ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేయాలి


Fri,October 19, 2018 11:43 PM

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఎన్నికల నియమావళిని అత్యంత పటిష్టంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎంవీరెడ్డి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నోడల్ అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 7న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని, జిల్లాలో వివిధ రాజకీయ పార్టీల నాయకుల, అభ్యర్థుల, ఎన్నికల ప్రచారాలకు సంబంధించిన బ్యానర్లు, ఫ్లెక్సీ లు, గోడలపై రాతలు, వాల్ పోస్టర్లను తొలిగించాలని సూచించారు.
అలాగే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లాకు సంబంధించిన అన్ని సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణపై ప్రతి ఉద్యోగి అంకితభావంతో పని చేయాలని అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
నకిలీ ఓటర్లను తొలిగించాలి
ఓటర్ల తుది జాబితాను ఈ నెల 12న ప్రకటించినప్పటికీ, అందులో ఉన్న నకిలీ ఓటర్లను, మరణించిన వారి పేర్లను తొలిగించాలని జిల్లా ఎన్నికల అధికారి ఈఆర్వోలకు, ఏఈఆర్వోలకు సూచించారు. ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో నకిలీ ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, అలాగే అర్హులైన ఓటర్లకు జాబితాలో స్థానం కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...