జడ్పీ పీఠంపై గులాబీ గురి


Wed,April 17, 2019 11:30 PM

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో విజయభేరి మోగించిన అధికార పార్టీ టీఆర్‌ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే ఊపును కొనసాగించేలా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా మెజార్టీ జడ్పీటీసీల్లో గులాబీ జెండా ఎగురవేసి జడ్పీ చైర్‌పర్సన్ పీఠాన్ని దక్కించుకునేలా టీఆర్‌ఎస్ పార్టీ వ్యూహన్ని రచిస్తుంది. ప్రధానంగా జడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి, ప్రస్తుత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ పట్నం సునీతామహేందర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి సతీమణి ప్రతిమారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరిలో జడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థి ఎవరనేది ఒకట్రెం డు రోజుల్లో టీఆర్‌ఎస్ అధిష్టానం ఫైనల్ చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా సమాచారం. మరోవైపు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల గెలుపు బాధ్యతను మాజీ మంత్రి మహేందర్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఇప్పటికే బాధ్యతలుఅప్పగించారు.అయితే ఈనెల 20న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న దృష్ట్యా ఆ లోగా జిల్లాలోని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సమావేశమై అభ్యర్థుల ఎంపికపై మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి చర్చించి అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. అదేవిధంగా అన్ని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు,ఎంపీపీల స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో గెలుపు గుర్రాలనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల బరిలో దించేలా స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా ఇన్‌చార్జితో ఎమ్మెల్యేలు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా పోటీ చేసే ఆశావహులు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల నేతలను ప్రదక్షిణం చేసుకునే పనిలో ఉన్నారు.

క్లీన్‌స్వీప్ చేసేలా పక్కా ప్లాన్...
జిల్లాలోని 18 జడ్పీటీసీ స్థానాలు, 18 ఎంపీపీ స్థానాలు, 221 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకొని క్లీన్‌స్వీప్ చేసేలా జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నేతలు వ్యూహరచన చేస్తున్నారు. ఏ ఒక్క స్థానాన్ని కూడా వదులుకోకుండా పక్కా ప్రణాళికతో టీఆర్‌ఎస్ పార్టీ అడుగులు వేస్తుంది. ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికపై కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆయా మండలాల్లోని స్థానిక నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.రేపటి నుంచి పరిగి, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లోనూ స్థానిక నేతలతో సమావేశాలను నిర్వహించి అభ్యర్థులను ఖరా రు చేయనున్నారు. అయితే ప్రజాబలం ఉండి గెలుపొందే వారి కి పోటీ చేసే అవకాశమిచ్చేందుకు పార్టీ యంత్రాంగం నిర్ణయించింది. అదేవిధంగా
ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి కొత్తగా చేరిన వారిలో ఎవరైన గెలుపొందే వారుంటే వారికి కూడా అవకాశమివ్వాలని నిర్ణయించారు.

అదేవిధంగా గత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీకే మెజార్టీ ఉంది. జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీకి సంబంధించి ఎంపీపీలకు సంబంధించి పరిగి, దోమ, కుల్కచర్ల, పూడూర్, వికారాబాద్, మర్పల్లి, బంట్వారం, ధారూర్, మోమిన్‌పేట్, నవాబుపేట్, తాండూరు, పెద్దేముల్, బషీరాబాద్, యాలాల, దౌల్తాబాద్ మండలాల్లో ఉన్నారు. అదేవిధంగా జడ్పీటీసీలకు సంబంధించి జిల్లాలో బొంరాసుపేట్ మండలం మినహాయిస్తే జిల్లాలోని పరిగి, దోమ, కుల్కచర్ల, పూడూర్, వికారాబాద్, మర్పల్లి, బంట్వారం, ధారూర్, మోమిన్‌పేట్, నవాబుపేట్, తాండూరు, పెద్దేముల్, బషీరాబాద్, యాలాల, దౌల్తాబాద్, కొడంగల్, గండీడ్ మండలాల్లో టీఆర్‌ఎస్ జడ్పీటీసీలే కొనసాగుతున్నారు.

అభ్యర్థుల కోసం ప్రతిపక్షాల వెతుకులాట...
జిల్లాలో ప్రతిపక్ష పార్టీల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. మరీ ముఖ్యంగా ఘోర పరాజయాలను చవిచూస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయితే ఇంకా దారుణంగా మారింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఐదేండ్లుగా అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతోపాటు అభివృద్ధి టీఆర్‌ఎస్ పార్టీతోనే సాధ్యమంటూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని కాంగ్రెస్, బీజేపీ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు.

కాంగ్రెస్ నుంచి జిల్లాస్థాయి మొదలుకొని నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నేతలందరూ కారెక్కారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్‌తోపాటు బీజేపీ పార్టీల తరఫున పోటీలో దింపేందుకు రెండో క్యాడర్ నేతలు కూడా దొరకకపోవడంతో వెతుకులాట ప్రారంభించారు. అసలు ఎవరినీ బరిలో దింపనట్లయితే ఆ పార్టీ పరువుపోయే పరిస్థితి కాబ ట్టి ఎవరినో ఒకరిని నామమాత్రంగా పోటీ చేయించేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమైనట్లు తెలిసింది. కొందరు పోటీ చేసేందుకు విముఖత చూపుతుంటే బబ్బాబు అంటూ బతిమిలాట మొదలుపెట్టారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినా ,...ఓడిపోవడం ఖాయమని ముందె గుర్తించిన కొందరు ఆశావహులు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వినిపిస్తుంది. ఏదేమైనా ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది.

రిజర్వేషన్లు ఇలా...
జిల్లాలో 565 గ్రామ పంచాయతీలు, 501 రెవెన్యూ గ్రామాలతోపాటు 18 మండలాలుండగా 18 జడ్పీటీసీ స్థానాలు, 18 ఎంపీపీ స్థానాలు, 221 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అదేవిధంగా ఇప్పటికే జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి రిజర్వేషన్లను కూడా ఖరారు చేశారు. జిల్లాలోని 18 జడ్పీటీసీ స్థానాల్లో ఎస్సీలకు నాలుగు స్థానాలు, ఎస్టీలకు రెండు స్థానాలు, బీసీలకు మూడు జడ్పీటీసీ స్థానాల్లో రిజర్వేషన్లను, జనరల్‌కు 9 జడ్పీటీసీ స్థానాల్లో రిజర్వేషన్ ఖరా రు చేస్తూ నిర్ణయించారు. అదేవిధంగా జిల్లాలో 18 ఎంపీపీ స్థానాలుండగా ఎస్సీలకు-4 ఎంపీపీ స్థానాలు, ఎస్టీలకు-2 ఎం పీపీ స్థానాలు, బీసీలకు-3 ఎంపీపీ స్థానాలు, జనరల్-9 ఎంపీ పీ స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా 221 ఎంపీటీసీ స్థానాలుండగా ఎస్సీలకు 45 ఎంపీటీసీ స్థానాలు, ఎస్టీలకు-25 ఎంపీటీసీ స్థానాలు, బీసీలకు-35 ఎంపీటీసీ స్థానాలు, 116 ఎంపీటీసీ స్థానాల్లో జనరల్ కేటగిరీకి రిజర్వేషన్లను ఖరారు చేశారు. జడ్పీచైర్‌పర్సన్ స్థానాని కి జనరల్(మహిళ)రిజర్వేషన్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే.

ఎట్టి పరిస్థితుల్లోనూ మెజార్టీ స్థానాల్లో గెలిపిస్తాం..
స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని మాజీ మంత్రి, స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా ఇన్‌చార్జి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎంపీటీసీ, జడ్పీటీసీల్లోని మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటామన్నారు. జిల్లా అంతటా గెలుపు గుర్రాలనే బరిలో దింపి ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను మట్టికరిపిస్తామన్నారు. అదేవిధంగా ఎట్టిపరిస్థితుల్లోనూ జడ్పీ పీఠాన్ని కూడా దక్కించుకుంటామన్నారు.
- స్థానిక సంస్థల ఎన్నికల ఇన్‌చార్జ్జి, మాజీ మంత్రి పి.మహేందర్ రెడ్డి

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...