ప్రగతి బాటలో పల్లె పరుగు


Tue,April 16, 2019 11:21 PM

-కొత్త కార్యదర్శులతో తీరనున్న పంచాయతీల సమస్యలు
-జిల్లాలోని 565 పంచాయతీలకు తీరుతున్న కార్యదర్శుల కొరత
-విధుల్లో చేరిన 344 మంది కార్యదర్శులు
-కొత్త చట్టంతో పంచాయతీలు పుష్కలంగా నిధులు...!
-సత్వరం అందనున్న 14వ ఆర్థిక సంఘం నిధులు
-ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 10 నుంచి 25 లక్షల నిధులు
-నిధుల వ్యయంలో ఇక పారదర్శకతకు ఆస్కారం
తాండూరు, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం 2018 కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలులోకి తేవడంతో గ్రామ పంచాయతీల్లో పాలన గాడిలో పడుతోంది. కొత్త, పాత పంచాయతీల్లో ఇన్నాళ్లుగా ఖాళీగా ఉన్న గ్రామ కార్యదర్శుల పోస్టులను రెండు రోజుల క్రితం భర్తీ చేయడంతో సోమవారం నుంచి దాదాపు 90 శాతం పంచాయతీల్లో కార్యదర్శులు విధుల్లో చేరా రు. ప్రతి పంచాయతీకి ఒక గ్రామ కార్యదర్శి నియామకం చేపట్టడంతో పంచాయతీల్లో పాలన మెరుగు పడేందుకు ఆస్కారం కలిగింది. దాదాపు గత పది పన్నెండేళ్లకు పైగా ఐదారు గ్రామ పంచాయతీలకు ఒక కార్యదర్శి ఇంచార్జీగా ఉండే వారు. అయితే ప్రభుత్వం అదనంగా కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శి ప్రత్యేకంగా ఉం డాలని నిర్ణయించి కొత్తగా కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసింది.

సీఎం కేసీఆర్ చొరవతో అన్ని అవాంతరాలు అధిగమించి పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియ విజయవంతంగా పూర్తి కావడంతో ఇక ఇన్నాళ్లు నిధుల కొరతతో సతమతమైన పంచాయతీలకు పుష్కళంగా నిధులు సమకూర్చేందుకు సీఎం కేసీఆర్ దృష్టి పెట్టడడంతో పంచాయతీల్లో పేరుకున్న సమస్యలకు మోక్షం కలిగేందుకు ఆస్కారమేర్పడుతోంది. జిల్లాలో ఉన్న 18 మండలాల్లో 501 రెవెన్యూ గ్రామాలున్నాయి. జిల్లా పరిధిలో ప్రస్తుతం 565 గ్రామ పంచాయతీలున్నాయి. జిల్లాలో కొత్తగా 432 మంది పంచాయతీ కార్యదర్శుల నియామకం చేపట్టగా సోమవారం వరకు దాదాపు 344 మంది విధుల్లో చేరారు. కార్యదర్శులు చేరేందుకు 15 రోజుల గడువు ఇవ్వడంతో మరో వారం పది రోజుల్లో మిగిలిన వారు విధుల్లో చేరే అవకాశం ఉంది. ప్రతి విషయం కంప్యూటరీకరణ చేయనుండడంతో నిధుల వినియోగం అత్యంత పారదర్శకంగా ఉండనుంది.

పంచాయతీ వికేంద్రీకరణతో....
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల వికేంద్రీకరణ చేపట్టడంతో ఇన్నాళ్లు శివారు గ్రామాలుగా ఉనికి లేకుండా పోయిన పల్లెలు 500కు పైగా జనాభా ఉన్న ఆవాసప్రాంతాలు పంచాయతీలుగా ఆవిర్బవించాయి. కొన్ని గ్రామ పంచాయతీల్లో 200 జనాభా ఉన్నప్పటికీ పలు అంశాల ప్రాతిపదికన పంచాయతీలుగా మార్చారు. దీంతో పాత పంచాయతీలతో పాటు కొత్తగా ఏర్పాటైన పంచాయతీలకు ప్రతి పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం వచ్చే జూన్ మొదటి వారం నుంచి నిధుల కేటాయింపుకు సిద్ధంగా ఉండడంతో పంచాయతీ పాలన ఇక కొత్త పుంతలు తొక్కనుంది.

కొత్త చట్టంతో పంచాయతీలు పుష్కలంగా నిధులు!
సీఎం కేసీఆర్ పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న లోపాలను సమీక్షించి స్థానిక సంస్థలుగా పిలవబడుతున్న పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఆశయంతో చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే కొత్త పంచాయతీరాజ్ చట్టానికి రూపకల్పన చేశారు. కేవలం బాధ్యతలు అప్పగించి చేతులు దులుపుకుంటే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందన్న సీఎం కేసీఆర్ దృక్ఫథంతో పంచాయతీలకు పుష్కలంగా నిధులు అందించేందుకు చర్యలకు ఆదేశించారు. జనాభా ప్రాతిపధికన 2019-20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే పంచాయతీలకు నేరుగా నిధులు కేటాయించేలా సీఎం ప్రతిపాదించారు. పంచాయతీలకు అందించే నిధులకు జవాబుదారి తనం కూడా ఉండేలా కొత్త చట్టంలో పలు కీలక అంశాలను సీఎం జోడించారు.

ఈ కొత్త చట్టం ప్రకారం ప్రతి పంచాయతీకి రూ. 10 లక్షల నుంచి 25 లక్షల వరకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. కాగా ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు మైనర్ పంచాయతీలకు రూ. 10 లక్షలు, మేజర్ పంచాయతీలకు రూ. 25 లక్షల నిధులు కూడా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాగా కొత్త చట్టం ప్రకారం కేంద్రం నుంచి వచ్చే నిధులు, కార్పొరేట్ రెస్పాన్సబిలిటీ ద్వారా కేటాయించే నిధులను, జాతీయ ఉపాధి హామీ కింద మంజూరు చేసే నిధులను జోడించి పంచాయతీలకు నేరుగా అందించాలని సీఎం ప్రతిపాదించారు. ప్రస్తుతం పంచాయతీలకు ఎక్కువగా 14 ఫైనాన్స్ నిధులు పంచాయతీకి రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు మాత్రమే కే్రందం ద్వారా పంచాయతీలకు నేరుగా అందుతున్నాయి. కాగా ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత వారం పది రోజుల్లో 14 వ ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలకు సత్వరం నిధులు అందనున్నాయి.

వనరులున్న పంచాయతీలకే మినరల్ సెస్ నిధులు
జిల్లాలోని పంచాయతీలకు ఇటీవల రూ. 30 కోట్ల వరకు నిధులు మినరల్ సెస్‌గా అందాయి. అయితే ఈ నిధులను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఖర్చు చేయాలన్న నిబంధనలున్నాయి. జిల్లా విషయానికి వస్తే కేవలం తాండూరు ప్రాంతంలో ఉన్న నాపరాళ్ల ఆధారంగా ఏర్పాటు చేసిన సిమెంట్ పరిశ్రమలు, నాపరాళ్ల రవాణా ద్వారా సమకూరుతున్న రాయల్టీ ఆదాయం మాత్రమే మినరల్ సెస్‌గా జిల్లాలోని దాదాపు 10 శాతం పంచాయతీలకు సమకూరుతున్నాయి. దీంతో ఆదాయ వనరులు లేని పంచాయతీలకు నిధులు కొరత పట్టి పీడిస్తోంది. కాగా స్థానికంగా వివిధ పన్నులు, జరిమానాల విధింపుతో జీపీ (జనరల్ ఫండ్) నిధులు నామమాత్రంగా అందుతున్నాయి. సహజ వనరులు (నాపరాళ్లు, సుద్ధ, ల్యాటరైట్ వంటి సహజ వనరులు) ఉన్న పంచాయతీలకు మాత్రం అరకొర నిధులు సమకూరుతున్నాయి. దీనికి తోడు కేంద్రం నుంచి గతంలో ఎస్‌జీఆర్‌వై ద్వా రా కేటాయించిన నిధులు 2005 ఆర్థిక సంవత్సరం నుంచి రైద్దెన్నాయి. కాగా ఉపాధిహామీ కార్యక్రమంపై పంచాయతీలకు ఎలాంటి అధికారాలు కల్పించలేదు. ఇలా ఇన్నా ళ్లు కేవలం పనులు ప్రతిపాదించేందుకు మాత్రమే పంచాయతీ ల పాలకవర్గం పరిమితమైంది.

కొత్త పంచాయతీరాజ్ చట్టం -2018
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలులోకి తీసుకువచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టం-2018 ప్రకారం గ్రామ పంచాయతీ విధులు బాధ్యతల్లో భాగంగా ప్రతి నెలా పంచాయతీ పాలక వర్గం సమావేశం నిర్వహించాలి. పారిశుద్ధ్యం సక్రమంగా నిర్వర్తించడం, వీధిదీపాల నిర్వహణ, నర్సరీలను ఏర్పాటు చేయుట, దహన వాటికలు, స్మశాన వాటికల ఏర్పాటు, గ్రామ పంచాయతీ పంచ వర్ష ప్రణాళికల తయారీ ముఖ్యమైనవి.

సర్పంచ్ కర్తవ్యాలు బాధ్యతలు
పంచాయతీ కార్యదర్శిని పర్యవేక్షించాలి. కార్యదర్శి చేత పరిపాలన నియంత్రణను వినియోగించాలి. గ్రామ పంచాయతీ యొక్క ఏదైన తీర్మాణములో మంజూరు చేయు నిబంధనల పరిధిలో మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. అలాగే గ్రామంలో పారిశుద్ధ్యం నిర్వహించాలి. పంచాయతీ పరిధిలో మొక్కల పెంపకం, పచ్చదనం విస్తరణ పనులు చేయించాలి. నిర్దిష్ట కాల వ్యవధిలో అడీట్ చేయించవలసి ఉంటుంది.

పంచాయతీ కార్యదర్శి విధులు, బాధ్యతలు
పంచాయతీ కార్యదర్శి గ్రామంలో నివసించాలి. గ్రామ పంచాయతీ సమావేశం జరపవలసిన తేదీని సర్పంచ్, మరియు సభ్యులకు తెలియచేయాలి. పంచాయతీ కార్యదర్శి మామూలుగా గ్రామసభ, గ్రామ పంచాయతీ కమిటీ సమావేశానికి హాజరు కావలసి ఉంటుంది. ఈ కమిటీలో జరిగే చర్చలో పాల్గొనుటకు కార్యదర్శికి హక్కు ఉంటుంది. గ్రామ పంచాయతీ పాలక వర్గం తీర్మాణాలు అమలు చేయుటకు బాధ్యత వహించాలి. వీధి దీపాల నిర్వహణ, గ్రామ పంచాయతీ పరిధిలో మొక్కలు నాటించేందుకు వాటిలో 85 శాతం బతికించేందుకు చర్యలు చేపట్టాలి. మూత బడిన పనికి రాని బావులను గుంతలను, బోరు బావులను పూడ్చి వేయించేందుకు బాధ్యతలు తీసుకోవాలి. గ్రామ పంచాయతీ రికార్డుల పరిరక్షనిగా వ్యవహరించాలి. రికార్డులన్ని నిర్వహించి కంప్యూటరీకరించాలి. వారాంతపు చివర వెబ్‌సైట్‌లో ఉంచాలి.

గ్రామ సభలు: గ్రామ పంచాయతీచే నిశ్చయించబడిన తేదీన ప్రతి రెండు నెలలకు ఓ సారి సర్పంచ్ సమావేశ కర్తగా గ్రామ సభను నిర్వహించాలి. పంచాయతీ పరిధిలో చేపట్టదలచిన అభివృద్ధి కార్యక్రమాలు- వాటికైన వ్యయము, వార్షిక అకౌంట్ల వివరణ, అడిట్ నివేదిక, ముందు జరిగిన సంవత్సరపు పరిపాలన నివేదికకు సంబంధించిన రిపోర్టులను గ్రామసభలో ఉంచాలి.

జిల్లాలోని సర్పంచ్‌లకు విజయవంతంగా శిక్షణ...
పంచాయతీల్లో పకడ్బందీ పాలన కోసం జిల్లాలోని సర్పంచ్‌లను ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలోని మొత్తం 18 మండలాల మొత్తం 565 పంచాయతీల సర్పంచ్‌లకు రాజేంద్రనగర్ టీఎస్‌ఐపీఎఆర్‌డీలో ్ల సర్పంచ్‌లకు రీసోర్సు పర్సన్‌లు పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించిన పలు అంశాలపై గత మార్చి, ఏప్రిల్ నెలలో మొత్తం 9 బ్యాచ్‌లు ద్వారా ఐదు దఫాలుగా శిక్షణ తరగతులు ఇచ్చారు. సర్పంచ్‌లకు విజయవంతంగా శిక్షణ పూర్తి చేశారు. సర్పంచ్‌లకు ఇచ్చిన శిక్షణా కార్యక్రమాల నిర్వహణను పంచాయతీరాజ్ శాఖతో పాటు రూరల్ డెవలప్‌మెంట్ శాఖలు సంయుక్తగా పర్యవేక్షించాయి. నిపుణులైన అధికారులను రీసోర్సు పర్సన్‌లుగా నియమించి వారి చేత సర్పంచ్‌లకు పంచాయతీరాజ్ చట్టం-2018 లోని వివిధ అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ఈ చట్టం ద్వారా సర్పంచ్‌లు గ్రామాల ప్రగతికి తీసుకోవాల్సిన చర్యల గురించి, చట్టంలో పొందుపరిచిన దాదాపు 140 అంశాలపై అవగాహన కల్పించారు. ప్రజాఆరోగ్యం- పరిరక్షణకు చర్యలు, పంచాయతీల్లో అన్ని పన్నుల వసూలు- వాటితో అభివృద్ధి పనులకు ప్రణాళికల తయారీ విషయాల్లో కూడా ఎలాంటి చర్యలు తీసుకోవలన్న విషయాలపై అవగాహన కల్పించారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...