నామినేషన్ల స్వీకరణ షురూ..


Tue,March 19, 2019 12:25 AM

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పార్లమెంట్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లా పరిధిలోని చేవెళ్ల లోక్‌సభతోపాటు మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. సోమవారం నుంచే నామి నేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 25 వరకు నామినేషన్ల దాఖలు చేసేందుకు ఎన్నికల సంఘం గడువిచ్చింది. అదేవిధంగా ఏప్రిల్ 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుండగా,..మే 25న ఓట్ల లెక్కింపుతోపాటు ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి జిల్లా ఎన్నికల యంత్రాంగం చకాచకా ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ నియోజకవర్గాలకు సరిపోను ఈవీఎంలను ఉత్తర్‌ప్రదేశ్‌లోని రుద్రానగర్ నుంచి తీసుకువచ్చిన అధికారులు,...ఈవీఎంల పనితీరుకు సంబంధించి మొదటి విడుత ఈవీఎంల పరిశీలన ప్రక్రియ కూడా పూర్తయ్యింది. అదేవిధంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసిన వెంటనే రెండో విడుత ఈవీఎం పరిశీలన చేపట్టి తదనంతరం కలెక్టరేట్‌లోని స్ట్రాంగ్‌రూం నుంచి ఆయా నియోజకవర్గాలకు ఈవీఎంలను తరలించనున్నారు. అయితే ఆయా నియోజకవర్గాల్లో ఈవీఎంలను భద్రపర్చేందుకుగాను వికారాబాద్ నియోజకవర్గ ఈవీఎంలను మేరీనాట్స్ పాఠశాలలో, పరిగి నియోజకవర్గ ఈవీఎంలను మినీ స్టేడియంలో, తాండూరు నియోజకవర్గ ఈవీఎంలను తాండూరు పట్టణంలోని సెయింట్ మార్స్ పాఠశాలలో, కొడంగల్ నియోజకవర్గ ఈవీఎంలను మహబూబ్‌నగర్‌లోని పాత జయప్రకాష్ నారాయణన్ ఇంజినీరింగ్ కాలేజీలో భద్రపర్చనున్నారు.

పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సోమవారం నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ షూరు అయ్యింది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థులు రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ల పత్రాల స్వీకరణ పత్రాలతో అక్కడే దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈనెల 25 వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అయితే ఈనెల 21, 23, 24 తేదీలు సెలవులుండడంతో సంబంధిత రోజుల్లో నామినేషన్లను దాఖలు ఉండదని ఎన్నికల అధికారులు వెల్లడించారు. అదేవిధంగా తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని అధికారులు తెలిపారు.

నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులకు సూచనలు...
నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల సంఘం పలు సూచనలను జారీ చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే ముందు రోజు తన పేరిట బ్యాంకు ఖాతాను తెరువాలని, ఎన్నికల సమయంలో చేసే ఖర్చంతా సంబంధిత బ్యాంకు ఖాతా ద్వారానే చేయాలని, నామినేషన్‌తోపాటు అభ్యర్థి మూడు మాసాల్లోపు తీసుకున్న ఫొటోను కూడా జతచేయాలని, నామినేషన్‌తోపాటు అఫిడవిట్‌ను కూడా పొందుపర్చాలని, నామినేషన్‌తోపాటు అభ్యర్థి సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.25 వేల నగదు లేదా డీడీ రూపంలో సమర్పించాలని సూచించింది. అదేవిధంగా అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వారైతే రూ.12,500 సెక్యూరిటీ డిపాజిట్ చేస్తూ కుల ధ్రవీకరణ పత్రాన్ని సమర్పించాలని ఎన్నికల సంఘం సూచించింది.

ఎన్నికల సిబ్బందికి శిక్షణ పూర్తి...
ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే సెక్టోరియల్ అధికారులకు ఇప్పటికే శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసిన జిల్లా ఎన్నికల అధికారులు, పోలింగ్ అధికారులతోపాటు సహాయ పోలింగ్ అధికారులకు, మైక్రో అబ్జర్వర్లతో ఇతర పోలింగ్ అధికారులకు ఆదివారం జిల్లా ఎన్నికల అధికారులు శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 1243 మంది పీవోలు, మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 205 మంది పీవోలు మొత్తం 1448 పోలింగ్ అధికారులకు శిక్షణనిచ్చారు. ఏపీవోలకు సంబంధించి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో 1516 మందికి, మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో 170 మందికి శిక్షణనిచ్చారు. అదేవిధంగా ఇతర పోలింగ్ అధికారులు మొత్తం 2,777 మంది ఉండగా, వీరిలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో 2,523 మంది ఇతర పోలింగ్ అధికారులకు, మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి సంబంధించి 254 మందికి, చేవెళ్ల నియోజకవర్గంలో నియమించిన 250 మైక్రో అబ్జర్వర్లకు కూడా జిల్లా ఎన్నికల అధికారులు శిక్షణనిచ్చారు. అదేవిధంగా జిల్లాలో ఏఆర్వోలకు, సెక్టోరియల్ అధికారులకు, పోలింగ్ అధికారులకు జిల్లా నోడల్ అధికారి జాన్సన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికల నిర్వహణపై శిక్షణనిచ్చారు.

21 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు, 81 మంది సెక్టోరియల్ అధికారులకు, 20 మంది జిల్లాస్థాయి మాస్టర్ ట్రైనర్స్‌కు, 134 మంది పోలింగ్ అధికారులకు, 65 మంది పోలీస్ అధికారులకు ఫిబ్రవరి 26, 28 తేదీల్లో రెండు విడుతలుగా శిక్షణనిచ్చారు. అయితే పోలీస్ అధికారులకు సంబంధించి జిల్లా పోలీస్ అధికారి ఎన్నికల నిర్వహణపై శిక్షణనిచ్చారు. జిల్లావ్యాప్తంగా 105 మంది సెక్టోరియల్ అధికారులను నియమించారు, పరిగి నియోజకవర్గంలో 24 మందిని, వికారాబాద్ నియోజకవర్గంలో 28 మందిని, తాండూరు నియోజకవర్గంలో 26 మందిని, కొడంగల్ నియోజకవర్గంలో 27 మందిని సెక్టోరియల్ అధికారులుగా నియమించారు. అదేవిధంగా 42 ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను కూడా నియమించారు.

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు
జిల్లాలో 129 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నట్లు జిల్లా ఎన్నికల అధికారులు గుర్తించారు. వీటిలో పరిగి నియోజకవర్గంలో 18 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, వికారాబాద్ నియోజకవర్గంలో 31 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, తాండూరు నియోజకవర్గంలో 35 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, కొడంగల్ నియోజకవర్గంలో 45 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నట్లు అధికారులు గుర్తించారు.సంబంధిత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో 97 రెవెన్యూ రూట్ మొబైల్స్‌ను, 97 పోలీస్ రూట్ మొబైల్ బృందాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఏదైనా గొడవలు తలెత్తితే అదుపులోకి తీసుకువచ్చేందుకు 22 క్విక్ రెస్పాన్స్ బృందాలను సిద్ధం చేయడంతో 4 ప్రత్యేక బలగాలను కూడా ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. అంతేకాకుండా సంబంధిత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కేంద్ర బలగాలతో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టనున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, వీడియో గ్రాఫర్స్‌తో చిత్రీకరణ, సీసీటీవీ కెమెరాల ద్వారా ఎన్నికల సరళిని చిత్రీకరించడంతోపాటు ఎప్పటికప్పుడు వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రాఫర్స్, సీసీటీవీల ద్వారా ఎన్నికల సరళిని చిత్రీకరించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈనెల 25న ఓటర్ల తుది జాబితా...
ఈనెల 25న ఓటర్లతుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. జిల్లాలో మొత్తం 8,84,282 మంది ఓటర్లుండగా,పురుషులు-4,42,299, మహిళలు-4,41,599 మంది మహిళా ఓటర్లు, సర్వీస్ ఓటర్లు-364 మంది ఓటర్లు, ఇతరులు-15 మంది ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా జిల్లాలో 8834 మంది వికలాంగ ఓటర్లున్నట్లు గుర్తించారు. పరిగి నియోజకవర్గంలో 2192, వికారాబాద్ నియోజకవర్గంలో 1872,తాండూరు నియోజకవర్గంలో 2116, కొడంగల్ నియోజకవర్గంలో 2654 మంది వికలాంగ ఓటర్లున్నారు. అయితే సంబంధిత వికలాంగ ఓటర్లకు పోలింగ్ రోజున ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వీల్‌చైర్లతోపాటు ఇతర ఏర్పాట్లను జిల్లా ఎన్నికల యంత్రాంగం పూర్తి చేసింది.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...