నమోదుకు నేడే ఆఖరు


Mon,September 24, 2018 11:52 PM

- ఓటరుగా నమోదుకు చివరి అవకాశం
- జిల్లావ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం
- ఆన్‌లైన్‌లో 32,939 దరఖాస్తులు
- 21,058 ఆమోదించగా, మరో 2,749 తిరస్కరించిన అధికారులు
- మిగతావి రెండు,మూడు రోజుల్లో పరిశీలన
- బోగస్ ఓట్ల తొలిగింపు తర్వాత అందుబాటులోకి కొత్త జాబితా
- ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ శ్రీధర్
- నేటితో ముగియనున్న నమోదు గడువు
- కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఓటరుగా నమోదు చేసుకొనేందుకు గడువు నేటితో ముగియనుంది. 18 ఏండ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసేందుకు నేడు చివరి అవకాశం. ఆన్‌లైన్ లేదా నేరుగా ఈరోజు సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. మీసేవా కేంద్రాల్లో, ఆన్‌లైన్‌లో ceo.tela- ga- a.- ic.i- , - vsp.i- వెబ్‌సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నేరుగా ఓటరు నమోదు చేసుకునేందుకు ఫారం-6లో వివరాలను పూరించి సంబంధిత బీఎల్‌వో(బూత్ లెవల్ అధికారి)లకు కూడా అందజేయవచ్చు. పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, జనన ధ్రువీకరణ పత్రం, నిరక్షరాస్యులైతే తల్లిదండ్రులతో అఫిడవిట్ జత చేసి దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ఓటరు నమోదు కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా అపూర్వ స్పందన లభించింది. జిల్లాలోని పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో ఓటరు నమోదుకు పెద్దఎత్తున దరఖాస్తులు అందినట్లు జిల్లా ఎన్నికల యంత్రాంగం వెల్లడించింది. అదేవిధంగా వచ్చే నెల 8న ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది.

ఫారం-6 దరఖాస్తులు 32,939..
ఈనెల 10 నుంచి ఓటరు నమోదుకు జిల్లావ్యాప్తంగా అవగాహన, చైతన్య కార్యక్రమాలను జిల్లా ఎన్నికల యంత్రాంగం నిర్వహిస్తున్నది. ఓటరు నమోదు కార్యక్రమానికి జిల్లా అంతటా అపూర్వ స్పందన వస్తున్నది. ఊరూరా ప్రచారం చేయించడం, డ్రాపౌట్, నిరక్షరాస్యులను ఓటుహక్కుపై అవగాహన కల్పన, చైతన్యవంతులను చేయడం, ఉన్నత పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కాలేజీల విద్యార్థులు వారి కుటుంబ సభ్యులను చైతన్యపర్చే విధంగా ఓటరు నమోదు ఆవశ్యకతపై పుస్తకాలను పంపిణీ చేయడం, సినిమా థియేటర్లలో ప్రకటనలు, కేబుల్ ఆపరేటర్ల ద్వారా స్క్రోలింగ్ తదితరాలతో ఓటుహక్కు నమోదుకు జిల్లా ఎన్నికల అధికారులు పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లా ఎన్నికల యంత్రాంగం నిర్వహించిన కార్యక్రమాలతో జిల్లా వ్యాప్తంగా ఓటరు నమోదుకు భారీ స్పందన లభించింది. జిల్లావ్యాప్తంగా ఓటరు నమోదు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు ఫారం-6 (కొత్త ఓటరుగా నమోదుకు) కింద 32,939 మంది ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకున్నారు. పరిగి నియోజకవర్గంలో 9,654 దరఖాస్తులు, వికారాబాద్ నియోజకవర్గంలో 6,742 దరఖాస్తులు, తాండూరు నియోజకవర్గంలో 7,568 దరఖాస్తులు, కొడంగల్ నియోజకవర్గంలో 8,975 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆన్‌లైన్ ద్వారా అందిన దరఖాస్తుల్లో ఇప్పటివరకు 21,058 దరఖాస్తులను ఆమోదించగా, 2,749 దరఖాస్తులను తిరస్కరించారు. జిల్లాలో కొత్త ఓటరు నమోదుకు వచ్చిన దరఖాస్తుల్లో తిరస్కరించిన వాటిలో పరిగి నియోజకవర్గంలో 986, వికారాబాద్ నియోజకవర్గంలో 457, తాండూరు నియోజకవర్గంలో 216, కొడంగల్ నియోజకవర్గంలో 1,090 దరఖాస్తులను వివిధ కారణాలతో ఎన్నికల అధికారులు తిరస్కరించారు.

మిగతా దరఖాస్తులను మరో, రెండు మూడు రోజుల్లో పరిశీలించనున్నారు. అదేవిధంగా ఫారం-7 (ఓటరు జాబితాలో పేరు తొలిగింపు, అభ్యంతరాల స్వీకరణకు) కింద జిల్లావ్యాప్తంగా 31,197 దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా అందినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో పరిగి నియోజకవర్గంలో 11,678, వికారాబాద్ నియోజకవర్గంలో 2,537, తాండూరు నియోజకవర్గంలో 13,718, కొడంగల్ నియోజకవర్గంలో 3,264 దరఖాస్తులు అందగా, 84 దరఖాస్తులను తిరస్కరించిన సంబంధిత అధికారులు ఇప్పటివరకు 28,199 దరఖాస్తులకు ఆమోదం తెలిపారు. అదేవిధంగా ఫారం-8 (ఓటరు జాబితాలో వివరాల సవరణకు) కింద జిల్లావ్యాప్తంగా 2,042 దరఖాస్తులు అందగా, ఇప్పటివరకు 268 దరఖాస్తులకు ఆమోదం తెలుపగా, 253 దరఖాస్తులను తిరస్కరించారు. ఫారం-8లో పరిగి నియోజకవర్గంలో 440, వికారాబాద్ నియోజకవర్గంలో 825, తాండూరు నియో జకవర్గంలో 432, కొడంగల్ నియోజకవర్గంలో 345 మంది ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా ఫారం-8ఏ (నియోజకవర్గ పరిధిలో మీ నివాసం ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరో పోలింగ్ పోలింగ్ కేంద్రానికి మారినట్లయితే) కింద జిల్లావ్యాప్తంగా 284 దరఖాస్తులు అందగా, ఇప్పటివరకు 145 దరఖాస్తులకు ఆమోదం తెలిపిన ఎన్నికల అధికారులు ఏడు దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించారు. ఆఫ్‌లైన్ ద్వారా చేసుకున్న దరఖాస్తుల వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రత్యేక క్యాంపులకు విశేష స్పందన..
ఈనెల 15, 16వ తేదీల్లో నిర్వహించిన ఓటరు నమోదు ప్రత్యేక క్యాంపులకు జిల్లా అంతటా మంచి స్పందన వచ్చింది. ప్రత్యేక క్యాంపుల ద్వారా కొత్త ఓటరుగా చేరడంతో పాటు మార్పులు, అభ్యంతరాలను పరిష్కరించారు. జిల్లాలోని 1,095 పోలింగ్ కేంద్రాల్లో 15, 16 తేదీల్లో ప్రత్యేక క్యాంపులను నిర్వహించారు. ఈ రెండు రోజుల్లో జిల్లావ్యాప్తంగా కొత్తగా ఓటరుగా నమోదు చేసుకొనేందుకు 7,534 మంది యువతీ యువకులు దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగా ఓటరుగా చేరేందుకు దరఖాస్తు చేసుకున్న వారిలో 18-19 మధ్య ఏండ్ల వయస్సు వారు 3,339 మంది దరఖాస్తు చేసుకోగా, 19 ఏండ్లు పైబడిన వారు 4,195 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫారం-7 కింద 431 దరఖాస్తులు, ఫారం-8 కింద 314 దరఖాస్తులు, ఫారం-8ఏ కింద 37 మంది ప్రత్యేక క్యాంపుల్లో దరఖాస్తు చేసుకున్నారు.

అక్టోబర్ 8న ఓటర్ల తుది జాబితా..
ఇప్పటికే ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటించిన ఎన్నికల యంత్రాంగం అభ్యంతరాల స్వీకరణ, కొత్త ఓటర్ల నమోదుకు ఈనెల 25 వరకు గడువిచ్చింది. వచ్చే నెల 4న డిస్పోసల్ ప్రక్రియను పూర్తి చేసి, 7న ఓటరు జాబితాను ఎన్నికల సంఘం ముద్రించనుంది. అనంతరం అక్టోబర్ 8న ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. అదేవిధంగా ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటరు ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో 7,97,641 మంది ఓటర్లుండగా, వీరిలో పురుషులు 4,02,001 మంది ఓటర్లు, మహిళా ఓటర్లు 3,95,270 మంది ఓటర్లు, ఇతరులు 53 మంది ఓటర్లు, సర్వీస్ ఎలక్టోర్స్ 317 మంది ఓటర్లు ఉన్నారు. పరిగి నియోజకవర్గంలో 2,18,086, వికారాబాద్ నియోజకవర్గంలో 2,00,117, తాండూరు నియోజకవర్గంలో 1,90,360, కొడంగల్ నియోజకవర్గంలో 1,89,078 మంది ఓటర్లున్నారు.

మంచి స్పందన వచ్చింది..
జిల్లాలో ఈనెల 10 నుంచి నిర్వహిస్తున్న ఓటరు నమోదు కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ఓటరు నమోదు కార్యక్రమంపై జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలను నిర్వహించాం. ప్రతి గ్రామ పంచాయతీలో టాంటాం చేయించాం. థియేటర్లలో ప్రకటనలు, కేబుల్ ఆపరేటర్ల ద్వారా స్క్రోలింగ్, బ్యానర్ల ద్వారా ప్రచారం చేపట్టాం. బోగస్ ఓటర్లు ఎవరైనా ఉంటే క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం తొలిగిస్తాం.
- శ్రీధర్, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...