లెక్కతేలింది..


Mon,February 18, 2019 11:49 PM

-కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హుల లెక్కతేల్చిన జిల్లా వ్యవసాయ శాఖ
-జిల్లావ్యాప్తంగా 72,130 మంది రైతులు అర్హులుగా గుర్తింపు
-జిల్లాలో ఐదెకరాలలోపుగల రైతులు 87,389
-జిల్లాలో ఇప్పటివరకు 110 మంది రైతులను అనర్హులుగా గుర్తించిన అధికారులు
-ఈనెల 24న మొదటి విడుత ఆర్థిక సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి అర్హుల లెక్కతేలింది. ఈనెల 24న మొదటి విడుత ఆర్థిక సహాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులైన రైతులను జిల్లా వ్యవసాయ శాఖ గుర్తించింది. అయితే జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు రేషన్ కార్డుల ఆధారంగా ఐదెకరాలలోపు భూమిగల రైతులను గుర్తించారు. అయితే ఇప్పటివరకు ఒక కుటుంబంలో ఒక పట్టాదారుడిని మాత్రమే అర్హులుగా గుర్తించడం జరిగింది. ఒకే కుటుంబంలో ఇద్దరు పట్టాదారులుండి ఐదెకరాలలోపు భూమి ఉన్న వారిని కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులుగా గుర్తించనున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులు, పన్ను చెల్లించేవారు ఎవరైన రైతులు ఉన్నట్లయితే వారిని అనర్హులుగా గుర్తించి కేవలం ఐదెకరాలలోపు భూమిగల రైతులను మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులుగా సంబంధిత అధికారులు గుర్తించారు. అయితే జిల్లాలో 2.24 లక్షల మంది రైతులుండగా 87,279 మంది రైతులను ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులుగా తేల్చారు. అదేవిధంగా ఏడాదికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 87,279 మంది రైతులకు రూ.6 వేల చొప్పున రూ.52.36 కోట్లను ఆర్థిక సహాయాన్ని అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు.

ఐదెకరాలలోపు రైతులు@87,389
జిల్లాలో 2.24 లక్షల మంది రైతులుండగా కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి 40 శాతం కంటే తక్కువ మంది రైతులను అర్హులుగా గుర్తించారు. జిల్లావ్యాప్తంగా ఐదెకరాలలోపు భూమిగల వారు 87,389 మంది రైతులున్నట్లు గుర్తించారు. అయితే వీరిలో ఇప్పటివరకు 72,130 మంది రైతులను అర్హులుగా గుర్తించి సంబంధిత రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. ఐదెకరాలలోపు భూమిగల రైతుల్లో 110 మందిని వివిధ కారణాలతో అనర్హులుగా గుర్తించి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అర్హుల జాబితా నుంచి తొలగించారు. అదేవిధంగా 2,254 మంది రైతులకు సంబంధించి సరైన వివరాలు లేనట్లుగా, మరో 10,627 మంది రైతులకు సంబంధించి బ్యాంకు ఖాతా వివరాలు లేనట్లుగా గుర్తించారు. అయితే జిల్లాలో ఐదెకరాలలోపు రైతులు 87,389 మంది ఉండగా,.. బొంరాసుపేట్ మండలంలో 6,003 మంది రైతులు, దౌల్తాబాద్‌లో 5,389, కొడంగల్ లో 4,815, దోమలో 4,736, కుల్కచర్లలో 5,381, పరిగిలో 5,696, పూడూర్‌లో 5,097, బషీరాబాద్‌లో 4,052, పెద్దేముల్‌లో 5,023, తాండూర్‌లో 4,399, యాలాల్‌లో 4,730, బంట్వారంలో 2,269, ధారూర్‌లో 4,784, కోట్‌పల్లిలో 2,791, మర్పల్లిలో 5,905, మోమిన్‌పేట్‌లో 4,957, నవాబుపేట్‌లో 5,570, వికారాబాద్ మండలంలో 5792 మంది రైతులకు ఐదెకరాలలోపు భూమి ఉన్నట్లు అధికారులు లెక్కతేల్చారు. అదేవిధంగా వీరిలో ఇప్పటివరకు 72,130 మంది రైతులను అర్హులుగా గుర్తించి ప్రభుత్వానికి వివరాలను అందజేశారు.

ఇప్పటివరకు ఆయా మండలాల్లో అర్హులైన రైతులకు సంబంధించి... బొంరాసుపేట్ మండలంలో 5,055 మంది రైతులు, దౌల్తాబాద్‌లో 4,807, కొడంగల్‌లో 4,312, దోమలో 3,623, కుల్కచర్లలో 3,029, పరిగిలో 5,201, పూడూర్‌లో 4,327, బషీరాబాద్‌లో 3,607, పెద్దేముల్‌లో 4,208, తాండూర్‌లో 3,901, యాలాల్‌లో 4,186, బంట్వారంలో 991, ధారూర్‌లో 4,032, కోట్‌పల్లిలో 2,250, మర్పల్లిలో 5,517, మోమిన్‌పేట్‌లో 3,287, నవాబుపేట్‌లో 5,179, వికారాబాద్ మండలంలో 4,618 మంది రైతులను కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులుగా గుర్తించారు. అయితే జిల్లాలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో 87,279 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా చిన్న, సన్నకారు రైతులకు ఏడాదికి రూ.6 వేల ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందించనుంది. ఈ ఆర్థిక సహాయాన్ని మూడు విడుతలుగా రూ.2 వేల చొప్పున అందించనున్నారు. అయితే కిసాన్ సమ్మాన్ నిధి పథకానికిగాను అర్హులుగా.. ఐదెకరాలలోపు భూమిగల రైతులను అర్హులుగా గుర్తించాలని నిబంధనను విధించింది. ఏదేని కుటుంబంలో భర్త, భార్య, పిల్లల పేరిట మొత్తం కలిపి ఐదెకరాలలోపు ఉంటేనే అర్హులుగా గుర్తిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులను, పన్ను చెల్లించే రైతులను కిసాన్ సమ్మాన్ నిధి పథకం అర్హుల జాబితా నుంచి సంబంధిత అధికారులు తొలగించారు.

రెండు రోజుల్లోగాప్రభుత్వానికి అందజేస్తాం
-జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మరో రెండు రోజుల్లోగా అర్హులైన రైతుల వివరాలను ప్రభుత్వానికి అందజేస్తామని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ తెలిపారు. అయితే బ్యాంకు ఖాతాల వివరాలు లేని రైతుల బ్యాంకు ఖాతాలను సేకరిస్తున్నామన్నారు. అంతేకాకుండా ఒకే కుటుంబంలో ఇద్దరు పట్టాదారులు ఉన్న రైతుల వివరాలను కూడా సేకరిస్తున్నామని, ఈనెల 24న తొలి విడుత ఆర్థిక సహాయం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానుందని ఆయన పేర్కొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...