కారు జోరు.. కూటమి బేజారు


Sat,October 20, 2018 11:27 PM

-తాండూరులో కారుదే హవా...
-ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్‌ఎస్ అభ్యర్థి
-మంత్రి మహేందర్ రెడ్డి రెండో విడుత ప్రచారం షురూ..
-టీఆర్‌ఎస్‌కే అన్ని వర్గాల ప్రజల మద్దతు
-అభ్యర్థులను ప్రకటించని ప్రతిపక్షాలు
-టికెట్ కోసం కాంగ్రెస్, బీజేపీ ఆశావహుల ముమ్మర యత్నాలు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తాండూరు నియోజకవర్గంలో మరోసారి టీఆర్‌ఎస్ పార్టీదే హవా కొనసాగనుంది. ఇప్పటికే ఐదు సార్లు తాండూరు నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందిన మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మరోసారి గెలుపుబావుటా ఎగురవేసేందుకు సిద్ధంగా ఉన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో సంబ్బండ వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్ కు అండగా నిలుస్తున్నారు. నియోజకవర్గంలో మెజార్టీ ఓటర్లుగా ఉన్న ముదిరాజ్ కులస్తులు కూడా మహేందర్‌రెడ్డికి పట్టం కట్టేందుకు ఒక్కటయ్యారు. మైనార్టీ ఓటర్లు, వివిధ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు కూడా టీఆర్‌ఎస్‌కే మద్దతు తెలుపుతుండడం టీఆర్‌ఎస్‌కు కలిసి రానుంది.

తాండూరు నియోజకవర్గంలో..
తాండూరు నియోజకవర్గంలో మొత్తం 1,99,726 మంది ఓటర్లున్నారు. వీరిలో సుమారు 50 వేల మంది ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. 20 వేల మంది మైనార్టీ ఓటర్లున్నారు. వీరిలో ముదిరాజ్‌లు గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీతోపాటు కాంగ్రెస్ పార్టీకి కూడా సమాన మద్దతు తెలిపారు. అయితే ఈ దఫా ఎన్నికల్లో మాత్రం ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన 70 శాతం మంది ఓటర్లు టీఆర్‌ఎస్ పార్టీనే గెలిపించుకుంటామని ఐక్యంగా ముందుకొచ్చి మద్దతు తెలపడం టీఆర్‌ఎస్ పార్టీకి అనుకూల అంశం.

మైనార్టీ ఓటర్లు కూడా..
20 వేల మంది ముస్లిం మైనార్టీ ఓటర్లుండగా.. మెజార్టీ ముస్లిం మైనార్టీ ఓటర్లతోపాటు గొల్ల, కుర్మలు తదితర సామాజిక వర్గాల ఓటర్లు టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థికే మద్దతు తెలుపుతున్నారు.

రెండో విడత ప్రచారం..
తాండూరు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ప్రచారంలో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు. గత ఇరవై రోజులుగా నియోజకవర్గంలో తాండూరు పట్టణంతోపాటు తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, కోట్‌పల్లి మండలాల్లో అన్ని సామాజిక వర్గాల ముఖ్య నాయకులతో సమావేశాలను నిర్వహించిన మహేందర్ రెడ్డి రెండో విడత ప్రచారాన్ని ప్రారంభించారు. రెండో విడత ప్రచారంలో భాగంగా మండలాల వారీగా కార్యకర్తల సమావేశాలను నిర్వహించేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. మండలాల వారీగా కార్యకర్తల సమావేశాలను నిర్వహించిన అనంతరం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని గ్రామాల్లో ఇంటింటా ప్రచారంతో క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు పార్టీ ముఖ్య నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో పార్టీల చేరికలతో ప్రచారం నిర్వహించిన మహేందర్ రెడ్డి అన్ని గ్రామాల్లో ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

అయితే తాండూరు నియోజకవర్గంలో ఎక్కడెళ్లిన మహేందర్‌రెడ్డి ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. నియోజకవర్గంలో ఎక్కడా ప్రచార కార్యక్రమం నిర్వహించిన స్వచ్ఛందంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తూ మద్దతు పలుకుతున్నారు. ప్రచారంలో భాగంగా మంత్రి యువకులను మొదలుకొని వృద్ధుల వరకు అందరినీ కలుస్తూ, పలకరిస్తూ టీఆర్‌ఎస్ పార్టీకే ఓటేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా మద్దతుగా తెలుపుతున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్న, రాష్ర్టాన్ని అభివృద్ధిలోకి తీసుకువచ్చిన టీఆర్‌ఎస్ పార్టీకే తమ ఓటు అంటూ మహేందర్‌రెడ్డికి మద్దతుగా జనం బ్రహ్మరథం పడుతున్నారు.

ప్రతిపక్షాలకు తలనొప్పిగా అభ్యర్థుల ఎంపిక...
ఓవైపు టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మహేందర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతుంటే ప్రతిపక్ష పార్టీలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మాత్రం తలనొప్పిగా మారింది. తాండూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌తోపాటు బీజేపీ నుంచి టికెట్ ఆశావహులు అధికంగా ఉండడంతో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై ఆ పార్టీ అధిష్టానం తర్జనభర్జన పడుతోంది. రెండు పార్టీల్లోనూ టికెట్ ఆశిస్తున్న వారు గ్రూపు రాజకీయాలు చేస్తుండడంతో ఎవరికి టికెట్ ఖరారు చేస్తారనేది ఆసక్తిగా మారింది. తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్‌లో ఆది నుంచి రమేశ్ మహరాజ్ పోటీ చేస్తాడని అందరూ అనుకున్నప్పటికీ అనూహ్యంగా పైలట్ రోహిత్‌రెడ్డి ప్రచారంలోకి దిగాడు. దీంతో రమేశ్ మహారాజ్ వర్గం కూడా రోహిత్ రెడ్డికే మద్దతు పలుకుతోంది. అయితే ఇదే నియోజకవర్గం నుంచి లకా్ష్మరెడ్డి, నారాయణ రావు సైతం టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

తాండూరు నియోజకవర్గంలో సీనియర్లుగా ఉండి గత ఎన్నికల్లోనూ టికెట్‌ను ఆశించిన లకా్ష్మరెడ్డి, నారాయణ రావు, సంపత్‌ల వర్గం తీవ్రంగా వ్యతిరేకించడంతోపాటు రోహిత్‌రెడ్డికి పోటీగా ప్రచారాన్ని సైతం ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు సీనియర్లుగా ఉన్న వీరికి కాకుండా రోహిత్‌రెడ్డికి టికెట్ ఇస్తే కాంగ్రెస్ నుంచి ఓడిపోవడం ఖాయమని వారు అధిష్టానానికి వివరించినట్లు సమాచారం. మరీ తాండూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్తగా పార్టీలో చేరిన రోహిత్ రెడ్డిని బరిలో దింపుతారా లేకపోతే సీనియర్లలో ఎవరినో ఒకరిని ఖరారు చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ తరఫున కూడా ఇద్దరు ఆశావహులు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట్నుంచి పార్టీని బలోపేతం చేస్తూ విధేయుడిగా ఉన్న రమేశ్‌కుమార్‌తోపాటు ఎన్‌ఆర్‌ఐ రవిశంకర్ పటేల్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇదిలా ఉండగా శనివారం సాయంత్రం బీజేపీ అ
ధిష్టానం రవిశంకర్ పటేల్‌కు టికెట్ ఇవ్వడానికి మొగ్గు చూపినట్లు తెలిసింది.

నన్ను అవమానించారు..

తాండూరు టౌన్: దశాబ్దాలుగా బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నానని, కానీ ప్రస్తుతం తనను అవమానించి వేరే వారికి సీటు ఇవ్వడం ఏమిటని ఆ పార్టీ నేత యు.రమేశ్‌కుమార్ ప్రశ్నించారు. శనివారం బీజేపీ కార్యాలయంలో సీనియర్ నేతలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ ఎంతో కష్టపడి బీజేపీని ఓ స్థాయిలో నిలబెడితే టికెట్ ఇవ్వకుండా తమను అవమానించడం బాధకరం అన్నారు. రెండ్రోజుల్లో సీనియర్ నాయకులు, రాష్ట్ర నేతలతో చర్చ జరిపి టికెట్ వచ్చేలా ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు తేల్చి చెప్పారు. ఇందులో బీజేపీ నేతలు నాగారం నర్సింహులు, ప్యాట బాల్‌రెడ్డి, పూజారి పాండు, భద్రేశ్వర్, బొప్పి సురేశ్, అంజలి, సుజాత, రామ్యానాయక్, హన్మంతు, సర్వేశ్వర్‌రెడ్డి, కార్యకర్తలున్నారు.

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...