నిప్పుల కొలిమి


Sun,April 21, 2019 11:41 PM

-ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరి
-గరిష్ఠంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
- వారం నుంచి పెరుగుతున్న ఎండ తీవ్రత
-ఉపాధి కోల్పోతున్న కార్మికులు
-బయటకు వెళ్లేందుకు జంకుతున్న ప్రజలు
-మధ్యాహ్నం వడగాలులు,సాయంత్రం ఈదురుగాలులతో వర్షం
-సతమతమవుతున్న అవుతున్న జనం
-ఇబ్బందులు పడుతున్న ఉపాధి కూలీలు
తాండూరు, నమస్తేతెలంగాణ: జిల్లాలో గత వారం రోజులుగా 40 డిగ్రీల కన్నా అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి విశ్వరూపంతో ఎండలు ముదిరి తీవ్రత అధికమవుతుంది. గత వారం రోజులుగా ఎండల తీవ్రత పెరడంతో ప్రజలు బెంబేలు పడిపోతున్నారు. సూర్యప్రతాపం ప్రజలకు నరకప్రాయంగా మారింది. నియోజకవర్గంలో ఎండలు దంచి కొడుతుండడంతో రోజు కూలి పనులు చేసి వచ్చిన కూలి డబ్బులతో జీవనం గడిపే పేదలు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని వికారాబాద్ ప్రాంతం తాండూరు ప్రాంతంలో ఎండల తీవ్రత మరింత అధికంగా ఉంటుంది. ఎండ వేడిమికి మధ్యాహ్నం బయటికి వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. ప్రయాణికులు కూడా ఎండలు ముదరుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో నీడ పట్టున సేద తీరుతుండడం కనిపించింది. ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ పనులు చేసుకునేందుకు వెళ్లే వారు కూడా చెట్ల నీడను ఆశ్రమిస్తున్నారు. తప్పని సరి పరిస్థితుల్లో బయటకు రావాల్సిన వారు ఎండకు అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకుంటు పనుల్లో నిమగ్నమవుతున్నారు.

ఎండల తీవ్రతతో మధ్యాహ్నం వేళ ప్రధాన రహదారులపై ట్రాఫిక్ తగ్గుతుంది. జన సంచారం తక్కువై రహదారులు నిర్మాణుష్యంగా కనిపిస్తున్నాయి. కాగా ఈ వారం రోజుల వ్యవధిలో గరిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల వరకు పెరుగడం గమనార్హం. ఇలా మధ్యాహ్నం వేళ ఎండల తీవ్రత పెరగడంతో ఇంటి బయట అడుగు పెట్టేందుకు ప్రజలు జంకుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండల తీవ్రత వల్ల ప్రజలు ప్రధాన రోడ్ల పైకి రావడంలేదని నమస్తేతెలంగాణ పరిశీలనలో స్పష్టమైంది. ముఖ్యంగా చిన్నారులను కలిగిన మహిళలు ఎండలో అసలుకే అడుగు పెట్టడంలేదు. జిల్లాలో ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతలు 41-42 డిగ్రీల మద్య నమోదవుతున్నాయి. ఆదివారం 41.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. గత వారం రోజులుగా 40 డిగ్రీలకు పైనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఎండలోతిరిగేందుకు జడుస్తున్నారు.

కూలీల ఉపాధికి గండి...!
తాండూరు నియోజకవర్గంలో ఎక్కువగా నాపరాళ్ల గనులు, సుద్ధ గనులతో పాటు సిమెంట్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో నియోజకవర్గంలో రోజు వారి పనులు చేసే కార్మికుల సంఖ్య ఎక్కువే. అయితే ఎండల తీవ్ర ఇలాంటి రోజు పనులు చేసుకునే కార్మికులు, కూలీలు ఉపాధికి గండి కొడుతుంది. ఎండల తీవ్రత వల్ల వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. పగటి పూట నాపరాళ్ల గనుల్లో కార్మికులు పనులు మానేస్తున్నారు. తాండూరు నియోజకవర్గంలో నాపరాళ్ల పరిశ్రమలు. సుద్ద పరిశ్రమలు, భవన నిర్మాణ పనుల్లో నిత్యం 5 వేల మందికి పైగా కూలీలు, కార్మికులు పనిచేస్తుంటారు. సిమెంట్ పరిశ్రమల్లో, లారీల్లోకి లోడింగ్ పనుల్లో కూడా మరో 3 వేల మందికి పైగా కూలీలు పని అయితే వీరంతా ఎండలోనే పని చేయాల్సి ఉంటుంది. దీంతో ఎండ తీవ్రత కారణంగా మధ్యాహ్నం పూట పనులు మానేస్తున్నారు. దీంతో తమ కూలీ గిట్టుబాటు కావడం లేదని పలువురు కూలీలు, కార్మికులు తెలిపారు. జిల్లాలో ఒకటి రెండు చోట్ల అకాల వర్షా వల్ల వాతావరణం చల్లబడుతున్నా తాండూరు ప్రాంతంలో మా వర్షాల జాడ లేక ప్రజలు నానా తంటాలు పడుతున్నారు.

ఎండల తీవ్రత మరింత ఎక్కువ..
నియోజకవర్గంలో నాపరాళ్ల గనుల వల్ల ఎండలవేడిమి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎండలు ముదిరి విపరీతంగా కాస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తప్పని సరి పరిస్థితుల్లో బయటకు రావాల్సిన వారు ఎండకు అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకుంటు పనుల్లో నిమగ్నమవుతున్నారు. తాండూరు పట్టణంలో చిరు వ్యాపారులు రోడ్లపై వ్యాపారాలు నిర్వహించడం ఆనవాయితీ. కూరగాయలు, పండ్లు, తోపుడు బండ్లపై వ్యాపారం చేసే ఇతర చిరు వ్యాపారాలు చేసే వారు ఎండలోనే విక్రయాలు చేస్తు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు గొడుగులు రక్షణగా పెట్టుకుని వ్యాపారం సాగిస్తున్నారు. అయితే ఎండలో కొనేందుకు ఎవరూ రావడం లేదని చిరు వ్యాపారులు తెలిపారు. ఎండల తీవ్రతతో కూరగాయలు వాడిపోయి నష్టం కలుగుతుందని వాపోయారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...