ఆశీర్వదించండి


Wed,September 12, 2018 11:36 PM

-నియోజకవర్గ అభివృద్ధికి ఇదివరకే రూ.300 కోట్లు మంజూరు చేయించా
-గెలిస్తే మరిన్ని నిధులు తీసుకొస్తా
-రేవంత్.. జిత్తులమారి నక్క
-కాంగ్రెస్.. స్కాంల పుట్ట
-కొడంగల్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేఅభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి
-కోస్గిలో ఎన్నికల ప్రచారం
కొడంగల్, నమస్తే తెలంగాణ: ఆశీర్వదించండి. ఎమ్మెల్యేగా గెలిపిస్తే కొడంగల్ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ, కొడంగల్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి ప్రజలను కోరారు. బుధవారం కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీతో కోస్గి పట్టణం గులాబీమయమైంది. పట్టణ కూడలి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజలతో కిక్కిరిసింది. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. శివాజీ కూడలిలో ఏర్పాటు చేసిన సమావేశంలో నరేందర్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్‌ది స్కాంలతో కూడిన పాలనా వ్యవస్థ అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే భావన వారిలో లేదన్నారు. ఎవరికి వారే సీఎం అభ్యర్థులుగా ప్రకటించుకొని పోట్లాడడం వారి నైజమన్నారు. రెండు రోజుల క్రితమే అరెస్టయి ఓ నాయకుడు ఊచలు లెక్కపెడుతున్నాడని, త్వరలో రేవంత్‌రెడ్డికి కూడా అదే గతి పట్టనుందన్నారు. స్కాంలు, గుండాయిజం చేసే నైజం రేవంత్‌రెడ్డిదని పేర్కొన్నారు. గతంలో ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా నిలిచారన్నారు. కాంగ్రెస్ నాయకులు తమ కడుపులు నింపుకునేందుకే ప్రయత్నం చేస్తారని విమర్శించారు. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని ముందుకెళ్తుందని, తరిమికొట్టిన ఆంధ్రా పాలలను మళ్లీ తెలంగాణకు అంటగట్టేందుకు పథకం పన్నుతుందని ధ్వజమెత్తారు. ప్రజలు అలర్ట్‌గా ఉండాలని, కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఆంధ్రా పాలనకు మళ్లీ బానిస కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. జిత్తుల మారి నక్క రేవంత్‌రెడ్డిని, మాలతో మాయ చేసి లింగాన్ని మింగే వ్యక్తి అని తెలిపారు.

కొడంగల్ ప్రజలు అయాయకులని, కాబట్టే ఆయన మోసపూరితమైన మాటలను నమ్మి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. కొడంగల్‌ను అడ్డం పెట్టుకొని హైదరాబాద్‌లో సెటిల్‌మెంట్ దందాలకు పాల్పడుతున్నారన్నారు. టీడీపీలో హైదరాబాద్‌కు పరిమితమైన రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌లో ఢిల్లీకి పరిమితమవుతారన్నారు. కోస్గిలో మంజూరు కాని బస్ డిపోను మంజూరైనట్లు హడావిడిన గత ఎన్నికల్లో హైడ్రామా సృష్టించి బస్‌డిపోకు శంకుస్థాపన చేపట్టారని, శంకుస్థాప చేసిన డిపోను నిర్మాణం చేపట్టడంలో ఎందుకు ఆసక్తిని చూపలేదో ఓసారి ప్రశ్నించాలని కోరారు. టీఆర్‌ఎస్‌లో ప్రజలకు సేవ చేసే నాయకులు ఉన్నారని, ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యంగా పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించి వెనుబడిన కొడంగల్‌ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఇదివరకే రూ.300 కోట్లు మంజూరు చేశారన్నారు. గతంలో ఏ సీఎం ఇంత పెద్ద మొత్తంలో ఓ నియోజకవర్గానికి నిధులు మంజూరు చేసిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. కోస్గి బస్ డిపో నిర్మాణానికి రూ.3 కోట్లు, బస్టాండ్ మరమ్మతులకు మరో రూ.3 కోట్లు మంజూరు చేసి డిపో నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు పనులు ప్రారంభించినట్లు తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతు బీమా, ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్ వంటి ఎన్నో అద్భుత పథకాలను ప్రజలకు అందించారన్నారు.

నేడు గ్రామ గ్రామాన టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నారని, ఎన్నికల్లో 100కు పైగా సీట్లు గెలిపించి మళ్లీ కేసీఆర్‌ను సీఎం చేసేందుకు ప్రజలు ఆసక్తిని కనబరుస్తున్నట్లు పేర్కొన్నారు. కొడంగల్‌లో నరేందర్‌రెడ్డి గెలుపు భారీ మెజార్టీతో ఉంటుందని, గులాబీ జెండా ఎగురేందుకు సిద్ధంగా ఉందన్నారు. మాటల పిట్ట రేవంత్‌రెడ్డిని ప్రజలు తరిమికొట్టాలన్నారు. ఇది గ్రహించిన రేవంత్‌రెడ్డి కొడంగల్ నుంచి కాకుండా ఇతరత్రా ప్రాంతాల నుంచి పోటీ చేయాలని పన్నాగం పన్నుతున్నారన్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చిందని, ఈసారి ఓటమి తప్పదనే భయం ఆయనలో పుట్టిందని, కాబట్టే పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జితేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్‌రెడ్డి, ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, టీఆర్‌ఎస్ కోస్గి, బొంరాస్‌పేట మండలాల అధ్యక్షులు అన్న కిష్టప్ప, విష్ణువర్ధన్‌రెడ్డి మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కృష్ణ, టీఆర్‌ఎస్ నాయకులు సలీం, బాల్‌సింగ్‌నాయక్, గందె ఓంప్రకాశ్, గందె మోహన్, మధుసూదన్‌యాదవ్, కోట్ల మహిపాల్, బాల్‌రాజ్, బుడాన్‌సాబ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధే టీఆర్‌ఎస్ లక్ష్యం: ఎంపీ జితేందర్‌రెడ్డి
టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే దేశ పటంలో తెలంగాణకు ప్రత్యేక స్థానం లభించిందని మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణను ఉన్నత స్థాయిలో ఉంచాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఆ దిశగా తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక పథకాలను సృష్టించి అమలు చేస్తున్నారన్నారు. కాబట్టే నేడు టీఆర్‌ఎస్ వైపు ప్రజలు ఆసక్తిని కనబరుస్తున్నారని చెప్పారు. గ్రామాలను సందర్శిస్తే గుండెలకు హత్తుకొంటున్నట్లు పేర్కొన్నారు. ప్రజాభిమానాన్ని చూస్తూంటే ఆనందం వేస్తుందన్నారు. అభివృద్ధి చేసినందుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్లు పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాల్లో కాలర్ ఎగరేసి తెలంగాణ అభివృద్ధిని చాటి చెప్పినట్లు తెలిపారు. నాలుగున్న సంవత్సరాల కాలంలోనే తెలంగాణ రాష్ట్రం దేశంలోని అన్ని రాష్ర్టాలకు ఓ బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిందన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి విదేశీయులు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారన్నారు. గురుకులాలను ఏర్పాటు చేసి బీద బడుగు వర్గాల వారికి నాణ్యతతో కూడిని విద్యనందిస్తున్నట్లు చెప్పారు.

గతంలో పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు అప్పులు చేసే పరిస్థితి ఏర్పడేదన్నారు. కానీ నేడు రైతులు ఆత్మాభిమానంతో పంట సాగును చేసుకుంటున్నారన్నారు. అదేవిధంగా రైతుకు దురదృష్టవశాత్తు ఏదైనా జరిగి మరణిస్తే రైతు కుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించినట్లు తెలిపారు. మహబూబ్‌గనర్ జిల్లా పరివాహక ప్రదేశంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుందని, ఈ నది ద్వారా మనం 100 టీఎంసీల నీటిని వాడుకోవాల్సి ఉండగా, వాటిని సీమాంధ్ర పాలకులు దోచుకున్నారన్నారు. గతంలో లక్ష ఎకరాలు సాగు చేసుకునే పరిస్థితి ఉంటే ప్రస్తుత నాలుగున్నర సంవత్సరాల కాలంలో 9 లక్షల మెట్రిక్ టన్నుల సాగు చేసుకునే అవకాశం ఏర్పడిందన్నారు. 30 వేల మెట్రిక్ టన్నుల వరి పంటను పండిస్తున్నట్లు వెల్లడించారు. కోతలు లేని 24 గంటల కరెంటు సరఫరా కేవలం తెలంగాణలోనే కొనసాగుతుందన్నారు. ఇంత పెద్ద మొత్తంలో అభివృద్ధి జరుగుతుంటే ఇతర పార్టీలతో మనకు పనేముందని, వాటిని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ను మళ్లీ సీఎంగా గెలిపించుకుందామని కోరారు. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ అందుబాటులో ఉండి త్వరగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని, అదే కాంగ్రెస్ ఢిల్లీలో ఉండి నిర్ణయాలు తీసుకోవాలంటే చాలా కాలం పడుతుందన్నారు. అసెంబ్లీని రద్దు చేసిన నాడే సీఎం కేసీఆర్ 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారని, కానీ కాంగ్రెస్ వాళ్లు నేటి వరకు కూడా ఒక్క అభ్యర్థిని ప్రకటించలేదన్నారు. వాళ్లకు ఢిల్లీ నుంచి ఆదేశాలు రావాల్సి ఉంటుందన్నారు. ప్రజలు అభివృద్ధికి మద్దతు పలుకాలని విజ్ఞప్తి చేశారు.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...