రైతు సంక్షేమమే లక్ష్యం


Mon,April 15, 2019 12:10 AM

-కొనసాగుతున్న రైతు సమగ్ర సర్వే
-మే 15 వరకు పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశం
-జిల్లాలో 18 మంది వ్యవసాయాధికారులు,
-74 మంది ఏఈవోలతో సర్వే
-జిల్లాలో 1.98లక్షల మంది రైతులు
పరిగి,నమస్తే తెలంగాణ: రైతును ఆర్థికంగా పరిపుష్టిగా తయారు చేయాలనే సంకల్పంతో అనేక పథకాలు ప్రవేశపెట్టిన టీఆర్‌ఎస్ సర్కారు ఈ దిశలో మరో ముందడుగు వేసింది. ప్రతి రైతుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం వల్ల సమాచారం క్రోడీకరించి భవిష్యతులో అమలు చేయబోయే కార్యక్రమాల రూపకల్పనకు ఈ సర్వే ఎంతో దోహదం చేస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రైతు అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. సీఎం కేసీఆర్ స్వయంగా రైతు కావడం వల్ల రైతాంగం బాధలు తెలిసిన నాయకుడు కావడంతో నాలుగున్నర సంవత్సరాలుగా రైతు సంక్షేమం ధ్యేయంగా అనేక కార్యక్రమాలు అమ లు చేశారు. వ్యవసాయాన్ని పండుగ అని నిరూపించేందుకు మొట్టమొదటగా చెరువుల పునరుద్ధరణతో రైతాంగ సంక్షేమానికి ఉపయోగపడే కార్యక్రమాలు ప్రారంభించారు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా రైతుకు ఉపయోగపడే పథకాలు అమలు చేస్తూ వచ్చా రు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ వస్తున్నారు.

2022 వరకు తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే ఏకైక లక్ష్యంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం పనిచేస్తుంది. ఇకపోతే ప్రతి 5వేల ఎకరాలకు ఒకరు చొప్పున వ్యవసాయ విస్తరణాధికారుల నియామకం చేపట్టడం ద్వారా రైతులకు మరింత చేరువగా వ్యవసాయ శాఖను తీసుకువచ్చారు. వ్యవసాయ యాంత్రీకరణకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి సబ్సిడీపై అనేక వ్యవసాయ పరికరాలను రైతులకు అందజేస్తున్నారు. భూ రికార్డుల ప్రక్షాళనతో అనేక సమస్యలను పరిష్కారం చూపించారు. రైతులను అప్పుల ఊబిలో నుంచి రక్షించేందుకు, వ్యవసాయానికి పెట్టుబడి కోసం ఇతరుల వద్ద చేయి చాచకుండా చేసేందుకు ప్రభుత్వమే రైతుబంధు పథకం కింద ఎకరాకు సంవత్సరానికి రూ. 8వేలు అందించే బృహత్తర పథకం అమలులోకి తీసుకువచ్చా రు. వచ్చే వర్షాకాలం నుంచి ఎకరాకు రూ.10వేలకు పెంచడం జరిగింది. మరోవైపు రైతుబీమా పథకం అమలుతో రైతుల కుటుంబాల్లో భరోసా నింపింది.

ఈ పథకాలన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నారు. గత సంవత్సరం రైతులకు సంబంధించిన వివరాలు సేకరించినా, పూర్తిస్థాయిలో వివరాల సేకరణకు ప్రభుత్వం రైతు సమగ్ర సర్వేకు ఉపక్రమించింది. ఈ మేరకు వ్యవసాయ విస్తరణాధికారులు రైతుల సమగ్ర సర్వే పనులు చేపడుతున్నారు. రైతుల సమగ్ర సర్వే తర్వాత, వాటి ఆధారంగా వివిధ పథకాలను రూపొందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ప్రధానంగా పంట కాలనీల ఏర్పాటు, వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మసేద్యం, కనీస మద్దతు ధర కల్పించడం, రైతులకు ఆన్‌లైన్‌లో చెల్లింపులు, ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు, డీబీటీ పద్ధ్దతిలో సబ్సిడీ చెల్లింపు, రైతుబంధు, రైతుబీమా పథకాల అమలుకు సర్వేలో వచ్చిన సమాచారాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పటికే ప్రారంభమైన సర్వే మేనెల 15వ తేదీ వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వ్యవసాయ విస్తరణాధికారుల ద్వారా ఈ సర్వే చేయిస్తున్నారు.

వికారాబాద్ జిల్లా పరిధిలో 1.98లక్షల మంది రైతులు ఉన్నారు. వారందరికీ సంబంధించిన సర్వేను అధికారులు చేపడుతున్నారు. జిల్లా పరిధిలో సుమారు 1.93లక్షల హెక్టార్ల భూమి ఉన్నది. జిల్లాలో వ్యవసాయ విస్తరణాధికారులు 99 మందికిగాను 74 మంది పనిచేస్తున్నారు. మండల వ్యవసాయాధికారులు 18మంది కలి సి ఈ సర్వే చేపడుతున్నారు. మండల స్థాయిలో పనిచేసే వ్యవసాయాధికారులు సమన్వయం చేస్తూ ఈ సర్వే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే వేసవి ఎండలు పెరిగిపోవడం వల్ల ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు సర్వే చేపడుతున్నారు. ఉదయం సేకరించిన రైతుల వివరాలను అదేరోజు మధ్యాహ్నం సమయంలో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. రైతులకు సంబంధించి ఏ, బీ పార్టులుగా ఈ సమాచార సేకరణ చేపట్టడం జరుగుతుంది.

పూర్తిస్థాయిలో వివరాల సేకరణ
రైతు సమగ్ర సర్వే సందర్భంగా వ్యవసాయాధికారులు రైతులకు సంబంధించిన ప్రతి అంశం సేకరిస్తారు. రైతుకు గల భూమి, స్వభావం, విస్తీర్ణం మొదలుకొని ఏ పంటలు సాగు చేస్తారు, ఎక్కడ విక్రయిస్తారు ఇలా ప్రతి అంశంపై ఈ సర్వే నిర్వహిస్తున్నారు. గతంలో కొన్ని అంశాలకు సంబంధించిన వివరాలే సేకరించారు. ప్రస్తుతం సేకరించే అంశాలతో రాబోయే కాలంలో రైతు సంక్షేమ కార్యక్రమాలు మరింత పకడ్బందీగా, పారదర్శకంగా, అసలైన రైతులకే చేరేలా అమలు చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇందులోను ప్రధానంగా అసైన్డ్ భూమి ఉన్నవారు సాగులో లేకపోయినా, అసలు వారికి పట్టాలు తప్ప భూమి లేకపోయినా ఇప్పటికీ రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం పొందుతున్నారు. మరోవైపు వ్యవసాయ యంత్ర పరికరాలను సైతం సబ్సిడీపై తీసుకుంటున్నారు. కొందరికి గల భూమి వ్యవసాయ యోగ్యం కానిదైనా అనేక పథకాల ద్వారా లబ్ధ్ది పొందుతుండడం గమనార్హం.

రైతులకు సంబంధించిన సమగ్ర వివరాల సేకరణతో అక్రమాలకు అడ్డుకట్ట వేయ డం, నిజమైన రైతులకు మరింత మేలు చేసే కార్యక్రమాలు అమలు చేయడానికి ఎంతో దోహదం చేస్తుందని చెప్పవచ్చు. తద్వారా పథకాల అమలు మరింత సులభతరం కావడంతోపాటు రైతులకు నేరుగా లబ్ధి చేకూరే విధంగా కార్యక్రమాల రూపకల్పన చేయవచ్చు. రాబోయే కాలంలో పంటకాలనీల ఏర్పాటు, మద్దతు ధర కల్పించడం వంటి అనేక కొత్త అంశాలు అమలు చేసే సందర్భంలో ఈ సర్వే ప్రభుత్వానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి 5వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారి పనిచేస్తుండగా సర్వే పూర్తవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 99 మంది విస్తరణాధికారులకు 74 మంది పనిచేస్తున్నారు. దీంతో ప్రభుత్వం విధించిన గడువుకు కొద్ది రోజుల తేడాలో ఈ సర్వే పూర్తి కానుంది. మరోవైపు రైతుల నుంచి సేకరించిన ప్రతి అంశాన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం వల్ల భవిష్యత్తులో ఏ పథకం అమలు చేసినా, ఆయా లబ్ధ్దిదారుల వివరాలు ఆన్‌లైన్‌లోనే సేకరించడానికి ఈ సర్వే దోహదం చేస్తుంది.

అన్ని వివరాలు సేకరిస్తున్నాం
రైతు సమగ్ర సర్వే సందర్భంగా రైతులకు సంబంధించిన అన్ని వివరాలు సేకరిస్తున్నాం. ప్రతి రైతుకు సంబంధించిన 39 అంశాలను సేకరించడంతోపాటు ప్రతిరోజూ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తు న్నాం. రాబోయే కాలంలో ఏ పథకం అమలుకైనా ఈ సర్వే ఎంతో దోహదం చేస్తుంది. సేకరించిన వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం వల్ల ప్రతి అంశానికి మళ్లీ రైతు దగ్గరకు వెళ్లకుండా ఆన్‌లైన్ ద్వారానే తెలుసుకోవచ్చు. ఎన్నికల వల్ల సర్వే కొంత నెమ్మదిగా కొనసాగింది. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి సైతం వ్యవసాయాధికారులు, విస్తరణాధికారులను ఎన్నికల విధుల నుంచి మినహాయించాలని కలెక్టర్‌ను కోరడం జరుగుతుంది. మేనెల 15వ తేదీ వరకు సర్వే పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయం చేసుకుంటూ సర్వే కొనసాగిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఏఈవోలు రైతు సమగ్ర సర్వే చేస్తున్నారు.
- గోపాల్(జిల్లా వ్యవసాయాధికారి)

రైతుల వద్ద నుంచి పార్ట్-ఏలో సేకరించే అంశాలు
రెవెన్యూ రికార్డుల ఆధారంగా రైతు పేరు, పట్టాదారు పాసు
పుస్తకం నంబరు, సర్వే నంబర్ల వారీగా ఉన్న భూ వివరాలు
తండ్రి, లేదా భర్త పేరు సహా ఆధార్‌కార్డులో ఉన్నట్లుగా
రైతు పేరును నమోదు చేయాలి.
రైతు మొబైల్ నంబర్ నమోదు చేయాలి. రైతుబంధు పథ
కానికి ఇచ్చిన నంబర్‌ను తీసుకోవాలి.
ఆధార్ నంబర్ నమోదుతోపాటు, రైతు సంతకం లేదా
వేలిముద్రతో కూడిన ఆధార్ జిరాక్స్ కాపీని తీసుకోవాలి
ఆధార్‌కార్డులో ఉన్న పుట్టిన తేదీ నమోదు చేయాలి. పుట్టిన తేదీ కాకుండా పుట్టిన సంవత్సరం ఉంటే ఏ రైతులకైనా జూలై ఒకటో తేదీని వారు పుట్టిన తేదీగా పేర్కొనడం జరుగుతుంది.

రైతుకు సంబంధించిన బ్యాంకు ఖాతా నంబరు, బ్యాంకు
పేరు, బ్రాంచి పేరు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్
రైతుబీమా కోసం సేకరించిన వివరాల ప్రకారం
సామాజిక హోదా
రైతు బీమా సందర్భంగా తీసుకున్న ఎల్‌ఐసీ ఐడీ నంబర్
పార్ట్-బీలో సేకరించే అంశాలు
రైతు విద్యార్హతలు, తనకున్న భూమి సాగుకు యోగ్యమై
నదా ? కాదా ? నీటి వసతి ఉందా ? లేదా? ఎలాంటి
వసతి కలిగి ఉంది, సూక్ష్మ సేద్యం ఏర్పాటు చేసుకున్నారా?
సర్వే నంబర్ల వారీగా స్పష్టమైన వివరాల సేకరణ.
నేలల స్వభావం, భూసార కార్డులు
రైతు పంటల బీమా ప్రీమియం చెల్లించారా ?
ఎలాంటి పంటలు పండిస్తున్నారు, కూరగాయలు, పూలు,
సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలు వంటివి గతేడాది
ఏమైనా వేశారా ?
వానాకాలం సాగుకు ఎరువులు, విత్తనాల ప్రణాళిక కోసం
సమాచారం.

2018-19లో వేసిన పంటల వివరాలు, రాబోయే వానా
కాలంలో ఏ పంటలు వేయనున్నారు
వ్యవసాయ యంత్రాలు ఏమి కలిగి ఉన్నారు, వరికోత
యంత్రాలు, ట్రాక్టర్లు, స్ప్రేయర్లు తదితరాలు
రైతు పంటరుణం తీసుకున్నారా ? లేదా ? స్వయం సహా
యక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారా ?
కిసాన్ పోర్టల్ నుంచి రైతులకు ఎస్‌ఎంఎస్‌లు వస్తు
న్నాయా ? పశుసంపద ఏ మేరకు ఉంది ? వాటి వివరాలు
సేంద్రీయ సాగుపై రైతు ఆసక్తి కలిగి ఉన్నారా ?
రైతు ఉత్పత్తి సంఘాల్లో సభ్యులుగా ఉన్నారా? లేదా ? రైతుకు మొబైల్ ఫోన్ ఉంటే అందులో తప్పనిసరిగా కిసాన్ సువిధ, పంటల యాజమాన్య యాప్‌లను ఏఈవోలు డౌన్‌లోడ్ చేయాలని సూచించారు.
ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేస్తే బాగుంటుందా? ఎలాంటివి పెట్టాలని భావిస్తున్నారో తెలుసుకోవాలి.
2018-19లో పండించిన పంటలను ఎలా అమ్ముకున్నారు ? దళారులకా, ప్రభుత్వ సంస్థలకు అమ్ముకున్నారా ?

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...