నామినేషన్ల కోలాహలం


Fri,March 22, 2019 11:54 PM

- నామినేషన్ వేసిన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, పలు పార్టీల అభ్యర్థులు
- రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద కార్యకర్తల సందడి
- శుక్రవారం ఆరు నామినేషన్లు దాఖలు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో నామినేషన్ల దాఖలు కార్యక్రమం కోలాహలంగా సాగింది. శుక్రవారం మంచి రోజు కావడంతో పలు పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఒక్కరోజే ఆరు నామినేషన్లు వచ్చాయి. చేవెళ్ల టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా గడ్డం రంజిత్‌రెడ్డి, మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్,అరికెపూడి గాంధీ, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కార్తీక్‌రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు, కుటుంబ సభ్యులతో కలిసి అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. అంతకుముందు సతీసమేతంగా బంజారాహిల్స్‌లోని కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి నామినేషన్ వేశారు.


చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్‌లోని ఆర్డీవో కార్యాలయంలో రంజిత్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు మాజీ మంత్రి మహేందర్‌రె డ్డి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమన్నారు. రంజిత్ రెడ్డి మొదట్నుంచి పార్టీలో ఉంటూ తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే రంజిత్‌రెడ్డి వ్యాపార సంస్థలు ఎక్కువగా ఉన్నాయని, ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటారన్నారు. చేవెళ్ల అభ్యర్థి రంజిత్‌రెడ్డి గెలిపించుకునే బాధ్యతను మంత్రి మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకుంటారన్నారు.

గెలిపిస్తే చేవెళ్ల ప్రజల గొంతుకనవుతా : రంజిత్‌రెడ్డి
ప్రజలు నన్ను గెలిపించి పార్లమెంట్‌కు పంపిస్తే చేవెళ్ల ప్రజల గొంతుకనవుతానని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి అన్నారు. కేంద్రాన్ని యాచించే బదులు శాసిద్దామంటున్నామన్నారు. చేవెళ్ల ప్రజలకు అండదండగా ఎప్పటికీ అందుబాటులో ఉండి కంటికి రెప్పలా చూసుకుంటామని వాగ్దానం చేశారు. ప్రజా సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. 111 జీవో ఎత్తేసే విషయంలో సీఎం కేసీఆర్‌తో పాటు కేటీఆర్ స్పష్టతనిచ్చారని, తప్పకుండా ప్రజలకు న్యాయం చేస్తామన్నారు, ఒకవేళ జీవో ఎత్తివేయడం ఆలస్యమైతే ప్రత్యేక నిధులు కేటాయించి ప్రజలను ఆదుకుంటామని రంజిత్‌రెడ్డి హామీనిచ్చారు. చేవెళ్లలో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న విశ్వేశ్వర్‌రెడ్డి ఇంటి పేరులో కొండా ఉంటే నాకు కొండంత అండగా టీఆర్‌ఎస్ పార్టీ ఉందన్నారు. అదేవిధంగా చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశమిచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

బంపర్ మెజార్టీతో రంజిత్‌రెడ్డిని గెలిపిస్తాం...
చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్‌రెడ్డిని బంపర్ మెజార్టీతో గెలిపిస్తామని పరిగి, చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్‌రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్ అన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యిందని, ఆ పార్టీ ఊసే లేదన్నారు. రంజిత్‌రెడ్డి రంగారెడ్డి జిల్లాకు సుపరిచితుడని, అందరం శాయశక్తులా పనిచేసి గెలిపించుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం పోటీనిచ్చే పరిస్థితిలేదని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒకరిద్దరు కాంగ్రెస్ నేతలు త్వరలో టీఆర్‌ఎస్ చేరుతారని ఎమ్మెల్యేలు అన్నారు.

అట్టహాసంగా నామినేషన్లు దాఖలు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండు పార్లమెంట్ సీట్లు గెలుస్తామని మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, అరికేపూడి గాంధీ, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కార్తీక్‌రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు, రంజిత్‌రెడ్డి కుటుంబ సభ్యుల మధ్య అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. అంతకు ముందు బంజారాహిల్స్‌లోని కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మేమంతా కలిసికట్టుగా రంజిత్‌రెడ్డిని గెలిపించుకుంటామన్నారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ నిరంతరం చేవెళ్ల ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. చేవెళ్లను సర్వతోముఖాభివృద్ధికి పాటు పడుతానని తెలిపారు.

కొండా విశ్వేశ్వర్‌రెడ్డి...
కాంగ్రెస్ పార్టీ తరఫున కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయడానికి ఆయన వెంట రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహ్మరెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, శేరిలింగంల్లి మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్, అప్పోల ఎండీ సంగీతారెడ్డి, కుటుంబ సభ్యుల మధ్య నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ మెజార్టీతో గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...