలియజేశారు. గ్రామ సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, వీవోఏ, వీవో, ఓబీ,ఎఫ్‌ఏ, ఏపీవో, ఈసీ, ఏపీఎం సీసీలతో అన్ని గ్రామాల్లో స్వచ్ఛభారత్ మిషన్ కింద పెండింగ్‌లో ఉన్నా మరుగుదొడ్లు అన్నింటికి పెద్దఎత్తున సోమవారం జిల్లాలో ముగ్గులువేసే కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. వీటన్నింటిని పనులను వెంటనే నిర్వహించేందుకు అధికారులు చొరవ తీసుకొని వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌వో మోతీలాల్, డీఆర్‌డీవో జాన్సన్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి
జిల్లాలో ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ వినియోగించాలని జిల్లా కలెక్టర్ మస్రత్‌ఖానమ్‌ఆయేషా సూచించారు. సోమవారం జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదాలు జరుగకుండా పట్టణంలోని ప్రతి చౌరస్తాలలో తోపుడు బండ్లు, డబ్బాలను తొలగించి వారికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపాలని తెలియజేశారు. మనిషి ప్రాణం చాలా విలువైనదని వారి ప్రాణాలు కాపాడటానికి గుంతల మయమై అధ్వానంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పెట్రోల్ బంక్ వారు హెల్మెట్ దరించే వారికి పెట్రోల్ పోసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. మహిళ సమాఖ్య సభ్యులు వారి భర్తలు, పిల్లలు హెల్మెట్ ధరించే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ఆటో, లారీల డ్రైవర్లతో సమావేశాలు నిర్వహించి ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఆర్టీసీ బస్సులు ఎక్కడ పడితే అక్కడ ఆపకుండా నిర్ణీత ప్రాంతంలో నిలిపే విధంగా చూడాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్పీ నారాయణ, ఏఎస్పీ భాస్కర్‌రావు, డీఎస్పీ శిరీష, డీఎంహెచ్‌వో ఉపేంద్‌రెడ్డి, పీఆర్‌ఈఈ మనోహర్‌రావు, మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్లు, ఆర్టీవో వాణి, ఆర్‌ఎంబీ డీప్యూటీ ఈఈ శివకుమార్, వికారాబాద్, తాండూరు, పరిగి, ఆర్టీసీ డీఎంలు, సివిల్ సైప్లె అధికారి రాజేశం తదితరులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...