నేడే తొలి పోరు


Sun,January 20, 2019 11:26 PM

- పోలింగ్‌కు సకల ఏర్పాట్లు పూర్తి
- ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్
- మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
- 215 గ్రామ పంచాయతీలకు,1632 వార్డులకు జరుగనున్న ఎన్నికలు
- బరిలో 581 మంది సర్పంచ్, 3,634 మంది వార్డు అభ్యర్థులు
- ఓటు హక్కు వినియోగించుకోనున్న2,34,717 మంది ఓటర్లు
- పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు


వికారాబాద్ జిల్లా ప్రతినిధి,నమస్తే తెలంగాణ: తొలి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నేడు పోలింగ్ జరుగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగనుంది. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తైన వెంటనే ఉపసర్పంచ్ ఎన్నికను కూడ నిర్వహించనున్నారు. మొదటి విడుత ఎన్నికల పోలింగ్ కు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే మొదటి విడుత ఎన్నికలు జరిగే కొడంగల్, తాండూరు నియోజకవర్గాల్లోని అన్ని గ్రామ పంచాయతీలకు బ్యాలెట్ బాక్సులతోపాటు సరిపోను బ్యాలెట్ పేపర్లను పోలింగ్ కేంద్రాలకు సమకూర్చారు. అంతేకాకుండా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది కూడా ఆదివారం సాయంత్రమే ఆయా గ్రామ పంచాయతీల్లోని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలుచేయనుండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తుతో భద్రతను కట్టుదిట్టం చేశారు.

అదే విధంగా మొదటి విడుతలో భాగంగా 249గ్రామ పంచాయతీలు, 2,106 వార్డులుండగా 34 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 215 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా 460 వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతోపాటు మరో 14 వార్డుల్లో నామినేషన్లను తిరస్కరించడంతో 1632 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. అదేవిధంగా మొదటి విడుతలో 581 మంది సర్పంచ్ అభ్యర్థులు, 3,634 మంది వార్డు సభ్యులు పోటీ పడుతున్నారు. అదేవిధంగా మొద టి విడుత ఎన్నికల్లో 2,34,717 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.వీరిలో పురుషులు 1, 15,694 మంది, మహిళా ఓటర్లు 1,19,016 మంది ఓటర్లు, ఇతరులు 7 మంది ఓటర్లున్నారు. అదేవిధంగా మొదటి విడుత ఎన్నికలకు సంబంధించి 1632 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు.

మొదటి విడుత ఎన్నికల్లో భాగంగా 215 మంది రిటర్నింగ్ అధికారులు, 102 మంది మైక్రో అబ్జర్వర్లు, 48 మంది జోనల్ అధికారులు, 76 మంది రూట్ అధికారులు, 3,100 మంది ఇతర పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. మొదటి విడుత ఎన్నికలు జరిగే 215 గ్రామ పంచాయతీల్లో 27 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 76 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నట్లు జిల్లా పంచాయతీ అధికారులు గుర్తించారు. ఈ అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలతోపాటు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లోని ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఒక మైక్రో అబ్జర్వర్‌ను నియమించడంతోపాటు పోలింగ్ సరళిని వెబ్‌కాస్టింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా 1,050 మంది పోలీసులు, పారా మిలిటరీ బలగాల బందోబస్తు మధ్య పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

మెజార్టీ పంచాయతీల్లో గెలుపుపై టీఆర్‌ఎస్ ధీమా
మొదటి విడుత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మెజార్టీ గ్రామ పంచాయతీల్లో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొదటి విడుతలో తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లోని 249 గ్రామ పంచాయతీల్లో 34 గ్రామ పంచాయతీలను ఇప్పటికే ఏకగ్రీవం చేసుకోగా 215 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే గ్రామాల ప్రజలను ఐక్యం చేసి, అభివృద్ధికే పట్టం కట్టే విధంగా కొడంగల్,తాండూరు నియోజకవర్గాల ప్రజ లు ఎన్నికలు కాకుండా ఏకగ్రీవం చేసుకున్నారు. మొదటి విడుతలో ఏకగ్రీవమైన 34 గ్రామ పంచాయతీల్లో రెండు గ్రామ పంచాయతీలు మినహా మిగతా అన్ని ఏకగ్రీవ పంచాయతీల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులనే ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. అదేవిధంగా ఎన్నికలు జరిగే 215 గ్రామ పంచాయతీల్లో 200 లకుపైగా గ్రామ పంచాయతీల్లో టీఆర్‌ఎస్ జెండా రెపరెపలాడడం ఖాయమనే స్పష్టమవుతుంది.

కొడంగల్ నియోజకవర్గం లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి అక్కడే ఉంటూ కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతుగా కొడంగల్, బొంరాసుపేట్, దౌల్తాబాద్ మండలాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. తాండూ రు నియోజకర్గంలోనూ మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అభ్యర్థుల ఎంపిక మొదలు, ప్రచారం ముగిసే వరకు నియోజకవర్గంలోనే పర్యటిస్తూ టీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఊరూరా ప్రచారం నిర్వహించారు. ప్రతీ గ్రామ పంచాయతీలతోపాటు కొత్త గ్రామ పంచాయతీల్లోనూ అభివృద్ధి జరగాలంటే టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థినే గెలిపించుకోవాలని మహేందర్‌రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్లారు. అయితే మొదటి విడుతలో ఐదారు మంది ఇతరులు గెలుపొందినప్పటికీ వారు కూడా టీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు ఇప్పటికే సంసిద్ధులయ్యారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...