టార్గెట్


Mon,February 18, 2019 11:44 PM

-సిలబస్ పూర్తి కావడంతో రివిజన్ చేస్తున్న విద్యార్థులు
- కొనసాగుతున్న ఎస్‌ఎస్‌సీ ప్రత్యేక తరగతులు
-అన్ని పాఠశాలల్లో తనిఖీలు చేస్తున్న డీఈవోతో పాటు ప్రత్యేక బృందాలు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో ఈ ఏడాది మెరుగైన ఫలితాలను సాధించేందుకు జిల్లా విద్యాశాఖ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తుంది. గతేడాది మ్యాథ్స్, భౌతికశాస్త్రం సబ్జెక్టుల్లో అధిక మొత్తంలో విద్యార్థులు ఫెయిలవడంతో ఈ ఏడాది పునరావృతం కాకుండా మ్యాథ్స్, భౌతికశాస్త్రం సబ్జెక్టులపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మరోవైపు మార్చి 16 నుంచి పది పరీక్షలు ప్రారంభం కానుండడంతో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో నవంబర్ మాసం నుంచే పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులను షురూ చేశారు. పదో తరగతి సిలబస్‌కు సంబంధించి ఇప్పటికే పూర్తికాగా,...రివిజన్ తరగతులను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా పదో తరగతి ఉత్తీర్ణతలో వెనుకబడిన ప్రభుత్వ పాఠశాలలను గుర్తించి, సంబంధిత పాఠశాలలపై జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అయితే మరోవైపు గతేడాది అమలుచేయని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి ఈ ఏడాది అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు విషయమై జిల్లాలో ఏయే పాఠశాలల్లో సీసీ కెమెరాలున్నాయనే వివరాలను అందజేయాలని ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే జిల్లాలో ఒక్క కస్తుర్భాగాంధీ బాలికల పాఠశాలల్లో తప్ప మిగతా ఏ పాఠశాలల్లోనూ సీసీ కెమెరాలు లేనట్లుగా అధికారులు చెబుతున్నారు. మరీ ప్రతీ పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ప్రభు త్వం నిర్ణయిస్తుందా లేదనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ఏడాది 90 శాతానికిపైగా ఉత్తీర్ణత సాధించడమే టార్గెట్‌గా విద్యాశాఖ అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.

అన్ని స్కూళ్లలో ప్రత్యేక తరగతులు
పదో తరగతి పరీక్షల్లో ఈ ఏడాది మెరుగైన ఫలితాలను సాధించేందుకుగాను అన్ని స్కూళ్లలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో అక్టోబర్ మాసంలోనే ప్రత్యేక తరగతులు ప్రారంభంకాగా, మిగతా అన్ని స్కూళ్లలో నవంబర్ మాసం నుంచి షురూ అయ్యాయి. ఎస్‌ఎస్‌సీ ప్రత్యేక తరగతులను ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.00 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తున్నారు. ఒక్కొ రోజు ఒక్కొ సబ్జెక్టుపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ రోజుకో ఉపాధ్యాయుడు ప్రత్యేక తరగతులల్లో పాల్గొంటున్నారు. ప్రత్యేక తరగతులకు ఏ ఒక్క ఉపాధ్యాయుడు గైర్హాజరుకాకుండా జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు తనిఖీలు చేస్తున్నారు. అయితే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారా లేదనే దానిపై తెలుసుకునేందుకుగాను డీఈవోతోపాటు ప్రత్యేక బృందం పాఠశాలల ఆకస్మిక తనిఖీలు సైతం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా జిల్లాలో ఈ ఏడాది పది పరీక్షలకు 14,914 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 13,023 మంది విద్యార్థులుకాగా, ప్రైవేట్ విద్యార్థులు 1,891 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షకు హాజరుకానున్న రెగ్యులర్ విద్యార్థుల్లో బాలురు 6,542 మంది విద్యార్థులు కాగా 6,481 మంది బాలికలు పరీక్షలకు హాజరుకానున్నారు. జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకుగాను 61 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అంతా సిద్ధం చేశారు. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా 1,073 ప్రభుత్వ పాఠశాలలుండగా... 160 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలున్నాయి.

మ్యాథ్స్, భౌతిక శాస్త్రం సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి...
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో గతేడాది దెబ్బతీసిన మ్యాథ్స్, భౌతికశాస్త్రం సబ్జెక్టులపై జిల్లా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. గతేడాది ఎస్‌ఎస్‌సీలో 75 శాతం ఉత్తీర్ణత సాధించారు. ముఖ్యంగా ఉత్తీర్ణత తగ్గడానికి మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుల్లోనే అధిక మంది విద్యార్థులు ఫెయిల్ అయినట్లు గుర్తించిన జిల్లా విద్యాశాఖ అధికారులు.. ఈ ఏడాది పునరావృతంకాకుండా తగు చర్యలు చేపట్టారు. దీంతో ఈ ఏడాది ఎస్‌ఎస్‌సీ లో మెరుగైన ఫలితాలను సాధించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.
ఈ ఏడాది మ్యాథ్స్, భౌతికశాస్త్రం సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత తగ్గకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. సంబంధిత రెండు సబ్జెక్టులకు సంబంధించి ప్రతీరోజు రెండు పిరియడ్స్ అదనంగా నిర్వహిస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అదేవిధంగా విద్యార్థులకు ఎప్పటికప్పుడు అన్ని సబ్జెక్టులకు సంబంధించి స్లిప్ టెస్టులతో పాటు గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. మరోవైపు చదువులో వెనుకబడిన విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకునే కార్యక్రమాన్ని ఈ ఏడాది నిర్వహించలేకపోయారు. విద్యార్థులను దత్తత తీసుకునే కార్యక్రమం కాకుండా ఈ ఏడాది ఉత్తీర్ణతలో వెనుకబడిన పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు చర్యలు చేపట్టారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...