కారెక్కుతున్న కాంగ్రెస్ నేతలు


Mon,March 25, 2019 11:42 PM

పరిగి, నమస్తే తెలంగాణ: కాంగ్రెస్ నేతలు ఒక్కక్కరుగా కారెక్కుతుండడంతో పరిగి కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుంది. కాంగ్రెస్‌లో అంతోఅంతో పేరున్న నేతలు పార్టీని వీడుతుండడంతో కాంగ్రెస్ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.ఓ వైపు అసెం బ్లీ ఎన్నికల నాటికి పరిగిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ వెనువెంటనే జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ పలువురు కాంగ్రెస్ నేతలు గులాబీదళంలో చేరారు. ఇక పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి అన్ని మండలాల్లో నుంచి కాంగ్రెస్ నాయకులు పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరుతుండడంతో కాంగ్రెస్ అధి నాయకులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వివరాల్లోకి వెళ్తే పరిగి నియోజకవర్గం టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా మారింది. గతంలోను స్థానిక సంస్థల్లో మెజార్టీ స్థానాలు టీఆర్‌ఎస్ గెలుచుకుంది ఎన్నికలు ఏవైనా పరిగిలో టీఆర్‌ఎస్ ఆధిక్యం స్పష్టంగా ఉంటుంది. పరిగి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు చక్కటి కేడర్‌తోపాటు పార్టీని ముందుండి నడిపించే ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి నాయకత్వ పటిమతో పరిగిలో రోజురోజుకు టీఆర్‌ఎస్ బలపడుతుంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో పలు మండలాల నుంచి నాయకులతోపాటు వేల సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరా రు.

ముందుగానే ఓటమిని ఊహించిన అనేక మంది కాంగ్రెస్ నాయకులు ఇక కాంగ్రెస్‌లో కొనసాగితే తమకు రాజకీయ భవిష్యత్ లేదని భావించడం, మరోవైపు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో టీఆర్‌ఎస్‌కు రోజురోజుకు పెరుగుతున్న ప్రజాధరణతో వారంతా టీఆర్‌ఎస్‌లో చేరారు. ఊహించినట్లుగానే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోనే అత్యధిక మెజార్టీ 15,840 ఓట్ల ఆధిక్యంతో మహేశ్‌రెడ్డి పరిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ట్రక్కు గుర్తు ద్వారా టీఆర్‌ఎస్‌ను దెబ్బతీయాలని కాంగ్రెస్ నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కారు గుర్తును పోలి ఉన్న ట్రక్కు గుర్తుకు 8694 ఓట్లు వచ్చాయి. ట్రక్కు గుర్తుకు వచ్చిన ఓట్లు సైతం కలిపితే 25వేల పైచిలుకు మెజార్టీ వచ్చేది. మొత్తం 22 రౌండ్ల ఓట్ల లెక్కింపులో 20 రౌండ్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థి మహేశ్‌రెడ్డి ఆధిక్యత చాటుకొని సంపూర్ణమైన విజయం సాధించారు. ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో పరిగి డివిజన్ పరిధిలోని మొత్తం 148 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. పరిగి డివిజన్‌లో 23 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమవగా వాటన్నింటినీ టీఆర్‌ఎస్ గెలుచుకుంది. మిగతా 125 గ్రామపంచాయతీలకు పోలింగ్ జరుగగా ఇందులో 71 గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానాలను టీఆర్‌ఎస్ గెలుచుకుంది. ఎన్నికలు ఏవైనా విజయం టీఆర్‌ఎస్ అభ్యర్థులను వరిస్తుండడంతో పరిగి నియోజకవర్గంలో ఒక్కొక్కరుగా కాంగ్రెస్ నేతలు పార్టీని వీడుతున్నారు. సర్పంచ్‌లుగా గెలుపొందిన అనేక మంది కాంగ్రెస్ వారు సైతం టీఆర్‌ఎస్‌లో చేరారు.

టీఆర్‌ఎస్‌లో చేరుతున్న కాంగ్రెస్ నేతలు
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది పరిగి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌లో చేరికల జోరు పెరిగింది. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంలో బ్లాక్-2 కాంగ్రెస్ అధ్యక్షుడు వీరసింహారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. తాజాగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహిళా విభాగ్ రాష్ట్ర అధ్యక్షురాలు మలిపెద్ది మేఘమాల-ప్రభాకర్‌గుప్త దంపతులు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారితోపాటు పలువురు సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సుమారు 180 వాహనాల్లో సుమారు 2వేల మందితో హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌కు తరలివెళ్లి కేటీఆర్ సమక్షంలో గులాబీ దళంలో చేరారు. గత దశాబ్దకాలంగా కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్న మలిపెద్ది మేఘమాల-ప్రభాకర్‌గుప్తలు పార్టీని వీడడం కాంగ్రెస్‌కు దెబ్బగా చెప్పవచ్చు. పార్టీని వీడవద్దని అనేక మంది రాయబారాలు చేసినా వారు వినలేదు. ఇకపోతే పార్లమెంట్ ఎన్నికల నాటికి నియోజకవర్గంలోని ఇతర మండలాల నుంచి సైతం బలమైన నాయకులు కొందరు కాంగ్రెస్‌ను వీడనున్నట్లు సమాచారం. వారంతా గులాబీ గూటికి చేరడానికి సిద్ధ్దమైనట్లు తెలిసింది.

కాంగ్రెస్ పార్టీలో ఉంటే తమ రాజకీయ జీవితానికి భవిష్యత్ లేకుండా పోతుందని వారు భావిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ 16ఎంపీ స్థానాలు టీఆర్‌ఎస్ గెలుస్తుందని పలు సర్వేలు తేటతెల్లం చేయడంతో కాంగ్రెస్‌ను వీడితేనే తమకు భవిష్యత్ ఉంటుందనే ఆలోచనలో సదరు నాయకులు ఉన్నట్లు సమాచారం.మరోవైపు రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుండడం, సంక్షేమ కార్యక్రమాల అమలులో భేష్ అనిపించుకుంటుండడంతో అనేక మంది కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్ వైపు ఆకర్శితులవుతున్నారు. ఎంతోకొంత పేరున్న నాయకులు పార్టీని వీడుతుండడంతో కాంగ్రెస్ అధిష్టానం పెద్ద లు ఠారెత్తిపోతున్నారు. పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల నాటికి అసలు కాంగ్రెస్‌లో ఎంతమంది నాయకులు మిగులుతారని వారు లెక్కలు కడుతున్నట్లు సమాచారం. ఒక్కొక్కరు పార్టీని వీడుతుండడంతో పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు మరింత ఆగమ్యగోచరంగా మారుతుంది. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌కు అధిక మెజార్టీ ఇచ్చేందుకు ఎమ్మెల్యే పార్టీని మరింత ప్రణాళికాబద్ధ్దంగా ప్రచార రం గంలో నిలిపేందుకు కృషి చేస్తున్నారు. మంగళవారం టీఆర్‌ఎస్‌నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ఊరూరా ప్రచారం నిర్వహించడానికి సిద్ధ్దమవుతున్నారు. ఏదిఏమైనా పార్లమెంట్ ఎన్నికల ముందు పరిగి కాంగ్రెస్‌ను వీడే వారి సంఖ్య పెరుగుతుండడంతో ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...