మద్దతుకు సిద్ధం


Wed,April 17, 2019 11:29 PM

తాండూరు, నమస్తే తెలంగాణ: రైతులు మద్దతు ధరలు పొందేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా యాసంగి వరి కోతలు మొదలు కాక ముందే జిల్లా పరిధిలో 27 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నది. జిల్లాలో ఐకేపీ(ఇందిరా క్రాంతి పథకం -డ్వాక్రా) ద్వారా 11, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆధ్వర్యంలో (డీసీఎంఎస్)ద్వారా 14, పీఏసీఎస్‌ల( ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల) ద్వారా రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఈనెల 25 నుంచి ముందుగా జిల్లాలోని తాండూరు నియోజకవర్గంలో రెండు, వికారాబాద్ నియోజకవర్గంలో మూడు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గత ఏడాదికన్నా ఈ సారి ఒక కొనుగోలు కేంద్రం అదనంగా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో జిల్లాలోని అన్ని ప్రాంతాల రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండనున్నాయి. దళారులకు రైతులు తమ పంట ఉత్పత్తులను విక్రయించి ఆర్థికంగా నష్టాలపాలవకూడదన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను కేంద్రంతో కొట్లాడి అదనంగా ఏర్పాటు చేయిస్తోంది.

రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పండించే అన్ని రకాల వ్యవసాయో త్పత్తులకు మద్దతు ధరలు లభించేలా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో రైతులకు అన్ని రకాల పంట ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుత యాసంగిలో 3460 హెక్టార్ల విస్తీర్ణంలో రైతులు వరి పంట సాగు చేశారు. గత యాసంగిలో 4032 హెక్టార్లలో రైతులు వరి ధాన్యం పండించారు. అంటే గత ఏడాది కన్నా 572 హెక్టార్ల విస్తీర్ణం ధాన్యం సాగు తగ్గింది. జిల్లాలో బోరు బావుల్లో భూగర్భ జలాలు తగ్గడంతో ధాన్యం సాగు తగ్గింది. కాగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో నుంచి దాదాపు ఒక లక్షా 20 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువస్తారని జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు అంచనాలు వేశారు. యాసంగి పంటగా వచ్చే ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకుని లాభాలు పొందాలని ప్రభుత్వం కోతలకు ముందే ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఏ గ్రేడ్ ధాన్యానికి (దొడ్డు రకం 617, పాల్గుణ, ఎంటీయూ-1010, రకాలకు) క్వింటాలుకు రూ.1770 చెల్లించాలని నిర్ణయించారు. గత ఏడాది రూ. 1590 చెల్లించారు. దీంతో గత ఏడాదికన్నా ఈసారి క్వింటాలుకు రూ. 180 అధికంగా చెల్లించనున్నారు. అలాగే కామన్ రకానికి (ఎంటీయూ-1001)ఈ ఏడాది రూ.1750 చెల్లించేందుకు నిర్ణయమైంది. గత ఏడాది కామన్ వరి ధాన్యానికి క్వింటాలుకు రూ. 1470 చెల్లించగా ఈసారి క్వింటాలుకు రూ. 280 వరకు అధికంగా చెల్లించనున్నారు. ఈనెల 25 నుంచి జిల్లాలోని తాండూరు, వికారాబాద్, కొడంగల్, పరిగి నియోజకవర్గాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ప్రారంభమై ఈనెలాఖరు వరకు అన్ని కేంద్రాల ఏర్పాటు పూర్తి చేసి రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. కాగా జిల్లాలో ఏర్పాటు చేసే 27 కొనుగోలు కేంద్రాల పరిధిలో రైతులు తమ పంట ఉత్పత్తులు విక్రయించుకునేందుకు తూకం వేసేందుకు సమయం పట్టనుండడంతో అంతవరకు రైతులకు తాగు నీరు, నీడ కల్పించేందుకు టెంట్లు వంటి సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కూడా తూకాల సంఖ్యను కూడా పెంచేందుకు నిర్ణయించారు. తేమ అధికంగా ఉన్న రైతులు తాము కొనుగోలు కేంద్రానికి తీసుకు వచ్చిన ధాన్యాన్ని అరబెట్టేందుకు కూడా సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

జిల్లాలో 12 వేల 118 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తాం
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధరలు కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలను విస్తరిస్తోంది. రైతులు మార్కెట్‌కు తమ పంట ఉత్పత్తులు తీసుకురాక ముం దే కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఏర్పాటు చేస్తున్నాం. ఈ యాసంగికి సాగు చేసిన వరి పంట కనీ సం 12 వేల 118 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తాం. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి, మద్దతు ధరలు పొందాలి. రైతులకు కేంద్రాల్లో 17 శాతం తేమ ఉన్న ధాన్యానికి మద్దతు ధరలు చెల్లిస్తాం. రైతులు కొనుగోలు కేంద్రాల వరకు ధాన్యం తీసుకు వస్తే సివిల్ సప్లయ్ శాఖ ద్వారా బస్తాలు తూకం వేసే ముందు సమకూరుస్తారు. అయితే తేమ 17 శాతం లోపు ఉండేలా రైతులు చూడాలి. ధాన్యం విక్రయించే రైతులకు వారం వ్యవధిలో డబ్బులు వారి ఖాతాలో జమ చేస్తాం.
- జిల్లా మార్కెటింగ్ శాఖ మేనేజర్ ఛాయాదేవి

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...