ఆదరించి..ఆశీర్వదించండి


Tue,September 11, 2018 11:55 PM

-నాలుగు దశాబ్దాలుగా అండగా నిలిచారు
-నాలాగే మహేశ్‌రెడ్డికి కూడా అవకాశం ఇవ్వండి
-జీవితాంతం ప్రజాసేవలో ఉంటా
-నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా
-పరిగి ప్రజలను కోరిన మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి
-టికెట్ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
పరిగి, నమస్తే తెలంగాణ: పరిగి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల మహేశ్‌రెడ్డి ప్రచారాన్ని షురూ చేశారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మంగళవారం తొలిసారి పరిగికి వచ్చిన మహేశ్‌రెడ్డికి అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. పట్టణంలో టీఆర్‌ఎస్ నాయకుడు ఎ.గోపాల్ ప్రత్యేకంగా గుమ్మడికాయతో దిష్టి తీశారు. అనంతరం గోపాల్ దంపతులు శాలువా, పూలమాలలతో సన్మానించారు. పరిగి పట్టణ కిరాణ అసోసియేషన్ అధ్యక్షుడు అఫ్జల్‌హుస్సేన్ మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్థి మహేశ్‌రెడ్డిలను ఘనంగా సన్మానించి, స్వీట్లు తినిపించారు. పట్టణంలోని బెస్తవాడలో మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు శివరాజ్, సంఘం నాయకులు మహేశ్‌రెడ్డికి స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. అనంతరం పరిగి మాజీ సర్పంచ్ ఎ.విజయమాలతో పాటు పలువురు మహిళలు, న్యాయవాదులు వేర్వేరుగా మహేశ్‌రెడ్డిని కలిసి స్వీట్లు తినిపించారు.

మోటార్ సైకిళ్ల ర్యాలీ

ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల మహేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం పెద్ద ఎత్తున మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. ముందుగా పరిగిలోని మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి నివాసం నుంచి ప్రారంభమైన మోటార్ సైకిళ్ల ర్యాలీ హనుమాన్‌గండి ఆంజనేయ స్వామి దేవాలయం వరకు కొనసాగింది. అక్కడ మహేశ్‌రెడ్డికి స్వాగతం పలికిన నాయకులు హనుమాన్‌గండి నుంచి పరిగిలోని టెలిఫోన్ ఎక్సేంజ్, గంజ్‌రోడ్డు, ప్రధాన రహదారి, పాత పరిగి, పోస్టాఫీసు, బెస్తవాడ, బహార్‌పేట్‌ల మీదుగా తెలంగాణ అమరవీరుల క్రాస్‌రోడ్డు వరకు మోటార్‌సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. పరిగి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సుమారు 500 పైచిలుకు మోటార్ సైకిళ్లతో భారీ ర్యాలీ చేపట్టారు. పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో కార్యకర్తలు హుషారుగా పాలుపంచుకున్నారు. అంబేద్కర్ విగ్రహం నుంచి హరీశ్వర్‌రెడ్డి నివాసం వరకు మైనార్టీ నాయకులు సైతం ప్రత్యేకంగా మోటార్ సైకిళ్లతో ర్యాలీ జరిపారు.

ఆలయాల్లో పూజలు

పరిగి నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల మహేశ్‌రెడ్డి మంగళవారం ఎన్నికల ప్రచారం ప్రారంభోత్సవం సందర్భంగా మండల పరిధిలోని హనుమాన్‌గండి ఆంజనేయ స్వామి దేవాలయం, పరిగిలోని లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి దంపతులు, టీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల మహేశ్‌రెడ్డి దంపతులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా మహేశ్‌రెడ్డి తమ తల్లిదండ్రులు గిరిజాదేవి-హరీశ్వర్‌రెడ్డిల ఆశీర్వాదం తీసుకున్నారు. హనుమాన్ గండి వద్ద కోడలు ప్రతిమకు హరీశ్వర్‌రెడ్డి సతీమణి గిరిజాదేవి టీఆర్‌ఎస్ కండువా కప్పడంతో పార్టీ శ్రేణులు హర్షధ్వానాలు చేశారు. దాడి పొడవునా గిరిజన మహిళలు నృత్యాలు, ఊరేగింపు నిర్వహించారు.

టీఆర్‌ఎస్‌లో చేరిక

పరిగి పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు నవీన్‌రెడ్డి మంగళవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మహేశ్‌రెడ్డి సమక్షంలో నవీన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు.

మహేశ్‌రెడ్డిని ఆశీర్వదించండి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి

పరిగి, నమస్తే తెలంగాణ: తనకు నాలుగు దశాబ్దాలుగా ప్రజాసేవ చేయడానికి అవకాశం కల్పించిన పరిగి నియోజకవర్గ ప్రజలు తన కుమారుడు మహేశ్‌రెడ్డిని ఆశీర్వదించాలని మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి కోరారు. మంగళవారం పరిగిలోని తమ నివాసం వద్ద హరీశ్వర్‌రెడ్డి పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. నాలుగు దశాబ్దాలుగా తనను పరిగి సర్పంచ్‌గా, ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించడం ద్వారా ప్రజాసేవకు అవకాశం కల్పించారన్నారు. తన శాయశక్తులా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేశానన్నారు. ఈసారి తన కుమారుడు కొప్పుల మహేశ్‌రెడ్డికి సీఎం కేసీఆర్ పార్టీ టికెట్ ఇచ్చి మీ ముందుకు పంపించారని, మహేశ్‌రెడ్డిని తనలాగే ఆదరించాలని కోరారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ద్వారా పెద్ద ఎత్తున పరిగి నియోజకవర్గానికి అభివృద్ధి పనులు చేపట్టడానికి నిధులు వచ్చాయని తెలిపారు. కార్యకర్తల కుటుంబానికి పెద్దన్నలా అండగా ఉంటానని, పార్టీ నాయకులు, కార్యకర్తలు మహేశ్‌రెడ్డి వెన్నంటే నిలిచి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తన జీవితాంతం ప్రజాసేవలోనే ఉంటానని, అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తానని హరీశ్వర్‌రెడ్డి చెప్పారు. తన కుమారుడు మహేశ్‌రెడ్డికి పార్టీ టికెట్ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

రేవంత్‌కు ఓటేస్తే.. రాహుల్ చుట్టే

కొడంగల్, నమస్తే తెలంగాణ: గత రెండు పర్యాయాలు ఓటేసి రేవంత్‌రెడ్డిని కొడంగల్ ప్రజలు గెలిపేస్తే చంద్రబాబు చుట్టూ తిరిగారని.. ఈసారి గెలిస్తే ఢిల్లీలో రాహుల్‌గాంధీ చుట్టూ తిరుగుతాడని కొడంగల్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం బొంరాస్‌పేట మండలం కొత్తూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌పై పంచ్ డైలాగ్ వదిలారు. గతంలో హైదరాబాద్‌లోనైనా అందుబాటులో ఉండే పరిస్థితి ఉండేది. ఈసారి గెలిస్తే ఢిల్లీ వెళ్లి ఆయనను కలిసే దౌర్భాగ్యం ఏర్పడుతుంది. లౌక్యంగా ఆలోచించి ఓటేయండి అని పేర్కొన్నారు.

121
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...