ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి


Thu,January 17, 2019 12:55 AM

తాండూరు, నమస్తే తెలంగాణ: పంచాయతీ ఎన్నికల నిర్వహణలో సిబ్బంది ఎన్నికల కమిషన్ నిబంధలను కచ్చితంగా పాటించాలని, బాధ్యతలను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీ ఎన్నికల పరిశీలకురాలు వాకాటి కరుణ ఎన్నికల సిబ్బందికి సూచించారు. తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ మండలాలకు చెందిన రిటర్నింగ్ అధికారులు, పోలింగ్, ప్రిసైడింగ్ అధికారులతో, ఎన్నికల సిబ్బందితో బుధవారం తాండూరులో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఓమర్ జలీల్‌తో పాటు జిల్లా ఎస్పీ అన్నపూర్ణ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో పంచాయతీ ఎన్నికలు ఎంతో ప్రాముఖ్యత కలిగినవని అన్నారు. ఎన్నికల్లో సిబ్బంది మధ్య సత్సంబంధాలు ఉండాలని సూచించారు. ఎంపీడీఓలు, తహసీల్దార్‌లు రిటర్నింగ్ అధికారులతో తరచు సంప్రదిస్తూ వారి అనుమానాలను నివృత్తి చేయాలని కోరారు.

ఎన్నికల్లో సిబ్బందికి కేటాయించిన విధులను ఎవరికి వారు సమర్థంగా నిర్వహించాలని సూచించారు.ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీ ఎన్నికల పరిశీలకురాలు వాకాటి కరుణ మాట్లాడుతూ ఎన్నికల సిబ్బంది ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వివాదాలకు తావిచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోరాదన్నరు. రిటర్నింగ్ అధికారిదే ఫలితంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఎన్నికల సిబ్బంది ఇతరులతో, అపరిచితులతో దూరంగా వ్యవహరించాలని సూచించారు. ఎలాంటి అనుమానాలు తలెత్తినా ఉన్నతాధికారులకు వివరించి అనుమానాలు నివృత్తి చేసుకుని సక్రమంగా ఎన్నికలు జరిగేందుకు తోడ్పడాలని అన్నారు. ప్రతి విషయాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తమకు కేటాయించి మినిట్స్ పుస్తకాల్లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. నెల రోజుల పాటు నిర్వహించే పంచాయతీ ఎన్నికల్లో సిబ్బంది పాత్ర ఎంతో కీలకమన్నారు. శాసన సభా ఎన్నికల్లో సమర్థంగా విధులు నిర్వహించారని ఈ సందర్భంగా సిబ్బందిని అభినందించారు. ఇదే స్పూర్తితో పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఓమర్ జలీల్ మాట్లాడుతు పంచాయతీ ఎన్నికల సందర్బంగా జిల్లాలోని తొలి విడుతలో 249 పంచాయతీల్లో 34 పంచాయతీలకు ఏకగ్రీవం జరిగాయని, మిగిలిన 215 పంచాయతీల్లో సర్పంచ్‌లకు పోటీ జరుగుతోందని, 460 వార్డులకు ఏకగ్రీవం అయ్యాయన్నారు.

ఎన్నికలు జరుగుతున్న అన్ని పంచాయతీల్లో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎంపీడీఓల ద్వారా అన్ని వసతులకు ఏర్పాట్లు చేయిస్తున్నామన్నారు. చిన్న చిన్న తప్పులు కూడా చేయరాదని, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించేందుకు శ్రద్ధ చూపాలని సూచించారు. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తగు చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉంటామని తెలిపారు. సిబ్బంది కొందరు అధికారుల వ్యవహరశైలి పట్ల అభ్యంతరాలను వ్యక్తం చేయడంతో కలెక్టర్ అధికారులు తమ కింది స్థాయి సిబ్బందితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎక్సైజ్ అధికారులు తమ విధులను సజావుగా నిర్వహించాలని, ఎక్కడైనా ఎన్నికల ప్రచారంలో మద్యం వంటివి ఓటర్లకు పంచినట్లు సమాచారం వస్తే అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకునాలని సూచించారు. జిల్లా ఎస్పీ అన్నపూర్ణ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా పోలింగ్ కేంద్రాల వద్ద భధ్రతను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ఒక రోజు ముందుగానే పోలీస్ సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు.

సమస్యాత్మక పంచాయతీల్లో అదనంగా భద్రత ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు రూట్‌ల వారీగా కూడా పోలీస్ సిబ్బంది భద్రతా చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి నారాయణ సిబ్బందికి ఉన్న అనుమానాలను నివృత్తి చేశారు. ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను పోలింగ్ ముగిసిన తరువాత నిబంధనల మేరకు కౌంటింగ్ చేయాలని సూచించారు. ప్రతి 25 బ్యాలెట్ పత్రాలను బిండల్‌గా చేసి లెక్కింపు చేయాలని సూచించారు. ముందుగా వార్డు సభ్యుల కౌంటింగ్ చేయాలని, ఆ తరువాత ఇదే విధానంలో సర్పంచ్‌ల ఓట్లకు లెక్కించాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ పత్రాలను కూడా లెక్కించాలని తెలిపారు. ఆతరువాతే తుది ఫలితం ప్రకటించాలని సూచించారు. జేసీ, తాండూరు ఆర్డీఓ వేణుమాధవ్‌రావు, ఎంపీడీఓలు, తహసీల్దార్‌లు , తాండూరు డీఎస్పీ రామచంద్రుడు, పట్టన సీఐ ప్రతాపలింగం, రూరల్ సీఐ ఉపేందర్‌లు ఉన్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...