చేవెళ్లలో వార్‌వన్‌సైడే..


Tue,March 19, 2019 11:47 PM

-భారీ మెజార్టీ కోసం టీఆర్‌ఎస్ పక్కా ప్లాన్
-ఉనికిని చాటేందుకు కాంగ్రెస్ ప్రయత్నం
-టీఆర్‌ఎస్‌వైపే సబ్బండ వర్గాల ప్రజలు
-గత ఎన్నికలతో పోలిస్తే జిల్లాలో..
- ఖాళీ అయిన కాంగ్రెస్ క్యాడర్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో వార్ వన్‌సైడ్‌గా కొనసాగుతుంది. మళ్లీ టీఆర్‌ఎస్ జెండానే ఎగురనుంది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతుండడంతో భారీ మెజార్టీ రానుంది. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీయే లక్ష్యంగా టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సన్నాహక సమావేశాలను నిర్వహించి ఆ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ కూడా బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. త్వరలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా బహిరంగ సభలో పాల్గొని గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.అయితే మరోవైపు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా ఖాళీ కావడంతో ముందే ఓటమిని అంగీకరించిన హస్తం పార్టీ ఉనికిని చాటేందుకు ప్రయత్నిస్తుంది. అదేవిధంగా బీజేపీకి కూడా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఆ పార్టీ క్యాడర్‌ను బట్టి చూస్తే నామమాత్రంగానే ఆ పార్టీ అభ్యర్థిని బరిలో దింపే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఏదేమైనా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి మూడోసారి జరిగే ఈ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలుపొంది చేవెళ్ల పార్లమెంట్ పీఠాన్ని దక్కించుకునేలా పక్కాప్లాన్‌తో గులాబీ పార్టీ ముందుకెళ్తుంది. 2008లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటు...పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటైంది. అటు పట్టణ, ఇటు గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు.చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరు, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాలను కలుపుతూ సంబంధిత పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటయ్యింది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 24,15,598 మంది ఓటర్లుండగా పురుషులు-12,51,127 మంది ఓటర్లు, మహిళలు-11,64,259 మంది ఓటర్లు, ఇతరులు-212 మంది ఓటర్లున్నారు.

గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ భారీ విజయం...
2008లో ఏర్పాటైన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి ఇప్పటివరకు రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో తొలిసారిగా చేవెళ్ల లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరుగగా,...కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందారు. 18,532 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి జితేందర్ రెడ్డిపై విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 4,20,807 ఓట్లు రాగా, టీడీపీకి 4,02,275 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 38.78 శాతం ఓట్లు పోలుకాగా, టీడీపీకి 37.08 శాతం ఓట్లు పోలయ్యాయి. మరోవైపు బీజేపీకి 10.39 శాతంతో 1,12,701 ఓట్లు వచ్చాయి. అయితే 2009 ఎన్నికల్లో మొత్తం 10.85 లక్షల ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా రెండోసారి 2014 సాధారణ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ విజయఢంకా మోగించింది. అప్పటివరకు కాంగ్రెస్, టీడీపీలకు పట్టున్న సంబంధిత నియోజకవర్గంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌వైపు మెజార్టీ ప్రజలు నిలిచారు. ఎవరూ ఊహించని విధంగా 73,023 ఓట్ల మెజార్టీని టీఆర్‌ఎస్ పార్టీకి సంబండ వర్గాల ప్రజలు అందించారు.

గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి 33.06 శాతం ఓట్లురాగా, కాంగ్రెస్ పార్టీకి 27.51 శాతం ఓట్లు, టీడీపీకి 26.84 శాతం ఓట్లు పోలుకాగా నోటాకు 0.75 ఓట్లు పోలయ్యాయి. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి 4,35,077 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 3,62,054 ఓట్లు, టీడీపీకి 3,53,203 ఓట్లు, నోటాకు 10,018 ఓట్లు పోలయ్యాయి. అయితే గత ఎన్నికల్లో మొత్తం 13,15,862 ఓట్లు పోలయ్యాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి 2009 ఎన్నికలతో పోలిస్తే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పూర్తిగా తగ్గుముఖం పట్టింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 4,20,807 ఓట్లురాగా 2014 ఎన్నికల్లో 58,753 ఓట్లు తక్కువతో 3,62,054 ఓట్లకు పరిమితమైంది. అయితే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాయడంతో ఆ పార్టీని తెలంగాణ ప్రజలు భూస్థాపితం చేశారు.

ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే పట్టం...
గత పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించిన ప్రజలు ఈ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌వైపే నిలుస్తున్నారు. ప్రధానంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ బలోపేతంకావడంతోపాటు దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుండడమే ఇందుకు నిదర్శనం. ఏ సర్వేలు నిర్వహించిన మరోసారి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీకి తిరుగులేదనే స్పష్టమవుతుంది. అంతేకాకుండా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చూసినప్పటికీ జిల్లాలోని పరిగి, వికారాబాద్ నియోజకవర్గాలతోపాటు చేవెళ్ల, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ పార్టీ మంచి మెజార్టీతో విజయం సాధించింది. అయితే మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరనుండడంతో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ బలం మరింత పుంజుకుందనే చెప్పవచ్చు. ఒక్క తాండూరు నియోజకవర్గంలో మాత్రమే స్వల్ప తేడాతో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. అయితే తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన రోహిత్ రెడ్డి కూడా పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన వెంటనే అధికార పార్టీలోకి వచ్చే యోచనలో ఉన్నట్లు తెలిసింది. మరోవైపు గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి,..ఆయనను గెలిపించిన టీఆర్‌ఎస్ పార్టీని మోసం చేసి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచారు. అయితే ఎంపీగా ఉన్న ఐదేండ్ల కాలంలో పైసా పనిచేయలేదనే విమర్శలతోపాటు దత్తత తీసుకున్న గ్రామంలో కూడా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...