నేటి నుంచి నామినేషన్లు


Sun,April 21, 2019 11:37 PM

- తొలి విడుతకు నేడు నోటిఫికేషన్ జారీ
- తొలి విడుతలో 7 మండలాల్లో మే 6న ఎన్నికలు
- మండల పరిషత్‌లలోనే జడ్పీటీసీ నామినేషన్‌లు
పరిగి, నమస్తే తెలంగాణ : జిల్లాలో తొలి విడుతలో జరిగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించగా వికారాబాద్ జిల్లా పరిధిలో మూడు విడుతల్లో పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఇందులో తొలి విడుతలో మొత్తం 7 జడ్పీటీసీ, 97 ఎంపీటీసీ స్థానాలకు మే 6వ తేదీన పోలింగ్ జరుగుతుంది. పరిగి నియోజకవర్గంలోని పరిగి, దోమ, కులకచర్ల, గండీడ్, కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాలకు సంబంధించిన జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు తొలి విడుతలో జరుగనున్నాయి.

ఇందుకు సంబంధిచిన ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం విడుదల చేయనున్నారు. ఆ వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే నిర్ణీత స్థలాల్లో నామినేషన్‌ల స్వీకరణ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమవుతుంది. ఇందుకుగాను అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ప్రతి జడ్పీటీసీ స్థానానికి ఆయా మండలాల్లో ఒక రిటర్నింగ్ అధికారిని నియమించడం జరిగింది. ఇకపోతే ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి.. మూడునాలుగు ఎంపీటీసీ స్థానాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి రిటర్నింగ్ అధికారి నియామకం చేపట్టారు. తద్వారా ఆయా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల రిటర్నింగ్ అధికారులు నామినేషన్‌లను స్వీకరించడం జరుగుతుంది.

నేటి నుంచే నామినేషన్‌లు...
జిల్లా పరిధిలో తొలి విడుతలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్‌ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు నామినేషన్‌లు దాఖలు చేసేందుకు గడువుగా నిర్ణయించడం జరిగింది. 22 నుంచి 24వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్‌లను సంబంధిత రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. 25వ తేదీన నామినేషన్‌ల పరిశీలన, అనంతరం అభ్యర్థుల జాబితా ప్రకటన చేపడతారు. 26వ తేదీన అభ్యర్థుల విజ్ఞప్తులకు చివరి తేదీగా నిర్ణయించారు. 27వ తేదీన విజ్ఞప్తులపై పరిశీలనకు చివరి తేదీ, 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్‌ల ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. మే 6వ తేదీన తొలి విడుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది.

మండలంలోనే జడ్పీటీసీ నామినేషన్‌లు...
జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు (జడ్పీటీసీ) పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల్‌ను జడ్పీ సీఈవో కార్యాలయంలో నామినేషన్‌లు దాఖలు చేసే పద్ధ్దతికి స్వస్తి పలికింది. నూతన జిల్లాల ఏర్పాటుతో కొత్త విధానం అమలులోకి తీసుకువచ్చింది. జడ్పీటీసీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్‌లను ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో దాఖలు చేయవచ్చు. ఇందుకుగాను ప్రతి జడ్పీటీసీ స్థానానికి ప్రత్యేకంగా ఒక రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారిని నియమించడం జరిగింది. వారు ప్రత్యేకంగా జడ్పీటీసీ స్థానానికి నామినేషన్‌లు స్వీకరించడం, పరిశీలన తదితర ప్రక్రియను కొనసాగిస్తారు. జడ్పీటీసీ ఎన్నికలకు వారు ఆయా మండలాల్లో రిటర్నింగ్ అధికారులుగా కొనసాగుతారు.

మరోవైపు ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్‌ల స్వీకరణకు గ్రామపంచాయతీ ఎన్నికల వలె క్లస్టర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా మండలాల్లోని మూడు, నాలుగు ఎంపీటీసీ స్థానాలకు ఒక క్లస్టర్ ఏర్పాటుచేసి, ఒక్కో క్లస్టర్‌కు రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించడం జరిగింది. కేటాయించిన క్లస్టర్‌ల పరిధిలోని ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణను వారు చేపడతారు. ఆయా ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆ క్లస్టర్‌లోని రిటర్నింగ్ అధికారికి నామినేషన్‌లు సమర్పించాల్సి ఉంటుంది. దీంతోపాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ నామినేషన్‌ల దాఖలు చేయవచ్చు. ఆ పత్రాలను ప్రింటవుట్ తీసుకొని, హార్డ్ కాపీలను నామినేషన్ గడువు ముగిసే లోపు సంబంధిత రిటర్నింగ్ అధికారికి అందజేయాలి. తొలి విడుతలో ఎన్నికలు జరిగే 7 జడ్పీటీసీ స్థానాలకు 7 మంది రిటర్నింగ్ అధికారులను నియమించారు. 97 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 35 క్లస్టర్లు ఏర్పాటుచేయడం జరిగింది. ఈ మేరకు 35 మందిని ఎన్నికల రిటర్నింగ్ అధికారులను నియమించారు.

మండలాలకు చేరుకున్న ఎన్నికల సామగ్రి
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన సామగ్రి ఆయా మండలాలకు చేరవేయడం జరిగింది. ప్రధానంగా తొలివిడుత ఎన్నికలు జరిగే 7 మండలాలకు ఈ సామగ్రి చేరవేశారు. నామినేషన్‌ల ఫారాలు, డిక్లరేషన్, చెక్‌లిస్ట్, విత్‌డ్రా ఫారాలు, ఎన్నికల ఏజెంట్, ఎన్నికల బడ్జెట్‌కు సంబంధించిన పత్రాలు, గుర్తింపు కార్డులు, పోస్టల్ బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల ఏజెంట్ ఫారాలు, అభ్యర్థుల నామినేషన్ తుది జాబితా, తేదీ వారీగా స్వీకరించిన నామినేషన్‌ల జాబితా తదితర అంశాలకు సంబంధించి సుమారు 20 పైగా రకాల పత్రాలు ఆయా మండలాలకు చేరుకున్నాయి. సంబంధిత పత్రాలను ఆయా జడ్పీటీసీ, ఎంపీటీసీల వారీగా విడివిడిగా చేసి ప్రత్యేకంగా ఉంచారు. వాటిని సంబంధిత జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల రిటర్నింగ్ అధికారులకు అందజేయనున్నారు. ఆయా మండల పరిషత్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు ఆదివారం ఎన్నికల పనులలోనే నిమగ్నమయ్యారు. ఆయా ఎంపీటీసీల వారీగా ఓటర్ల జాబితాలను రాజకీయ పార్టీల వారికి అందజేయడం జరిగింది. ఇకపోతే బ్యాలెట్ బాక్సులు, ఇతర పోలింగ్ సామగ్రి ఒకటిరెండు రోజులలోనే ఆయా మండలాలకు చేరుకుంటుంది.

జడ్పీటీసీ రూ.4లక్షలు.. ఎంపీటీసీ రూ.1.50 లక్షలు
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎంత ఖర్చు చేయాల్సింది ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎన్నికల సంఘం నిర్ణయించిన ప్రకారం జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసే వారు రూ.4లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసేవారు రూ.1.50లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సంబంధిత అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిచి, ఆయా ఖాతాల నుంచే ఈ ఖర్చులకు డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది. మరోవైపు ప్రతిరోజు చేసిన ఖర్చుల వివరాలు ఎన్నికల ఖర్చులకు సంబంధించి పర్యవేక్షించే అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్‌ల పత్రాలతోపాటు తమ నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలను సంబంధించిన పత్రాలు జత చేయాలి. జడ్పీటీసీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు జనరల్ వారు రూ.5వేలు.., ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.2,500, ఎంపీటీసీ స్థానంలో జనరల్ రూ.2,500.., ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.1,250లు డిపాజిట్‌గా చెల్లించాలి.

నేడు అభ్యర్థుల జాబితా ప్రకటన
జిల్లా పరిధిలో తొలి విడుతలో ఎన్నికలు జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఆయా రాజకీయ పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సోమవారం ప్రకటించే అవకాశం ఉన్నది. జిల్లాలో ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థుల మధ్యే పోటీ ఉంటుంది. అధికార టీఆర్‌ఎస్ పార్టీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలలో పోటీ చేసేందుకు ఆశావహుల సంఖ్య అధికంగా ఉన్నది. ప్రతి స్థానం నుంచి కనీసం నాలుగైదు మంది పార్టీ టికెట్ ఆశిస్తున్నారు.
తొలి విడుతలో పరిగి, కొడంగల్ నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో ఎన్నికలు జరుగనుండడంతో కొడంగల్, పరిగి ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, కొప్పుల మహేశ్‌రెడ్డిలు పార్టీ అభ్యర్థుల జాబితాలను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రత్యేకంగా ఆయా మండలాల నాయకులను సమావేశపరిచి ఆశావహుల జాబితాను తీసుకున్నారు. వారిలో పార్టీలో అంకితభావంతో పనిచేసిన వారికి, గెలుపు గుర్రాలకు టీఆర్‌ఎస్ టికెట్‌లు దక్కనున్నాయి. అన్ని మండలాల్లోను పార్టీ తరఫున పోటీ చేసే జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల జాబితా తయారు చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం వరకు ఈ ప్రక్రియను పూర్తి చేసి అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉన్నది. నామినేషన్‌ల దాఖలుకు చివరి తేదీ బుధవారం వరకు ఉండడంతో సోమవారం సాయంత్రం లోపు అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. తద్వారా మంగళవారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని బుధవారం రోజు నామినేషన్‌ల దాఖలు చేయడం జరుగుతుంది.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...